test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంజీవనితో సమగ్ర సేవలు

23 మే, 2026

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆగస్టు 15 కు రాష్ట్రవ్యాప్తంగా అమలు

  • చిత్తూరు జిల్లాలో సిఎం చంద్రబాబు వెల్లడి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో (చిత్తూరు జిల్లా) : సంజీవని పథకం ద్వారా ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.శనివారం ఆయన చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో సంజీవని పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం` అనే భావనతో సంజీవని పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15లోగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందిస్తామన్నారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎఐ ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్, డాక్టర్ ఫాలోఅప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికీ భవిష్యత్తులో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకువస్తామన్నారు. ప్రతి పౌరుడికీ రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్‌‌టిఆర్‌ వైద్య సేవ, ‌సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగ, ధ్యానం, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.

హార్టికల్చర్ కేంద్రంగా రాయలసీమ

రాయలసీమలో పరిశ్రమలు, డేటా సెంటర్లు, డ్రోన్ సిటీలు, ఏరోస్పేస్ హబ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. హార్టికల్చర్ రంగంలో రాయలసీమను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, సోమశిల–స్వర్ణముఖి లింక్ కాలువ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.

ఎల్‌‌నినోతో తక్కువ వర్షాలు

ఈ ఏడాది వాతావరణంలో మార్పులు వచ్చాయని, ఎల్‌‌నినో కారణంగా వర్షాలు తగ్గుతాయని అంచనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఈ సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని ముందుకెళతామన్నారు. రాష్ట్రానికి 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని, 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని తెలిపారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. యుద్ధాల్లో పాల్గొనే జెట్ విమానాల తయారీ కేంద్రంగా పుట్టపర్తి మారుతోందన్నారు. తిరుపతిలో త్వరలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమ వస్తుందని తెలిపారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమ, సిమెంట్ ఫ్యాక్టరీలు రానున్నాయన్నారు. వచ్చే నెలలో బంగారం గనులను కర్నూలు జిల్లాలో ప్రారంభించనున్నామని తెలిపారు. రాయలసీమను లక్ష కోట్ల రూపాయలతో హార్టీకల్చర్ హబ్‌‌గా మారుస్తామన్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల వంటగ్యాస్ కొరత వచ్చిందని, పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని, పనితీరును డిజిటల్‌గా మానిటరింగ్ చేస్తామని తెలిపారు. వివిధ శాఖల్లో మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులను సభలో చంద్రబాబు అభినందించారు.కార్యక్రమంలో ఎంపి దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, టాటా సంస్థ సిఇఒ గిరీష్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్