-ముందుగానే కాలువలకు నీళ్లు
-ప్రజావేదికలో సిఎం చంద్రబాబు
-సిపిఎం, ప్రజాసంఘాల నాయకుల నిర్బంధం
- త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
ఆగస్టు 15 నుంచి సంజీవని కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని సిఎం చంద్రబాబు తెలిపారు. ఖరీదైన వైద్యం కోసం అప్పులు చేయకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామన్నారు. సంజీవని పేరిట వ్యక్తిగత ఆరోగ్యం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించి పర్యవేక్షిస్తామని, ఎఐ డాక్టర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాకినాడ జిల్లా తుని మండలంలోని చామవరంలో సోమవారం " పేదల సేవలో ప్రజా వేదిక" కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది ముందుగానే కాలువలకు నీళ్లు విడుదల చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూన్ నాలుగు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. రాష్ట్రంలో విధ్వంసక పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజు అని అన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి పేదల కోసం పని చేస్తుందన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులున్నా తొలి నెల నుంచే పింఛన్లు ఇస్తున్నామని, ఏడాదికి రూ.32 వేల కోట్లు ఈ పథకానికే ఖర్చు పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిద్వారా 23 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువను జూలైలోగా పూర్తి చేస్తామని తెలిపారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారుల కోసం రూ.240 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లను కూడా సబ్సీడిపై అందిస్తామన్నారు.
గత పాలనంతా విధ్వంసం
గత పాలనంతా విధ్వంసకరంగా సాగిందని తీవ్రస్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు. గత పాలకులు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, టిడిపి కూటమి అధికారంలోకొచ్చాక 241 కేసులు వేసినా వాటిని పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. కాని డిఎస్‌సిని సైతం వివాదం చేసి రాజకీయ లబ్ది పొందాలని వైసిపి ఆలోచిస్తోందన్నారు. వైసిపి కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపేసి పొదల్లోకి విసిరేశారని, కడపకు చెందిన ఓ పాస్టర్‌ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడారని, పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి బైకు నడుపుతూ ప్రమాదంలో చనిపోతే దానిని కూడా తమపై నెట్టడానికి ప్రయత్నించారని విమర్శించారు. కాకినాడలో వైసిపి ఎమ్మెల్సీ.... దళితుడైన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారని, అలాంటి వ్యక్తిని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయకుండా వెనక తిప్పుకుంటు న్నారని ఎద్దేవా చేశారు. అందుకే వైసిపిని గొడ్డలి పార్టీ అంటున్నామన్నారు. ఈ సభలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పి.నారాయణ, ఎంపిలు ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ బాబు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కల్లుగీత కార్మికుని కుటుంబాన్ని సందర్శించిన చంద్రబాబు
'పేదల సేవలో' కార్యక్రమం అనంతరం స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసాన్ని సిఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా రూ. నాలుగు వేలు పింఛను సొమ్మును అందజేశారు. కుటుంబ యోగక్షేమాల గురించి, కల్లుగీత వృత్తిలో ఉండే కష్ట నష్టాల గురించి సిఎం ఆరా తీశారు. తాటి చెట్టుపై నుంచి తెచ్చిన తాజా కల్లును ముఖ్యమంత్రి రుచి చూశారు.
సిపిఎం, ప్రజా సంఘాల నాయకుల నిర్బంధం
చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలోని సిపిఎం, ఇతర ప్రజా సంఘాల నాయకులపై నిర్బంధం విధించారు. పలువురు సిపిఎం నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సిపిఎం జిల్లా సీనియర్ నాయకురాలు బేబిరాణి, గండేపల్లి మండల సిఐటియు నాయకురాలు లలిత ఇళ్లకు సైతం పోలీసులు వెళ్లారు. విద్యార్థి సమస్యలపై సిఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సూరిబాబు, అధ్యక్షుడు లోవరాజు, జిల్లా నాయకుడు సత్యలను అరెస్టు చేసి తుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరిలించారు. కోటనందూరు మండలం సిపిఎం నాయకురాలు షేక్ పద్మను, తుని మండల నాయకుడు నక్కిళ్ల శ్రీనుని హౌస్ అరెస్టు చేశారు. ఈ నిర్బంధాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇస్తామంటూ పిలిచి ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టు చేసిన వారిని సాయంకాలం విడుదల చేశారు.








కామెంట్‌లు (0)