– మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
– పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు భారము
న్యూఢిల్లీ : దేశంలో మోడీ ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. పది రోజుల్లో ఇది మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం. తాజా పెంపుతో తిరువనంతపురంలో పెట్రోల్ ధర రూ.112.60కు చేరుకోగా, డీజిల్ ధర రూ.101 దాటింది. కొచ్చిలో పెట్రోల్ ధర రూ.110.60 కాగా, డీజిల్ ధర రూ.99.54కు చేరింది. ఇప్పటికే మొదటి దఫాలో లీటరుకు రూ.3 చొప్పున పెంచిన ప్రభుత్వం, అనంతరం పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో మొత్తం పెరుగుదల రూ.4 దాటింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను కనీసం లీటరుకు రూ.15 వరకు పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఒక్కసారిగా భారీగా పెంచితే ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశముండటంతో, దశలవారీగా ధరలను పెంచే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 16 వరకు 14 సార్లు ధరలు పెంచి, పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు దాదాపు రూ.10 భారాన్ని మోపారు. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 110 డాలర్లను దాటడం కారణంగా చూపించారు. ప్రస్తుతం కూడా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరా అంతరాయం, ఇరాన్‌పై అమెరికా నేతృత్వంలోని ఆంక్షలు, రష్యా సరఫరా తగ్గింపు వంటి అంశాలను ప్రభుత్వం కారణాలుగా పేర్కొంటోంది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతర ధరల పెంపుతో ప్రజల జీవన వ్యయం పెరుగుతుండగా, దేశవ్యాప్తంగా నిరసనలు కూడా తీవ్రతరమవుతున్నాయి.









కామెంట్లు (0)