test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్య

19 మే, 2026

పుచ్చలపల్లి సుందరయ్య
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వర్థంతి సభలో వక్తలు


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజా రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. సుందరయ్య 41వ వర్థంతి సందర్భంగా విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె జయరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వై వెంకటేశ్వరరావు మాట్లాడారు. సిపిఎం అగ్రనేతగా సుందరయ్య నిరంతరం ప్రజల మధ్యే పనిచేశారన్నారు. చిన్న వయసులోనే ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. కమ్యూనిస్టు నాయకుడిగా నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి పోరాడారని వివరించారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకుడిగా అనన్య సామాన్యమైన కృషి చేశారని పేర్కొన్నారు. అప్పట్లోనే సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లి నిరాడంబర జీవితాన్ని గడిపారని వివరించారు. కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన ఒడిదుడుకులను ఎదుర్కొనే సమయంలో సైద్ధాంతికంగా ఆయన నిర్వహించిన పాత్ర అత్యంత స్ఫూర్తిదాయకమని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, సిద్ధాంత ఆచరణ, సేవతాత్పరతకు సుందరయ్య నిజమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చేప్పేవారని, శత్రువులను ఎదుర్కోవడంలో ఆయనకు ఆయనే సాటని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంతోపాటు, దేశంలో పేదలు, శ్రామికులు, కార్మికుల సమస్యలపై పోరాడటంలో, అధ్యయనం చేయడంలో సుందరయ్య నిర్వహించిన పాత్ర మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్ర మాల్యాద్రి, యువి రామరాజు, ఎంబివికె బాధ్యులు తులసీరావు, స్వరూపరాణి, డివైఎఫ్‌ఐ నాయకులు రామన్న, రాము, సిఐటియు నాయకులు ఆర్‌వి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్