test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

30 మే, 2026

Provide Rs 25 Lakhs Ex-Gratia to Heatstroke Victims: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 04:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రత వలన వడదెబ్బ తగిలి అనేకమంది మృత్యువాతపడుతున్నారని తెలిపారు. తాజా అకాల వర్షాలు కూడా దెబ్బతీశాయన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ షాక్ తగిలి చనిపోయారని చెప్పారు. ఉపాధి కూలీలు, భవన నిర్మాణ, ఆటో, ముఠా, రిక్షా కార్మికులు, దినసరి కూలీలు, వృద్దులు, నిరాశ్రయులే (బిక్షాటన) ఎక్కువమంది ఉన్నారని వివరించారు. ప్రకృతి విపత్తుల నిధి కింద చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. ప్రజల సౌకర్యార్థం తగు ఉపశమన చర్యలు చేపట్టాలని కోరుతున్నదన్నారు. అన్న క్యాంటీన్లలో ఉచితంగా మజ్జిగ, మంచినీళ్ళు అందించాలని కోరారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లోనూ చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పథకం సహా అసంఘటిత కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో తగు విశ్రాంతి, ఉపశమనం కల్గించాలని కోరారు. సమయాల్లో అవసరమైన మార్పులు చేయాలన్నారు. ఉపాధి కార్మికులకు ఒకపూట పనిచేయించాలని, ఫేస్ యాప్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనంత 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. మే నెల ప్రారంభం నుండి ఈ వడగాడ్పులు మొదలయ్యాయని తెలిపారు. రోజుకు పదుల సంఖ్యలో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 22 న ఒక్కరోజే 21 మంది మరణించారని చెప్పారు. అందునా విజయవాడలో 10 మంది మరణించారని తెలిపారు. ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోవడం లేదని, మాటల వరకే పరిమితమవుతున్నదని ఆరోపించారు. ఎక్కడికక్కడ చలివేంద్రాలు, రోడ్లపై నీటితుంపర చల్లించడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రజలకు అందించడం, చలువ పందిళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్, రైలు గేట్లు వద్ద, ఆసుపత్రుల్లో వార్డులు కేటాయించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడు ఎలినినో కారణంగా రుతుపవనాలు రాక ఆలస్యమై మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి తెలుపుతున్నదన్నారు. కాబట్టి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమన చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

cpim


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్