కోల్ కతా : సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై మాజీ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బుధవారం కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై సిఐడి దర్యాప్తు చేపడుతోందని, సిఐడి ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా తనకు రక్షణ కల్పించాలని పిటిషన్ లో కోరారు. కోల్ కత్తా హైకోర్టు న్యాయమూర్తి అపూర్వ సిన్హా రే నేతృత్వంలోని వెకేషన్ బెంచ్, ఈ అంశంపై శుక్రవారం (జూన్ 5) విచారణ జరపడానికి అనుమతి ఇచ్చిందని వర్గాలు తెలిపాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (ఎల్ ఒ పి) శోభన్‌దేబ్ చటోపాధ్యాయను పార్టీ ఎంపిక చేసినట్లు రాసిన లేఖలో అభిషేక్ బెనర్జీ సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ, ఇద్దరు టిఎంసి ఎమ్మెల్యేలు రిటాబ్రత బెనర్జీ, సందీపన్ సాహా అసెంబ్లీ స్పీకర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా, చీఫ్ విప్ పదవులపై పార్టీ నిర్ణయాలను ప్రకటించడానికి అభిషేక్ బెనర్జీ మే 20న లేఖను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఈ లేఖపై సుమారు 70 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అయితే వీటిలో దాదాపు 12 పేర్లను బోల్డ్‌లో హైలైట్ చేశారు. ఈ సంతకాలు ఫోర్జరీ చేయబడ్డాయని రిటాబ్రత బెనర్జీ, సందీపన్ సాహా ఆరోపించారు. ఎల్ ఒ పి ఎంపిక ప్రక్రియలో తమతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనలేదని పేర్కొన్నారు. వారిద్దరి ఫిర్యాదు మేరకు అభిషేక్ బెనర్జీపై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సువేందు అధికారి పార్టీ నుండి బహిష్కరించడం గమనార్హం. ఎఫ్ ఐఆర్ పై జూన్ 1న పశ్చిమ బెంగాల్ ప్రధాన పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అనారోగ్య సమస్యల పేరుతో 15 రోజుల గడువు ఇవ్వాలని కోరారు.
టిఎంసిలో అంతర్గత విబేధాలు
ఈ వివాదం తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర అంతర్గత విభేదాలకు దారితీసింది. పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీతో సుమారు 50 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని, వారందరూ కలిసి పార్టీని వీడే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై రిటాబత్ర బెనర్జీ స్పందించాల్సి వుంది.









కామెంట్లు (0)