ప్రజాశక్తి – ఆలమూరు : ఇటుక బట్టీల నిర్వహణకు ప్రభుత్వానికి మైనింగ్ ఫీజుగా ఏడాదికి రూ.10 వేలు చెల్లించాలని మైనింగ్ ఏడి అశోక్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మైనింగ్ శాఖ కార్యాలయంలో మండలానికి చెందిన పలువురు ఇటుక బట్టి యజమానులు బుధవారం ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా మైనింగ్ ఏడి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ మార్గదర్శకాలను ఇటుక బట్టీల యజమానులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇటుక బట్టీలకు వినియోగించే మట్టి నిమిత్తం గవర్నమెంట్ వారు బట్టీకి సంవత్సరానికి మట్టికి రూ.10 వేలు చెల్లించాలని జీవో వచ్చిందన్నారు. అనుమతుల ప్రకారం ఆలమూరు బట్టీ యూనియన్ కు సంబంధించి 55 బట్టీలకు, చొప్పెల్ల యూనియన్ కు సంబంధించి 40 బట్టీలకు ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున రాయల్టీ ఫీజును చెల్లించారు. దీంతో బట్టి యజమానులను మైనింగ్ ఏడి అశోక్ అభినందించారు. అలాగే మిగిలిన బట్టీల యజమానులు కూడా జూన్ 15లోగా రూ.10 వేలు చెల్లించి రసీదు పొందాలని సూచించారు. మైనింగ్ ఫీజు చెల్లించకుండా, నిబంధనలు అతిక్రమించినా ఇటుక బట్టీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి గుట్టలకు జరిమానా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు ఇటుక బట్టీ యూనియన్ నాయకులు సలాది నాగేశ్వరరావు, వంటిపల్లి సతీష్, చీపురుపల్లి గణేష్, తమలంపూడి కృష్ణారెడ్డి, జగన్నాథ రెడ్డి, నెక్కంటి ప్రసాద్, సూరపరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బట్టీలకు మైనింగ్ ఫీజు రూ. 10 వేలు చెల్లించాలి : మైనింగ్ ఏడి అశోక్
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)