వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
ప్రజాశక్తి-వినుకొండ:“ఏడేళ్ల క్రితం తీసుకున్న రూ. 70 వేల అప్పుకు ఇప్పటికే రూ. 18 లక్షలు కట్టాను. ఇంకా కట్టమని వేధిస్తున్నావు. నేను ఇక అప్పు కట్టలేను. నీవు వచ్చినప్పుడల్లా వేలకు వేలు ఖర్చు పెట్టలేను. నా చావుకు ప్రకాష్ రావు నీవే కారణం…” ఇవీ, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువ రైతు కళ్ల నిండా నీళ్లతో, గుండె నిండా ఆవేదనతో చనిపోయే ముందు తన ఫోన్లో రికార్డు చేసిన ఆఖరి మాటలు. ఈ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన కాసేపటికే ఆయన తన పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విషాద సంఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, రావులాపురం గ్రామానికి చెందిన అన్నపరెడ్డి నాగిరెడ్డి (30) అనే రైతుకు ఏడేళ్ల క్రితం పత్తిపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన కళ్యాణితో కులాంతర వివాహం జరిగింది. కారంపూడికి చెందిన పెళ్లిళ్ల బ్రోకర్ ప్రకాష్ రావు ఈ పెళ్లి సంబంధం కుదిర్చాడు. అదే సమయంలో నాగిరెడ్డికి ప్రకాష్ రావు రూ. 70 వేలు వడ్డీకి ఇచ్చాడు. అంతేకాకుండా, భార్య పిన్ని కొడుకు స్వామికి డబ్బు అవసరం ఉండటంతో అతనితో కూడా ప్రకాష్ రావు దగ్గరే రూ. 1.50 లక్షలు అప్పు ఇప్పించాడు. ఈ అప్పులకు గ్యారెంటీగా నాగిరెడ్డికి చెందిన పొలం డాక్యుమెంట్లను ప్రకాష్ రావు తాకట్టు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రైతు నాగిరెడ్డికి ఉన్న నాలుగు ఎకరాల పొలంతో పాటు, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు. వచ్చిన ఆదాయంలో పెట్టుబడులు పోగా మిగిలిన డబ్బునంతా భార్యకు తెలియకుండా వడ్డీ వ్యాపారి ప్రకాష్ రావుకు చెల్లిస్తూ వచ్చాడు. ఈ ఏడాది మిరప పంట సాగు చేయగా సుమారు 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ మిరపకాయలను యార్డులో విక్రయించగా వచ్చిన డబ్బును కూడా ప్రకాష్ రావుకే ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 18 లక్షల వరకు డబ్బు కట్టిన ఇంకా కట్టాలని వేదిస్తుండటంతో నాగి రెడ్డి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై బండమోటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానిక గ్రామస్తులను, బంధువులను తీవ్ర కలచివేసింది. మృతునికి భార్య కళ్యాణితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.








కామెంట్లు (0)