త్రిస్సూర్ : కమ్యూనిస్టులకు `కౌగిలింతలు' అక్కరలేదని, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని సిపిఐ(ఎం) నేత బృందాకారత్ పేర్కొన్నారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ(ఎం)సీనియర్ నేత పినరయి విజయన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. శనివారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తమకు ఎవరి నుండి ఎటువంటి కౌగిలింతలు అవసరం లేదని, కమ్యూనిస్టులు కౌగిలింతలను కోరుకోరని అన్నారు. తాము నిబద్ధత కలిగిన రాజకీయాలను కోరుకుంటామని అన్నారు. ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి-ఆర్ఎస్‌ఎస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బిజెపి-ఆర్ఎస్‌ఎస్‌లు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నాయని మండిపడ్డారు. కానీ రాహుల్ గాంధీ కేరళంకు వచ్చి, రాజకీయం పేరిట అత్యంత గౌరవనీయులైన నేత పినరయి విజయన్ పై దాడి చేస్తారని, తిరిగి బిజెపి-ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు ఐక్యం కావాలని కోరుకుంటారని అన్నారు. ఇది పూర్తిగా ద్వంద్వ ప్రమాణమని మండిపడ్డారు. “రాహుల్ గాంధీజీ .. మీ కౌగిలింతలు మీ దగ్గరే ఉంచుకోండి. కానీ ప్రతిపక్ష నాయకుడిగా, బిజెపి -ఆర్ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా తమ జీవితంలో అధిక భాగం కార్మిక వర్గం కోసం పోరాడిన పినరయి విజయన్ వంటి ప్రతిపక్ష నేతలను గౌరవించండి” అని రాహుల్ గాంధీకి హితవు పలికారు.
కమ్యూనిస్టులకు`కౌగిలింతలు' అక్కర లేదు : బృందాకారత్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)