test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రైతుల్ని ఆదుకోండి

5 రోజుల క్రితం

Support Tobacco Farmers: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 03:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

• కనీసం రూ.1000 కోట్లు కేటాయించండి
• సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పొగాకు రైతుల్ని ఆదుకోవాలని, వారి కోసం కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలని, బోర్డు, ఎస్‌టిసి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని, ఐటిసి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొగాకు ధర కిలోకు రూ.350 లకు తక్కువ కాకుండా నిర్ణయించాలని, నోబిడ్స్ పేరుతో రైతులను వేధిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం వర్జీనియా పొగాకు కొనుగోలులో ఐటిసి సహా బడా పొగాకు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.500 కోట్లు చొప్పున వెయ్యికోట్లు కేటాయించి బోర్డు సొసైటీ ఎస్‌టిసి ద్వారా కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. పొగాకు రైతులు సాగిస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం, ఏలూరు జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రైతులు వర్జీనియా పొగాకు సాగు చేశారని తెలిపారు. పొగాకు బోర్డు అంచనా ప్రకారం 230 మిలియన్ల కిలోలు దిగుబడి వచ్చిందని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంఖర్చులు పెరిగాయని వివరించారు. అయినా దీన్ని అవకాశంగా తీసుకొని పొగాకు కొనుగోలు కంపెనీలు కనీస ధరను తగ్గించి, నోబిడ్స్ పేరుతో రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. దాదాపు సగం బేళ్ళు తిరస్కరణకు గురవుతున్నాయని పేర్కొన్నారు. యుద్ధం, ఎగుమతులు సాకుతో కంపెనీలు పొగాకు కొనుగోలులో ఆలస్యం చేయడం, ధర తగ్గించడం వంటివి చేస్తున్నాయని, ధరలో నష్టంతోపాటు అధిక రవాణా భారంతో రైతులు కుంగిపోతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో కనీసం కిలో ధర రూ.350 లేకుండా రైతులకు గిట్టుబాటు కాదని, కంపెనీలు రూ.250 మించి ఇవ్వడం లేదని తెలిపారు. సగటుధర గత సంంవత్సరం రూ.280లు ఉండగా ఈ సంవత్సరం రూ.200లే ఉందని పేర్కొన్నారు. . దానికితోడు తిరస్కరణకు గురైన బేళ్లు (నోబిడ్స్) పెరిగిపోయాయన్నారు. ఏప్రిల్ 9న పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి 90 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే పొగాకు కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోళ్ళ సీజన్ ప్రారంభానికి ముందు సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను పెంచడం కేంద్ర ప్రభుత్వం ఐటిసికి మేలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్యన్నారు. రోజులు గడిచే కొద్దీ పొగాకు రంగు మారడంతో పాటు, నాణ్యత తగ్గిపోతుందని, ఆ పేరుతో పొగాకు కంపెనీలు మరింత ధర తగ్గించే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల జూన్ 1న బోర్డు రైతులకిచ్చిన హామీ ప్రకారం తక్షణం కదిలి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడాలని కోరారు. రాష్ట్రం తరపున నిధి కేటాయించి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని, రైతులు పండించిన పొగాకు ఉత్పత్తులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఏటా వేలకోట్ల రూపాయల పన్నుల ఆదాయం వస్తోందని తెలిపారు. పొగాకు వేలం నిర్వహణలో బోర్డుకు వస్తున్న ఆదాయాన్ని కేంద్రం తన ఖాతాలో వేసుకుందని, ఇప్పుడు రైతుల అవసరాలకు దాన్ని వినియోగించాలని సూచించారు.
సరైన ధరకు పొగాకు అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కొనుగోలుకు చెరి 500 కోట్లు రూపాయలు పొగాకు బోర్డుకు, పొగాకు రైతుల సహకార సమాఖ్యకు ఎస్‌టిసికి కేటాయించి పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్