విజయవాడ : విజయవాడ : క్యూబా సంఘీభావ నిధి అందించిన ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించి మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. సోషలిస్టు క్యూబాపై దుర్మార్గంగా ఆంక్షలు విధించి తిండి, మందులు, ఇంధనం లేకుండా మాడ్చి చంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంపు చేస్తున్న దుర్మార్గాలను ఖండిస్తూ …. ఏప్రిల్ 7వ తేదీ ఒక్కరోజు క్యూబా సంఘీభావ నిధికి సిపిఐ(యం) ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు రూ.33 లక్షలు విరాళంగా అందించారని తెలిపారు. ఆదరించిన ప్రతి ఒక్కరికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపిందని పేర్కొన్నారు. సోషలిస్టు క్యూబా ప్రభుత్వాన్ని కూల్చాడానికి అమెరికా సామ్రాజ్యవాదం శతవిధాలా ప్రయత్నిస్తున్నదన్నారు. ఆయిల్, మెడిసిన్స్ వంటి అత్యవసరాలు సరఫరా కాకుండా స్తంభింపజేస్తున్నదని చెప్పారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి క్యూబన్ ప్రజలు అకుంఠిత దీక్షతో పోరాడుతున్నారని తెలిపారు. అమెరికన్ సామ్రాజ్యవాదం దుర్మార్గాలకు వ్యతిరేకంగా క్యూబన్ ప్రజలకు సంఘీభావంగా నిలబడాల్సిన బాధ్యత శాంతికాముకులపై ఉందన్నారు. భారతదేశ ప్రజలకు క్యూబా మిత్రదేశం అనీ, అలీనోద్యమంలో కలిసిమెలసి పనిచేశామని గుర్తు చేశారు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న సంప్రదాయం భారతీయులకుందన్నారు. ఆ సంప్రదాయవారసత్వంగానే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) క్యూబన్ ప్రజలకు మద్దతు పలికి క్యూబా ఒంటరి కాదని చాటి చెప్పిందని అన్నారు. పలు పార్టీలు, శాంతికాముకులతో క్యూబా సంఘీభావ కమిటీ ఏర్పడి నిధికి పిలుపునిచ్చిందన్నారు. మందులు సహా అవసరమైన వస్తువులు పంపాలని నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో మార్చి 27న బహిరంగ సదస్సులో సాలిడారిటీ ఫండ్‌కు సిపిఐ(యం) పిలుపిచ్చిన వెంటనే రాష్ట్రవ్యాపితంగా మంచి స్పందన వచ్చిందని హర్షాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తులు, సంస్థలు, వీధి వసూళ్ళ ద్వారా ప్రజలు ఉదారంగా విరాళాలిచ్చారని తెలిపారు. నేటి వరకు రాష్ట్రంలో రూ.33,05,711లు వసూలైందని వివరించారు. వసూలైన మొత్తాన్ని క్యూబాకు పంపేందుకు జాతీయ సంఘీభావ నిధికి అందించామని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
క్యూబా సంఘీభావ నిధి అందించిన ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 01:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)