test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆప‌రేష‌న్‌ క్లీన్‌స్వీప్‌ లో ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావాలి

23 మే, 2026

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 23, 2026, 01:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎంఎల్ఏ అదితితో క‌లిసి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప‌ట్ట‌ణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుప‌రిచి, ప‌రిశుభ్రంగా రూపొందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా భాగ‌స్వాములై విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి ఎంఎల్ఏ పూస‌పాటి అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజుతో క‌లిసి శ‌నివారం ఉద‌యం స్థానిక జెడ్‌పి కార్యాల‌యం స‌మీపంలో శ్రీ‌కారం చుట్టారు. దీనిలో భాగంగా వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో యెల్లో స్పాట్ల‌ను క‌డిగి దుర్వాస‌న‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌ను, గోడ‌ల‌కు సున్నం వేసి మోర‌ల్ పెయింటింగ్ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ప‌ట్ట‌ణంలో ప‌చ్చ‌దనాన్ని పెంచేందుకు మొక్క‌లు నాటారు. ముందుగా జెండా ఊపి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ సేధు మాధ‌వ‌న్ మాట్లాడుతూ, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం ఉన్న‌ప్పుడే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అవుతుంద‌ని అన్నారు. వారానికో ప్రాధాన్య‌తాంశంతో నెల‌రోజుల‌పాటు ఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. దీనిలో భాగంగా ప‌ట్ట‌ణాల్లో గుర్తించిన 150 రెడ్‌, యెల్లో, బ్లాక్ స్పాట్ల‌ను గ్రీన్ స్పాట్లుగా మార్చ‌డం, బ‌ల్క్ వేస్ట్ ఉత్ప‌త్తి దారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, నిర్మూల‌నా చ‌ర్య‌ల్లో వారిని భాగ‌స్వాముల‌ను చేయ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. యెల్లో స్పాట్స్‌ను గ్రీన్ స్పాట్స్‌గా మార్చి గోడ‌ల‌పై నైతిక బోధ‌న‌ల‌తో కూడిన పెయింటింగ్స్ వేయిస్తామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు త‌మ ఇంటివ‌ద్ద‌నే త‌డిచెత్త‌, పొడిచెత్త‌గా వేరుచేసి ఇవ్వాల‌ని సూచించారు. విజ‌య‌న‌గ‌రాన్ని ప‌రిశుభ్ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన కార్పొరేష‌న్ గా మార్చ‌డంలో ప్ర‌జ‌లంతా త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందించాల‌ని ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ కోరారు.
ఎంఎల్ఏ అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు రాష్ట్రాన్ని ప‌రిశుభ్రంగా మార్చాల‌ని ఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం చెత్త‌ప‌న్ను వ‌సూలు చేసిన‌ప్ప‌టికీ, ఎక్క‌డిక‌క్క‌డ చెత్త పేరుకొనేలా చేసింద‌ని అన్నారు. చెత్త స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డ‌మే కాకుండా, సింగ‌పూర్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో చెత్త‌నుంచి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసే ప్ర‌క్రియ‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌తంలోనే శ్రీ‌కారం చుట్టార‌ని చెప్పారు. మ‌న ప్రాంతాన్ని మ‌న‌మే బాగు చేసుకొనేందుకు ప్ర‌జ‌లంతా ముందుకు రావాల‌ని, స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌లో భాగ‌స్వాములు కావాల‌ని ఎంఎల్ఏ పిలుపునిచ్చారు.
ఆప‌రేష‌న్ క్లీన్ స్వీప్ కార్య‌క్ర‌మం, విధివిధానాలు, నిర్వ‌హ‌ణ గురించి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ బాల‌స్వామి వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ హెల్తాఫీస‌ర్ డాక్ట‌ర్ కె.సాంబ‌మూర్తి, ఇత‌ర అధికారులు, కూట‌మి పార్టీల నాయ‌కులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్