విజయవాడ : డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈ రెండు సంవత్సరాల్లో ఒక డిఎస్సీ మాత్రమే ప్రకటించిందని తెలిపారు. నిరుద్యోగ భృతి హామీ పూర్తిగా అమలు కాలేదని అన్నారు. ఖాళీగా ఉన్న 42 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో కేవలం 16 వేల ఉద్యోగాలకు మాత్రమే డిఎస్సీ ప్రకటించడం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అనేక వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి అర్హుల జాబితా ప్రకటించారనీ, అయితే స్పోర్ట్స్ కోటా ఎంపికలో అనేక అక్రమాలు జరిగినట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. వీటిపై ప్రభుత్వం ఇస్తున్న వివరణ మరిన్ని సందేహాలకు కారణమైందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొందరిని తొలగించి వారి స్థానంలో స్పోర్ట్స్ కోట పేరుతో మరికొంత మందిని ఎంపిక చేసిన విధానం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. కొందరు అక్రమాలకు పాల్పడి స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారనే విమర్శలు వస్తున్నాయన్నారు. కాబట్టి వీటిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించడంతో పాటు అర్హులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
డిఎస్సీ స్పోర్ట్స్ కోటా పై సమగ్ర విచారణ జరపాలి : వి.శ్రీనివాసరావు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 03:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)