test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సరైన సన్నాహాలు లేకుండా న్యాయ వ్యవస్థలో డిజిటల్ విధానం వద్దు

29 మే, 2026

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 29, 2026, 08:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం


విజయవాడ : కోర్టుల నుండి నిందితులు, సాక్షులు మరియు బాధితులకు వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్, ఈమెయిల్ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా వారెంట్లు, సమన్లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.   కేసులు త్వరగా పరిష్కరించడం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ ప్రక్రియల (జారీ, బట్వాడా, అమలు) నిబంధనలు- 2025ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలులో అనేక సమస్యలతో పాటు సైబర్ నేరగాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయని సిపిఎం అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు కూడా ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు . సిబిఐ, ఈడి, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్ళు డిజిటల్ మాధ్యమాల ద్వారా మెసేజ్‌లు, వాట్సఅప్ కాల్స్ చేస్తూ డిజిటల్ ఆరెస్టులని భయపెట్టి అనేకమంది దగ్గర కోట్ల రూపాయలు దోచుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే సైబర్ క్రైమ్ 8% పెరిగినట్లు జాతీయ నేర పరిశోధనా బృందం (ఎన్‌సిఆర్‌బి) ప్రకటించింది. 2022 - 2024లో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన 7,210 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు రూ. 970 కోట్లు మోసపోయినట్లు ఎన్ సి ఆర్ బి ప్రకటించింది. ఇలాంటి స్థితిని అరికట్టకుండా కోర్టులు డిజిటల్ మాద్యమాలు ఉపయోగిస్తే సైబర్ నేరస్తులు దీన్ని ఆసరా చేసుకొని మరింతగా ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఏది అసలో, ఏది నకిలీనో తెలియక మోసపోయేవారి సంఖ్య పెరుగుతుందని, ఆ రీత్యా ముందస్తుగా డిజిటల్ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కోర్టులకు వచ్చే బాధితులు మరియు సాక్షుల ఫోన్, మెయిల్ వివరాలు బహిర్గతం కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉందని ,  అదే సమయంలో నిందితుల డేటాకు ఎటువంటి రక్షణ ఈ చట్టం కల్పించలేదని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ,  ఇప్పటికే ఆధార్ డేటా లీకేజీ ద్వారా అనేక సమస్యలు మనముందుకొస్తున్నాయన్నారు. ప్రజల అక్షరాస్యత, అవగాహన స్థాయిని ఉపయోగించుకొని సైబర్ నేరాలు మరింతగా పెరుగుతాయని తెలిపారు.

కావున కోర్టు సేవలో డిజిటల్ మాద్యమాలను ఉపయోగించే ముందు సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత వివరాల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు పటిష్టంగా అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్