పెట్రో కెమికల్స్,అనుబంధ పరిశ్రమల్లో నైపుణ్యాభివృద్ధి,సాంకేతిక సేవలు,పరిశోధనలకు అంకితమైన సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్).ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో ప్లాస్టిక్ కోర్సులు అందిస్తూ ఎందరో యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కోర్సు పూర్తయిన వెంటనే కొలువులు అందించే చదువులు కొన్నే ఉంటాయి.వాటిలో చెప్పుకోదగ్గవి ప్లాస్టిక్ డిప్లొమాలు.తక్కువ వయసులోనే సత్వర ఉపాధి పొందాలనుకునేవారికి ఈకోర్సులు భరోసాను ఇస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
పదో తరగతి పూర్తయిన తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ)ఒక అద్భుతమైన వేదిక. 1968లో భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపితమైన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ప్లాస్టిక్స్,అనుబంధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 50 ఏళ్లకు పైగా దేశానికి సేవలందిస్తున్న సీఐపీఈటీ,అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తరించి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. మన దైనందిన జీవితంలోనూ, రోజువారీ వ్యవహారాల్లో మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని వస్తువుల్లోనూ ప్లాస్టిక్ వస్తువులు భాగమయ్యాయి. పరిశ్రమలు కూడా ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్,అనుబంధ విభాగాల్లో మేటి మానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో కేంద్ర రసాయనాలు,ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) ఏర్పాటైంది. గతంలో దీన్ని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీగా పిలిచేవారు. ఈ సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో డిప్లొమా, పోస్టు డిప్లొమా,పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు అందదుబాటులో ఉన్నాయి. ఏటేటా నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులను బట్టి ప్రవేశం లభిస్తుంది._ కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో డిప్లొమా,పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది._అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవటానికి మరికొంత సమయం కూడా ఉంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో హైదరాబాద్, ఆంధ్రాలో విజయవాడ (సూరంపల్లి)లో సిపెట్ కేంద్రాలు ఉన్నాయి. ఇవే కాకుండా అహ్మదాబాద్, అమృత్‌సర్, ఔరంగాబాద్, బడ్డీ, బాలాసోర్, భోపాల్, భువనేశ్వర్,చంద్రపూర్, చెన్నై, డెహ్రాదూన్, గువాహటి,హాజీపూర్, హల్దియా, ఇంఫాల్, జయపూర్, కోచి, లఖ్‌నవూ, మధురై, ముర్థల్, మైసూరు, రాయ్‌పూర్, రాంచీ, కోర్బ, అగర్తల, గ్వాలియర్, వారణాసి, భగల్‌పూర్, అయోధ్యల్లో ఉన్నాయి. _
ఉద్యోగ అవకాశాలు
ప్లాస్టిక్ డిప్లొమాలు పూర్తి చేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో మేటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.ఓఎన్‌జీసీ,ఓల్టాస్,మిల్టన్,సెలో,ఎల్‌అండ్‌టీ,మారుతీ సుజుకీ,రిలయన్స్,ఐఎఫ్‌బీ,బీపీఎల్,హెచ్‌సీఎల్,ఏషియన్ పెయింట్స్,బటర్‌ఫ్లై,టాటా..తదితర సంస్థలు వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్జూమర్ గూడ్స్,మెషీన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,ఆర్ అండ్ డీ..తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో సేవలందించడానికి ప్లాస్టిక్‌పై పట్టున్నవారు అవసరం. అందువల్ల ఈ కోర్సులు చదివినవారి ఉపాధికి ఢోకా లేదు. కొన్నేళ్ల అనుభవంతో మెరుగైన వేతనాలూ అందుకోవచ్చు.సొంతంగానూ చిన్న పరిశ్రమను నెలకొల్పవొచ్చు. _
ఆన్ లైన్ లో పరీక్ష : సిపెట్ కేంద్రాల్లోని అన్ని కోర్సులకూ పరీక్షను ఆన్‌లైన్‌లో విడిగా నిర్వహిస్తారు. దీని వ్యవధి 60నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి.మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. మాదిరి ప్రశ్నలు సిపెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించి, ప్రశ్నాంశాలపై అవగాహన పెంచుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ విభాగంలో స్పోర్ట్స్, హిస్టరీ, పాలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో సైన్స్,ఇంగ్లీష్ ప్రశ్నలు పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు బాగా చదువుకున్నవారు ఎక్కువ మార్కులు పొందొచ్చు. _
సిపెట్‌లో ప్లాస్టిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ కోర్సులు బీటెక్‌లో భాగంగా అందిస్తున్నారు. అలాగే ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులూ ఇక్కడ చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశాలకు విడిగా ప్రకటన వెలువడుతుంది.
కోర్సులు,అర్హత,పరీక్ష వివరాలు
కోర్సు: డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ)_
వ్యవధి: మూడేళ్లు(6సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/సమాన స్థాయి ఉత్తీర్ణత. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్20, ఇంగ్లీష్ 5ప్రశ్నలు వస్తాయి.
కోర్సు:_డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ)వ్యవధి: మూడేళ్లు(6సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/సమాన స్థాయి ఉత్తీర్ణత. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారూ అర్హులే. _పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 25,సైన్స్20,ఇంగ్లీష్, 5ప్రశ్నలు వస్తాయి.
కోర్సు:_పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/క్యామ్(పీడీ-పీఎండీ)_
వ్యవధి:18 నెలలు(3సెమిస్టర్లు)అర్హత:_మెకానికల్/ప్లాస్టిక్ టెక్నాలజీ/టూల్/ప్రొడక్షన్/ఆటోమొబైల్/మెకట్రానిక్స్/టూల్ డై అండ్ మేకింగ్/సిపెట్ నుంచి డీపీఎంటీ/డీపీటీ వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
చివరి ఏడాది కోర్సులో ఉన్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్10, ఇంగ్లీష్ 10, సంబంధిత డిప్లొమా నుంచి 10ప్రశ్నలు వస్తాయి.
కోర్సు:_పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ-పీపీటీ)
వ్యవధి: రెండేళ్లు(4సెమిస్టర్లు)
అర్హత:_ఏదైనా సైన్స్ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 20,సైన్స్10,ఇంగ్లీష్ 10, బీఎస్సీ స్థాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్10ప్రశ్నలు వస్తాయి.పై కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్‌లో అందిస్తున్నారు.పీడీ-పీఎండీ తప్ప మిగతా మూడూ కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని క్యాంపస్‌లో ఉన్నాయి.
అన్ని కోర్సులకూ ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలుఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు తేదీ:మే28._పరీక్ష ఫీజు: ఎస్సీ,ఎస్టీలకు రూ.250.మిగిలిన అందరికీ రూ.500.
పరీక్ష తేదీ: జూన్7 _వెబ్‌సైట్:https://www.cipet.gov.in
నిపుణత..నైపుణ్యమే లక్ష్యంగా...
సూరంపల్లిలోని సిపెట్ కేంద్రంలో 2019నుంచి2026 వరకూ ఇప్పటివరకూ ఆరు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 2015లో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో తక్కువ వ్యవధి కలిగిన వృత్తివిద్యా కోర్సులు,స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నడిచాయి. 2019 నుంచి డిప్లమో కోర్సులు కొనసాగుతున్నాయి.
డిప్లమో ఇన్ ప్లాస్టిక్ మౌల్డు టెక్నాలజీ (డిపిఎంటి)-మూడేళ్లు-పదవ తరగతి అర్హత
డిప్లమో ప్లాస్టిక్ టెక్నాలజీ(డిపిటి)-మూడేళ్లు-పదోతరగతి అర్హతపోస్టు గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్-రెండేళ్లు-బిఎస్సీ అర్హత (మూడేళ్లు సైన్సు డిగ్రీ)
ఇంటర్,పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీగా డిప్లమో కోర్సులో ద్వితీయ సంవత్సరం చేరొచ్చు.
ఒక్కో కోర్సుకు 60 మందికి చొప్పున విద్యార్థినీ విద్యార్థులు ఇక్కడ అత్యాధిక ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యాపరమైన, వృత్తిపరమైన కోర్సుగా యంత్రాలపై తర్ఫీదు పొందుతున్నారు.Advanced CNC milling,lathe, EDM-ELECTRO DISCHARGE MACHINING WEDM-WIRE ELECTRO DISCHARGE MACHINING, All electric injection moulding machines, Microprocessor based injection moulding machinesఅందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ప్రమాణాలతో కూడిన వసతి గృహం ఉంది. ఇక్కడ విద్యార్థులకు ఎంతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం.పూర్తి వసతి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకూ70 వరకూ బహుళజాతి కంపెనీలు ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని వచ్చాయి. వాటిలో ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి.ప్లేస్‌మెంట్ పరంగా చూస్తే రూ.2.40 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాయి.ఇప్పటికే చాలామంది విద్యార్థులు వీటిల్లో చేరి పనిచేస్తున్నారు.విదేశీ కంపెనీలు కూడా ఆహ్వానిస్తున్నాయి.ఇప్పటికే సూరంపల్లి కేంద్రం నుంచి ఏటేటా కొంమంది విద్యార్థులు విదేశాల్లో చదువు కుంటున్నారు.ఉద్యోగాలు సైతం చేస్తున్నారు.

డాక్టర్ చింతా శేఖర్
Director & Head CIPET :
Centre for Skilling and Technical Support (CSTS) - Vijayawada
సెల్ : 9959333414, 72290 04049








కామెంట్‌లు (0)