విజయవాడ : ప్రమాదంలో చనిపోయిన ఉపాధి కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాకినాడ జిల్లా చీడిక గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్ళి లారీ ప్రమాదంలో ఆరుగురు మహిళా ఉపాధి కార్మికులు మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నదన్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నదన్నారు. మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడినవారికి రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి చట్టంలో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చిందన్నారు. పని ప్రదేశంలో హాజరు తీసుకోవడానికి ఫేస్‌యాప్ తెచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువ గ్రామాల్లో నెట్ సౌకర్యం లేనందున హాజరు వేయాలంటే నెట్ సౌకర్యం ఉన్న చోటకి పేదలు వెళ్ళాలని తెలిపారు. ఈరోజు మృతి చెందిన ఉపాధి కూలీలు కూడా ఫేస్‌యాప్ ద్వారా మస్టర్ వేయడానికి ప్రయత్నించగా నెట్ పనిచేయకపోవడంతో సిబ్బంది పక్కనే ఉన్న హైవేపైకి తీసుకెళ్ళి హాజరు వేస్తుండగానే వేగంగా వచ్చిన లారీ ఆరుమంది కూలీలపై దూసుకెళ్ళిందని వివరించారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కావున ఉపాధి కూలీల హాజరుకు ఫేస్‌యాప్ పద్దతి రద్దు చేయాలని కోరారు. మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మృతిచెందిన ఉపాధి కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారమివ్వాలి : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)