చామవరం : గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని, కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల వరకు పింఛన్ ఇస్తోందని సిఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి దాదాపు 3, 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని చామవరంలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామన్నారు. రాష్ట్ర రైతుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నామన్నారు. నేరుగా పేదవాడి ఇంటికొచ్చి పింఛను ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కేవలం ఈరోజు బాగుంటే చాలు అని భావించొద్దు అని, భవిష్యత్ కూడా బాగుండాలని ఎన్నో ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. పరిశ్రమలు వస్తే.. మనవాళ్లు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పారు. విశాఖలో గూగుల్ సంస్థ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని, రాష్ట్ర యువత నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చే బాధ్యత తమది అని అన్నారు. గతేడాది యోగాంధ్ర బాగా చేశామన్నారు. ఈసారి అమరావతి కేంద్రంగా యోగా కార్యక్రమాలు చేపడతామన్నారు. రోజుకు అరగంట వ్యాయామం చేస్తే అనారోగ్యాలు రావు అని చెప్పారు. అందరి జీవన ప్రమాణాలు పెరగాలనేది తమ కల అని చెప్పారు. పింఛన్లు ఇంటింటికే వచ్చి అందిస్తున్నామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు అని చెప్పారు. ఏ సమస్యకైనా ఆన్‌లైన్‌లోనే పరిష్కారం చూపుతున్నామన్నారు. పీ 4 కార్యక్రమం కింద పేదలను ఆదుకుంటున్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం పవన్, తాను కలిసి పని చేస్తున్నామని సిఎం చెప్పారు. డీఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే వైసిని ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి చూసి.. ఆ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. మత విద్వేషాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. వైసిపి అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నంద్యాలలో వైఎస్ విగ్రహంపై దాడి చేసి.. తమపై నెట్టాలని చూశారని, దాడి చేసిందెవరని ఆరా తీస్తే వైసిపి వాళ్లే చేసినట్లు రుజువైందని చెప్పారు. విగ్రహం ధ్వంసం చేశారని అబద్ధాలు చెప్పి.. సానుభూతి కోసం ప్రయత్నించారని అన్నారు. దుర్మార్గాలపై యుద్ధం చేస్తూనే.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు ప్రసంగించారు.
గతంలో ఒక నెలకే రద్దు .. ఇప్పుడు 3 నెలల వరకు పింఛన్ : సిఎం చంద్రబాబు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 03:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)