test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యూబాపై అమెరికా మరో కుట్ర

22 మే, 2026

cuba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 08:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఖండించిన క్యూబా

  • కరేబియన్‌ తీరంలో యుద్ధ నౌకల మోహరింపు

వాషింగ్టన్‌, హవానా : 30ఏళ్ళ నాటి ఒక విమాన ప్రమాదానికి సంబంధించి క్యూబా విప్లవ నేత రౌల్‌‌ కాస్ట్రోపై హత్యాభియోగాన్ని మోపుతూ అమెరికా బుధవారం నాడు ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో రౌల్‌‌ కాస్ట్రో రక్షణ మంత్రిగా వున్నారు. దాడికి ఆదేశాలిచ్చింది ఆయనేనని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో అమెరికా, క్యూబాల మధ్య ఉద్రికత్తలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయి.

అసలేం జరిగింది?

1996లో రెండు పౌర విమానాల కూలిపోయాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా.. వారిలో ముగ్గురు అమెరికన్లు. అంతర్జాతీయ గగనతలంలో రెండు క్యూబా మిగ్‌ ఫైటర్లు ఈ దాడులు చేసినట్లు అమెరికా ఆరోపిస్తుంది. తన సోదరుడు ఫిడెల్‌ క్యాస్ట్రోతో కలిసి రౌల్‌ క్యాస్ట్రో గెరిల్లా యుద్ధం చేసి నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసాడు. అనంతరం క్యూబాపై అమెరికా కుట్రలను తిప్పికొట్టడంలో రౌల్‌ ‌కాస్ట్రో కీలక పాత్ర వహించారు. దీంతోపాటు 1961లో క్యూబాను ఆక్రమించేందుకు అమెరికా చేపట్టిన ‘బేఆఫ్‌ పిగ్స్‌’ ఆపరేషన్‌ విఫలం చేసింది కూడా రౌల్‌ క్యాస్ట్రోనే. క్యూబా రక్షణమంత్రిగా, ఫిడెల్‌ తరువాత అధ్యక్షుడిగా పనిచేశారు.

క్యూబా ఎప్పటీకీ లొంగదు : డియాజ్‌ ‌కానెల్‌

కాగా ఈ పరిణామాలపై క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్‌ ‌డియాజ్‌ ‌కానెల్‌ ‌తీవ్రంగా స్పందించారు. రాల్‌ ‌కాస్ట్రోపై అమెరికా అభిశంసనను తీవ్రంగా ఖండించారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నదేనని, తద్వారా క్యూబాపై ఒత్తిడి పెంచాలని అమెరికా యోచిస్తోందని విమర్శించారు. ఇవన్నీ రాజకీయ కవ్వింపు చర్యలని అన్నారు. క్యూబాపై సైనిక చర్య చేపట్టడానికి ఒక సాకుగా దీన్ని తెరపైకి తీసుకువచ్చారని మిగ్వెల్‌ ‌విమర్శించారు. ఈ ఘటనకు తమకెలాంటి సంబంధం లేదని, ఆ విమానాలు తమ గగనతలాన్ని ఉల్లంఘించాయని క్యూబా దీర్ఘకాలంగా చెబుతూ వస్తోంది. పైగా విమానాలను కూల్చివేయాలని తాను గానీ రాల్‌ ‌కాస్ట్రోగానీ ఆదేశాలివ్వలేదని అప్పటి అధ్యక్షుడు ఫిడెల్‌ ‌కాస్ట్రో కూడా స్పష్టం చేశారు. అమెరికా, క్యూబాల మధ్య ఇప్పటికే నెలకొన్న శతృత్వాన్ని సమర్ధించుకునేందుకు ఎప్పడో 30ఏళ్ళనాటి విమానం కూల్చివేత సంఘటనను తవ్వతున్నారని క్యూబా నేతలు విమర్శించారు. ఆనాటి ఘటనలో నలుగురు అమెరికన్లు మరణించారు. ఇరాన్‌ ‌తర్వాత ఇక క్యూబాదే వంతు అంటూ గత కొంతకాలంగా ట్రంప్‌‌ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో క్యూబాపై దాడి వల్ల ట్రంప్‌ మరింత ప్రజాదరణ కోల్పోవడం తప్ప జరిగేదేమీ లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరేబియన్‌‌ సముద్రంలో యుద్ధ నౌక మోహరింపు..

ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా నౌకాదళానికి చెందిన భారీ విమాన వాహక నౌక యుఎస్ఎస్ నిమిట్జ్ తన స్ట్రైక్ గ్రూప్‌తో కరేబియన్ సముద్రానికి చేరుకుంది. కరేబియన్, లాటిన్ అమెరికాలో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే యుఎస్ సదరన్ కమాండ్ (సౌత్‌కామ్) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవలే ఈ యుద్ధనౌక రియో డి జనీరో తీరంలో బ్రెజిల్ నౌకాదళంతో కలిసి సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, “ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం క్యూబన్-అమెరికన్లకే కాకుండా, క్యూబా నుండి వచ్చి తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్లాలనుకుంటున్న వారికి కూడా ఒక మంచి సందర్భం” అంటూ బెదిరించారు.
మరోవైపు క్యూబన్-అమెరికన్ అయిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, క్యూబా ప్రజలకు స్పానిష్ భాషలో ఒక సందేశాన్ని జారీ చేశారు. దానిలో ఆయన క్యూబాపై అమెరికా విధించిన ఇంధన ఆంక్షలను సమర్థించారు. కొనసాగుతున్న విద్యుత్ కోతలకు క్యూబా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే కారణమంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రపంచాన్ని అనేక సార్లు ధ్వంసం చేసే ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా, క్యూబా కేవలం ఇటీవల 300 డ్రోనులను కొనుగోలు చేసిందని, ఇది అమెరికా భద్రతకు ముప్పు అని భావించడం హాస్యాస్పదమని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్