-దానిని వదిలించుకుందాం
-రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
- ‘భారత రాజ్యాంగం -సవాళ్లు` సదస్సులో వక్తలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : ప్రతి విషయాన్నీ ఇది మాములే నంటూ తేలికగా తీసుకునే ధోరణి ( నార్మలైజేషన్) దేశంలో ప్రమాదకరంగా పెరుగుతోందని, దానిని వదిలించుకున్నప్పుడే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని ‘భారత రాజ్యాంగం-సవాళ్లు’ అనే అంశంపై సదస్సులో ప్రసంగించిన పలువురు వక్తలు అన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలోని గంథమనేని శివయ్య భవన్ లో ఆదివారం ఈ సదస్సు జరిగింది. మాజీ ఎంఎల్ సి, రాజ్యాంగపరిరక్షణ వేదిక రాష్ట్ర ఛైర్మన్ జల్లి విల్సన్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నా, ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది పేర్లు తొలగించారన్నా ‘ఇది మాములే..’ అని అనుకుంటున్నారని అన్నారు. ‘గంగానదిలో వందలాది శవాలు తేలుతున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, రైతు సమస్యలపై స్పందించకున్నా, వలస కార్మికులు మండుటెండల్లో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచివెడుతున్నా, నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చినా, చివరకు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగినా ‘మాములే..’ అని అనుకునే ధోరణికి ప్రజలు వెళ్లిపోయారు’ అని చెప్పారు. ఈ ధోరణి కొనసాగితే వచ్చే ఏడాది ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతుందో లేదోనని ఆందోళన కలుగుతోందన్నారు.
అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల్లోని అనేక దేశాల్లో ' దేశం ఎవరిది? ఎవరికి చెందుతుంది? అనే అంశాల ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారని, మన దేశంలో అందుకు భిన్నంగా మతం, కులం, రంగు, సంస్కృతులకు అతీతంగా అసమానతలను ఎలా రూపుమాపాలి, వివక్ష లేకుండా ఏం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా పటిష్టం చేయాలి, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని ఎలా సాధించుకోవాలన్న అంశంపై చర్చ జరిగిందన్నారు. ప్రస్తుతం పైకి రాజ్యాంగ స్వరూపం అలానే కనిపిస్తున్నా, లోపల సారాన్ని తొలగిస్తూ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. పౌరసమాజంలో పెరుగుతున్న ఈ ధోరణి ప్రమాదకరమన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో కోట్లాది మంది ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోనూ ఎస్ఐఆర్ అమలుకు రంగం సిద్ధమయ్యిందన్నారు. ఓటు హక్కు పోతున్నా మనం స్పందించకుంటే, భవిష్యత్ లో ఓటు హక్కు లేనివారంతా బానిసలుగా బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. క్రమక్రమంగా మన దేశంలోనూ ‘ఇజ్రాయిలీకరణ’ జరుగుతోందని, ఇజ్రాయిల్ లో మెజార్టీగా ఉన్న యూదులు మాత్రమే ప్రథమ పౌరులుగా, గుర్తింపబడ్డారని చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్‌సిలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వెనక్కి తగ్గిందని, ప్రస్తుతం అమలవుతున్న ఎస్ఐఆర్ వాటి ప్రతిరూప మేనని అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వ రరావు మాట్లాడుతూ, మత విద్వేషాల సూచికలో మన దేశమే మొదటి స్థానంలో ఉందని ఒక సర్వేలో తేలిందని చెప్పారు. దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగాయన్నారు. ఒక్క శాతం వద్దనే సంపద పోగు పడుతుందన్నారు.
జాతీయ పరిరక్షణ దినంగా ఆగస్టు 15 : వి. శ్రీనివాసరావు పిలుపు
ఆగస్టు 15ను ఈ ఏడాది జాతీయ పరిరక్షణ దినంగా జరుపుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ సహజ వనరులను కాపాడుకోవాలని, రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న నిరంకుశ పాలనపై పోరాడాలని అన్నారు. రామాయణంలో రావణుడు సీతను చెరబడితే, మోడీ సారథ్యంలో రాజ్యాంగాన్ని చెరబట్టారని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే కమ్యూనిస్టుల బలం మరింత పెరగాల్సి ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలదోస్తే 'వారు ఆక్రమణదారులు కాదు.. హక్కుదారులు` అని చెబుతూ సిపిఎం అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రమాదంపై కూటమి ప్రభుత్వాన్ని అఖిల పక్షం వేయాలని కోరుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఐఆర్ అనేది పౌర హక్కుల సమస్యని చెప్పారు. బిజెపి సనాతన ధర్మానికి వంత పాడుతున్న కూటమి అధినేతలను ఆ పార్టీల వెనక ఉన్న శ్రేణులు నిలదీయాలన్నారు. సత్యసాయి జిల్లాలో మిలట్రీ ఇండ్రస్టీ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పారని, యుద్ధాలు చేసి మారణ హోమం సృష్టిస్తారా? అని ప్రశ్నించారు. గతంలో సంస్కరణల పేరుతో చంద్రబాబు పాలన సాగించారని, ప్రస్తుతం మతోన్మాద అజెండా మోస్తూ పదవులను కాపాడుకుంటున్నారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే భావనపై ఇంటా, బయట పోరాటం జరగాలన్నారు. యువత స్పందించకుండా మగతన్రిదలోకి జారుకునేలా పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. తిరుపతిలో కల్తీ లడ్డు పేరుతో వివాదాన్ని రెచ్చగొట్టి ఏడాది పాటు విచారణ జరిపి 'కొండను పట్టుకుంటాం అని చెప్పి కనీసం ఎలుక తోకను కూడా పట్టుకోలేదు` అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా లౌకికవాదానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. దక్షిణ భారతదేశం నుంచి జిఎస్టి పన్నులు ఎక్కువగా కేంద్రానికి వెళుతుంటే, నిధుల కేటాయింపుల్లో మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా తరలిస్తున్నారన్నారు. మన గ్యాస్ ను గుజరాత్ కు తరలిస్తూ, విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న గ్యాస్ ను మనకు విక్రయించడం అన్యాయమన్నారు. మన గ్యాస్ ను మనకే సరఫరా చేస్తే సిలిండర్ ధర రూ.200కే దొరుకుతుందన్నారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పి.అంజయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే ఆర్ఎస్ఎస్ మనువాదం అమల్లోకి వస్తుందన్నారు. ఇదేగనక జరిగితే బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ కల్పించిన హక్కులన్నీ కోల్పోతారన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు ప్రారంభోపన్యాసం చేస్తూ సదస్సు ఆవశ్యకతను వివరించారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వం ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదన్నారు. ప్రజాభిప్రాయం అణుబాంబు కంటే శక్తివంతమైనదని, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలన్నారు. సదస్సు మధ్యలో 'రాజ్యాంగ పీఠిక`ను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. వెంకటగిరికి చెందిన 8వ తరగతి చదువుతున్న అభినయ్ అనే విద్యార్థి సదస్సులో తానూ మాట్లాడతానని అధ్యక్షుని అనుమతితో అంబేద్కర్ జీవిత చర్రితను వివరించారు. ఈ కార్య్రకమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి పి.మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి పాల్గొన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య నాయకురాలు వినోదమ్మ వందన సమర్పణ చేశారు.








కామెంట్‌లు (0)