ఎంఎస్ఎంఇ గ్రోత్ సమ్మిత్ లో యువతకు చంద్రబాబు పిలుపు
మరో కోటి యూనిట్లు ఏర్పాటు కావాలని ఆకాంక్ష
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలను వినియోగించుకుని విస్తృతంగా ఎంఎస్ఎంఇలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు పిలుపునిచ్చారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఇ గ్రోత్ సమ్మిట్ 2026కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందని, యువత కలలకు, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఈ రంగం వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తోందని చెప్పారు. దీనికి తగ్గట్టుగా కొత్త ఆలోచనలతో రావాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో 5 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని ఎంట్రపెన్యూర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. మహిళా సంఘాల వద్ద ప్రస్తుతం 28 వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉందని, ఆ సంఘాలద్వారా 100 యూనికార్న్ కంపెనీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జెన్ జీ యువత కలల్ని సాకారం చేస్తాం మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు యువత భవిష్యత్తు, ఉపాధికి, నైపుణ్యాలకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. జెన్- జి , జెన్- ఆల్ఫా, టీనేజర్లకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది ప్రభుత్వ విధానమన్నారు. ఇంటికో ఔత్సాహిక పారిశ్రామికవేత్త రావాలంటే ఇకపై మరో కోటి ఎంఎస్ఎంఇలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులను ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తు న్నామని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిగా ఎంఎస్ఎంఇ రంగం ఉందని, భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ఠ తీసుకువస్తే, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు లక్షల మందికి జీవనోపాధిని కలిగిస్తాయని అన్నారు. రాష్ట్రంలో వనరులకు, అవకాశాలకు కొదవలేదని, వీటిని వినియోగించుకునేలా ఎంఎస్ఎంఇలకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయని. ఈ సదస్సు కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలని పిలుపునిచ్చారు.
38 ఎంఎస్ఎంఇ పార్కులకు శంకుస్థాపన
ఈ సందర్భంగా 38 ఎంఎస్ఎంఇ పార్కులకు సిఎం శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక యానిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలోనూ 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. . మిగిలిన వాటిని జూలై నాటికి శంకుస్థాపనలు చేసి అన్ని మౌలిక వసతులూ కల్పిస్తామని చెప్పారు.
భారీ ఒప్పందాలు
ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో నడిచే రూరల్ అవుట్ పోస్టులను కూడా సీఎం ఆవిష్కరించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ సెంటర్లను పైలట్ గా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలుగా ఈ ఆర్ఎస్వీ కేంద్రాలు పనిచేయనున్నాయి. ఆర్టీఐహెచ్ తో కలిసి కియా ఇండియా సంస్థ అడ్వాన్డ్స్ ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వివిధ స్టార్టప్ లకు చేయూత ఇచ్చేలా హై ఎండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీని కియా ఏర్పాటు చేయనుంది. డీప్ టెక్ స్టార్టప్ లకు ఆర్ధిక సహకారం అందించేలా ఆర్టీఐహెచ్ తో కలిసి సిడ్బీ రూ.20 కోట్ల సీడ్ ఫండ్ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించనుంది. దీనికి సంబంధించి సిడ్బీ బ్యాంక్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 1 లక్ష మంది ఎంఎస్ఎంఈ డిజిటల్ మెచ్యూరిటీ అసెస్మెంట్ లో భాగంగా వివిధ కళాశాలల్లో 50 డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ - ఐటీ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. వీటితో పాటు వెయ్యి ఎంఎస్ఎంఈ ఎనర్జీ, వాటర్ ఆడిట్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ లో డయాగ్నాస్టిక్స్ నిర్వహించేందుకు ఎస్సెల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 750 ఎంఎస్ఎంఈలతో పాటు 3,125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రూ.200 కోట్ల వ్యయంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని నిర్ణయించారు. దివ్యాంగ యువతకు ఎంట్రప్రెన్యూర్ షిప్ ట్రైనింగ్ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డీబీవీ స్వామి సహా ప్రజాప్రతినిధులు, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సిఇఓ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అంబేద్కర్ కళా వేదిక ప్రారంభం
అంతకుముందు 4.4 ఎకరాల్లో 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒకేసారి 1500 మంది హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మించటం ఆనందకరమన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో మరో ఐదు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నట్టు సీఎం వెల్లడించారు.









కామెంట్లు (0)