ప్రజాశక్తి- కుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా బుధవారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలను నైవేద్యంగా అందించారు. ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.30 గంటలకు తుమిసి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసానికి వెళ్లారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి 11.30 గంటల ప్రాంతంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకోగా ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటూ చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఇటీవల గంగమ్మ ఆలయానికి సుమారు రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమిని ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు… ముఖ్యమంత్రికి చూపించారు. ఆలయ అభివృద్ధికి ఇదివరకే ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలకుపైగా నిధులు కేటాయించింది. ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రికి చైర్మన్ వివరించారు. గంగమ్మను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన యాత్రికులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మ కొట్టాలు వద్ద ఆగారు. కల్లు గీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా తన కాన్వాయ్‌ని నిలిపి వారి వద్దకు వెళ్లి ముంజలు రోడ్డుపైనే రుచి చూశారు. ముంజలు తింటూ కల్లు గీత కార్మికులతో కాసేపు ఆయన ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శాంతిపురం మండలం తుంసి హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి దంపతులకు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్, ఎపిఎస్ ఆర్టిసి చైర్మన్ పిఎస్ మునిరత్నం, మనోహర్, మాజీ ఎంఎల్‌సి గౌనివారి శ్రీనివాసులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్ తదితరులు వీడ్కోలు పలికారు.
అమ్మవారి విశ్వరూప దర్శనానికి పోటెత్తిన యాత్రికులు
శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనానికి యాత్రికులు తండోపతండాలుగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ప్రారంభమైన గంగమ్మ శిరస్సు ఊరేగింపు బుధవారం ఉదయం ఏడు గంటల వరకు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగింది. ఏడాదికి ఒక్కరోజు 13 నుంచి 14 గంటలు మాత్రమే అమ్మవారు విశ్వరూప దర్శనంలో యాత్రి కులకు దర్శనమిస్తారు. దీంతో, అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలిరావడంతో ఆలయ ప్రాంగణం యాత్రికులతో కిక్కిరిసింది.









కామెంట్లు (0)