ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించి, వాటిని మురుగు రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. గోదావరిలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, ఆక్వా కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటించిన కార్యాచరణలో పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 8.38 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తున్నట్లు గుర్తించగా, దీని నివారణకు బిబి గ్రామ్ జి పథకంలో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించాలని నిర్ణయించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పరిశీలనలో గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల మున్సిపాలిటీల నుంచి రోజుకు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మరో 8.38 మిలియన్ లీటర్లు, ఆక్వా రంగం నుంచి 13.24 మిలియన్ లీటర్లు విడుదలవుతోందని గుర్తించినట్లు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాల్లో ఒక్క ఆంధ్ర పేపర్స్ నుంచే రోజుకు 32 మిలియన్ లీటర్ల వరకు జలాలు విడుదలవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ప్రతి మున్సిపాలిటీ సామర్థ్యానికి అనుగుణంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టిపిలు) నిర్మించాలని ఆదేశించారు. గోదావరి కాలుష్య నియంత్రణ కోసం ఆర్‌టిజిఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాంతాలవారీ సిసి కెమెరాలు, స్క్రీన్లు ఏర్పాటుచేసి ఎక్కడైనా మురుగు నేరుగా గోదావరిలోకి విడుదలవుతుందా అనే అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
కాలుష్యరహితంగా పుష్కరాలు
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 12:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)