ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో యోగా సాధన కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్ లతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ఉత్సాహంగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ఒక ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసే శక్తి యోగాకు మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘యోగాంధ్ర’కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ వెల్లడించారు. సముద్రపు చల్లని గాలుల మధ్య ప్రకృతి ఒడిలో జరిగిన ఈ యోగా సాధనలో అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొని వివిధ రకాల ఆసనాలను వేశారు. ఈ కార్యక్రమం ప్రజల్లో యోగా పట్ల, ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కల్పించింది.
పాకల తీరంలో ఘనంగా యోగా సాధన
10 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)