కైగల్ గ్రామస్తుల ఆందోళన
ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి: మండలంలోని కైగల్ గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామానికి నీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకుపై కోతులు స్థావరం ఏర్పాటు చేసుకోవడంతో నీరు పూర్తిగా కలుషితమై, దుర్వాసన వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కలుషిత నీటి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రధాన ట్యాంకు నుండి నేరుగా కాకుండా, చిన్న ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయడం వల్ల కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, ఇప్పటికైనా మండల ఎంపీడీవో స్పందించి ట్యాంకుకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలోనే నేరుగా నీటి సరఫరా: పంచాయతీ కార్యదర్శి
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబును వివరణ కోరగా.. నూతనంగా నిర్మించిన ట్యాంకు ద్వారా గ్రామానికి త్వరలోనే నేరుగా, పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.









కామెంట్‌లు (0)