నేటి నుంచి వాహనాలకు అనుమతి
ప్రజాశక్తి – విజయవాడ సిటీ : దుర్గగుడి ఘాట్ రోడ్డులో టోల్‌గేట్ నుండి కొండపైకి చేరుకునే రహదారి పునరుద్ధరణ పనులను ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఆర్ అండ్ బి సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురువారం దేవస్థానం అధికారులకు లేఖ ద్వారా తెలిపారు. విజయవాడ నగరంలో ప్రస్తుతం ఎండ తీవ్రత, వడగాల్పులు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల క్షేత్రస్థాయిలో కార్మికులు పనులు చేయడం అత్యంత కష్టతరంగా మారిందని, ఇంతటి తీవ్రమైన వేడి వాతావరణంలో రోడ్డు మరమ్మతు పనులు (బిటుమిన్/కెమికల్ మిక్సింగ్) చేపట్టడం సాంకేతికపరంగా సరైనది కాదని,ఈ ఎండల వల్ల రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తూ తాత్కాలికంగా పనులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు శాశ్వత మరమ్మతు పనుల షెడ్యూల్‌ను మార్చాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని లేఖలో కోరారు. ఎండ తీవ్రత తగ్గి, వాతావరణం అనుకూలించిన వెంటనే తిరిగి ఘాట్ రోడ్డు శాశ్వత ఆధునీకరణ పనుల పూర్తి షెడ్యూల్‌ను యాత్రికులకు ముందుగానే తెలియజేస్తామని వివరించారు. దీంతో శుక్రవారం ఉదయం నుండి దేవస్థానం ఘాట్ రోడ్ వైపు వాహనాలకు యధావిధిగా అనుమతిస్తామని దేవస్థాన అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.








కామెంట్‌లు (0)