test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​పెపే

23 గంటల క్రితం

Pepe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 02:24 అపరాహ్నం | 7 నిమిషాల చదవడం

పెపే' కి పదేళ్లు, అతను బల్లిలాగే బలహీనంగా, సన్నగా, చురుగ్గా ఉంటాడు. చిరిగిపోయిన రంగురంగుల బట్టలు అతని సన్నని భుజాల నుండి వేలాడుతుంటాయి. ఎండకు, మురికికి కమిలిన అతని చర్మం, ఆ చిరుగుల గుండా బయటకు కనిపిస్తూ ఉంటుంది.

సముద్రపు గాలికి ఇటు అటు ఊగిసలాడే ఎండిపోయిన గడ్డిపరకలా అతను కనిపిస్తాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పెపే ఆ ద్వీపంలోని రాళ్లపై ఒకదాని నుండి మరొకదానికి గెంతుతూ ఉంటాడు. గంటగంటకూ అతని అలసిపోని చిన్నారి గొంతు పాడుతూ వినబడుతుంది.

‘‘అందమైన ఇటలీ, నా సొంత ఇటలీ!’’.....

నేలపై అంతు లేకుండా పెరిగే పూలు. ఊదా రంగు బండరాళ్ల మధ్య తిరిగే బల్లులు. ఆలివ్ చెట్టు ఆకుల చెక్కిన పరిపూర్ణత. ద్రాక్ష తీగల పచ్చని అల్లికల మధ్య ఉండే పక్షులు.. సముద్రపు అడుగున ఉన్న చీకటి తోటలలోని చేపలు. పట్టణంలోని ఇరుకైన, వంకర మార్గాల్లో తిరిగే విదేశీయులు. కత్తి గాట్లు పడిన ముఖంతో ఉన్న లావుపాటి జర్మన్ వ్యక్తి, ఎప్పుడూ ద్వేషి పాత్రలో ఉన్న నటుడిని గుర్తుకు తెచ్చే ఇంగ్లీష్ వాడు, ఆంగ్లేయుడిలా కనిపించడానికి వృథాగా ప్రయత్నించే అమెరికన్. గిలకలా శబ్దం చేసే ఫ్రెంచ్ వ్యక్తి.

“అబ్బో, ఎంతటి ముఖం!” అని పెపే తన తోటి పిల్లలతో అంటాడు. ప్రాముఖ్యతతో ఉబ్బిపోయి ఉండటం వల్ల జుట్టు కూడా నిక్కబొడుచుకున్నట్టున్న ఆ జర్మన్ వ్యక్తిని తన తీక్షణమైన కళ్లతో చూస్తూ, “అది నా పొట్ట అంత పెద్ద ముఖం!” అని ఎగతాళి చేస్తాడు.

పెపేకు జర్మన్లు అంటే ఇష్టం లేదు. అతను వీధులు, కూడళ్లు, పట్టణ ప్రజలు మద్యం సేవించే, పేకాట ఆడే, వార్తాపత్రికలు చదివే రాజకీయాలు చర్చించే చీకటి చిన్న సారా దుకాణాల్లోని భావాలను, సెంటిమెంట్లను పంచుకుంటాడు.

“బాల్కన్ స్లావ్స్,” అని వారు అంటారు.. “మా స్నేహానికి ప్రతిఫలంగా ఆఫ్రికా ఇసుకను మాకు బహుమతిగా ఇచ్చిన మా మంచి మిత్రుల కంటే, వారు మా వంటి పేద దక్షిణ ఇటలీవాళ్లకు చాలా దగ్గరైనవారు.”

దక్షిణాదిలోని సామాన్య ప్రజలు దీనిని మరింత ఎక్కువగా చెబుతున్నారు.. తరచుగా, పెపే అన్నింటినీ వింటాడు.. వేటినీ మరచిపోడు.

ఇక్కడ ఒక విసుగు పుట్టించే ఇంగ్లీష్ వ్యక్తి ఉన్నాడు. అతను తన కత్తెర వంటి పొడవాటి కాళ్ళతో వేగంగా నడుస్తున్నాడు. అతని ముందు ఉన్న పెపే ఏదో ఒక అంత్యక్రియల గీతాన్ని, విషాదకరమైన పాటను ఇలా పాడుతున్నాడు.

'నా స్నేహితుడు మరణించాడు,

నా భార్య విచారంగా ఉంది...

ఆమెకు ఏమి జరిగిందో నాకు తెలియదు.'

ఆ విదేశీయుడు తన నిస్తేజమైన కళ్ళతో శాంతంగా వారిని చూసినప్పుడల్లా, పెపే ఆటపాటల స్నేహితులు నవ్వును ఆపుకోలేక అతని వెనుక వస్తూ, ఎలుకల మాదిరిగా పొదల్లోకి లేదా గోడల వెనుక దాక్కుంటున్నారు. ఒకరోజు ఒక ఆమె తన తోటలోని ఆపిల్ పండ్ల బుట్టను పెపే చేతికి ఇచ్చి తన స్నేహితురాలికి పంపింది.

"నేను నీకు ఒక నాణెం ఇస్తాను!" అని ఆమె చెప్పింది, "అది నీకు బాగా ఉపయోగపడుతుంది."

పెపే వెంటనే ఆ బుట్టను అందుకుని, తన తలపై పెట్టుకుని బయలుదేరాడు. తిరిగి సాయంత్రం అయ్యే వరకు అతను ఆ నాణెం కోసం రాలేదు.

“నువ్వు రావడానికి చాలా లేట్ అయ్యింది,” అని ఆమె అంది.

“అమ్మగారు, నేను చాలా అలసిపోయాను!” అని నిట్టూరుస్తూ పెపే బదులిచ్చాడు. “మీరు చూడండి, అక్కడ పది కంటే ఎక్కువ మంది ఉన్నారు!”

“అందులో వింతేముంది, పది కంటే ఎక్కువ ఉండక? అది నిండు బుట్ట కదా!”

“నేను ఆపిల్ పండ్ల గురించి కాదు, అబ్బాయిల గురించి చెప్తున్నాను.”

“కానీ ఆపిల్ పండ్ల సంగతి ఏమైంది?”

“ముందు ఆ అబ్బాయిల గురించి వినండి మిచెల్, గియోవన్నీ...”

ఆ స్త్రీకి కోపం వచ్చింది. ఆమె పెపే భుజం పట్టుకుని కుదిపేస్తూ:

“నాకు సమాధానం చెప్పు, నువ్వు ఆపిల్ పండ్లను చేరవేశావా లేదా?” అని అరిచింది.

“నేను వాటిని మోసుకుంటూ చౌరస్తా వరకు వెళ్లాను అమ్మగారూ ! నేను ఎంత బుద్ధిగా ప్రవర్తించానో వినండి. మొదట నేను వారి వెటకారాలను అస్సలు పట్టించుకోలేదు. నన్ను గాడిదతో పోల్చుకోనివ్వండి, మీపై ఉన్న గౌరవంతో వీటన్నింటినీ భరిస్తానని నాకు నేనే చెప్పుకున్నాను. కానీ ఎప్పుడైతే వారు మా అమ్మను ఎగతాళి చేయడం మొదలుపెట్టారో, అప్పుడు ఇక చాలు అని నిర్ణయించుకున్నాను.”

“నేను ఆ బుట్టను కింద పెట్టి, ఆ చిన్న దెయ్యాల మీద ఆ ఆపిల్ పండ్లతో ఎంత చక్కగా విసిరికొట్టానో మీరు చూడాల్సింది. మీరు కూడా దాన్ని చూసి ఆనందించేవారు!”

“వాళ్ళు నా పండ్లను దొంగిలించారా!” అని ఆ స్త్రీ అరిచింది.

పెపే ఒక దీనమైన నిట్టూర్పు విడిచాడు.

“ఓ, లేదు,” అతను చెప్పాడు, “తప్పిన పండ్లు గోడకు తగిలి పగిలిపోయాయి. కానీ మిగిలిన వాటిని నేను నా శత్రువులను ఓడించి, వారితో రాజీ పడిన తర్వాత మేమందరం కలిసి తినేశాము..”

​ఆ స్త్రీ పేపే యొక్క చిన్న గుండు తలపై తిట్ల వర్షం కురిపించింది. అతను ఎంతో శ్రద్ధగా, వినయంగా వింటూ, ఆమె వాడిన కొన్ని విలక్షణమైన పదజాలాన్ని మెచ్చుకుంటూ మధ్యమధ్యలో నాలుకతో చప్పుడు చేస్తూ ఇలా అన్నాడు, "ఓహో, అది కదా అసలైన మాట! ఎంతటి భాష!"

చివరికి ఆమె కోపం చల్లారి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అతను ఆమె వెనుక నుండి ఇలా గట్టిగా అరిచాడు:

"మీ అద్భుతమైన ఆపిల్ పండ్లతో నేను ఆ పనికిరాని వెధవల మురికి తలలను ఎంత అందంగా పచ్చడి చేశానో మీరు చూసి ఉంటే ఇలా ఫీలయ్యేవారు కాదు. ఒకవేళ మీరు అది చూసి ఉంటే, నాకు ఒక నాణేం కి బదులుగా రెండు ఇచ్చేవారు!" ఆ వెర్రి మహిళకు ఆ విజేత యొక్క వినయపూర్వకమైన గర్వం అర్థం కాలేదు.

​ఆమె కేవలం అతని వైపు పిడికిలి ఊపుతూ వెళ్ళిపోయింది.

పేపే అక్క వయసులో అతనికంటే చాలా పెద్దది, కానీ తెలివితేటల్లో మాత్రం కాదు. ఆమె ఒక ధనవంతుడైన అమెరికన్ విల్లాలో పనిమనిషిగా చేరింది. అక్కడ చేరగానే ఆమె రూపం మారిపోయింది. ఆమె ఎంతో శుభ్రంగా, నీటుగా తయారైంది, ఆమె బుగ్గలు ఎర్రగా మెరిశాయి. ఆగస్టు మాసంలోని రేగు పండులా ఆమె కళకళలాడుతూ ఆరోగ్యంగా తయారైంది.

​పెపే


"నువ్వు నిజంగానే ప్రతిరోజూ తింటావా?" అని ఆమె తమ్ముడు ఒకసారి ఆమెను అడిగాడు.

"కావాలంటే రోజుకు రెండు, మూడు సార్లు కూడా తింటాను," అని ఆమె గర్వంగా సమాధానమిచ్చింది.

"చూసుకో, నీ పళ్లు అరిగిపోకుండా జాగ్రత్త," అని పేపే ఆమెకు సలహా ఇచ్చాడు.

“మీ యజమాని చాలా ధనవంతుడా?” అని అతను కాసేపు ఆగి అడిగాడు.

“ఓ, అవును, అతను రాజు కంటే ధనవంతుడని నేను నమ్ముతున్నాను!”

“నువ్వు నన్ను మోసం చేయలేవు! అతని దగ్గర ఎన్ని జతల ప్యాంట్లు ఉన్నాయి?”

“చెప్పడం కష్టం.”

“పదా?”

“బహుశా... ఇంకాక్కువే...”

“అయితే నా కోసం ఒక జత తీసుకురా, కాళ్లు మరీ పొడవుగా ఉండకూడదు. కానీ నీకు దొరికే వాటిలో అత్యంత వెచ్చనిది అయ్యుండాలి,” అని పేపే అన్నాడు.

“ఎందుకు?”

“సరే, నా ప్యాంటు వైపు ఒక్కసారి చూడు!”

నిజంగానే అక్కడ చూడటానికి పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే పేపే ప్యాంటులో చాలా తక్కువ భాగం మిగిలి ఉంది.

“అవును,” అతని సోదరి అంగీకరించింది. “నీకు నిజంగా కొన్ని బట్టలు అవసరం! కానీ మనం వాటిని దొంగిలించామని అతను అనుకోడా?”

“ప్రజలు మనకంటే తెలివితక్కువ వారని ఊహించుకోకు!” అని పేపే ఆమెకు ధైర్యం చెప్పాడు. “చాలా ఉన్న వారి దగ్గర నుండి కొంచెం తీసుకున్నప్పుడు, అది దొంగతనం కాదు, అది కేవలం పంచుకోవడం మాత్రమే.”

“నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు” అని అతని సోదరి అభ్యంతరం చెప్పింది. కానీ పేపే త్వరగానే ఆమె సందేహాలను పోగొట్టాడు. ఆమె వంటగదిలోకి ఒక మంచి లేత-బూడిద రంగు ప్యాంటుతో వచ్చినప్పుడు, అది నిజానికి పేపేకు చాలా పెద్దదిగా ఉంది. ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలో అతనికి వెంటనే అర్థమైంది.

“నాకు ఒక కత్తి ఇవ్వు!” అని అతను అన్నాడు.

వారందరూ కలిసి త్వరత్వరగా ఆ అమెరికన్ యొక్క ప్యాంటును బాలుడికి సరిపోయే సౌకర్యవంతమైన దుస్తులుగా మార్చారు. వారి ప్రయత్నాల ఫలితంగా కొంచెం వదులుగా, బొద్దుగా ఉన్నప్పటికీ, భుజాలకు తగిలించుకునే వీలుగా ఉన్న ఒక సంచి లాంటి దుస్తులు తయారయ్యాయి. దాన్ని మెడ చుట్టూ కట్టడానికి దారాలను ఉపయోగించారు, ప్యాంటు జేబులు చేతులు లాగా పనిచేసాయి.

ఒకవేళ ఆ ప్యాంటు యజమాని భార్య మధ్యలో వచ్చి వారి పనిని ఆపకపోయి ఉంటే, వారు ఇంకా మెరుగైన సౌకర్యవంతమైన వస్త్రాన్ని తయారుచేసి ఉండేవారు. ఆమె వంటగదిలోకి వచ్చి అనేక భాషల్లో చాలా అసభ్యకరమైన పదాలను వాడటం మొదలుపెట్టింది. ఆ పదాలన్నిటినీ ఆమె అంతే దారుణంగా ఉచ్చరించింది.

పెపే, ఆమె తిట్లను ఆపడానికి ఏమీ చేయలేకపోయాడు. అతను నుదురు ముడిచి, గుండెపై చేయి వేసుకుని, తల పట్టుకుని నిరాశగా గట్టిగా నిట్టూర్చాడు. కానీ ఆమె భర్త అక్కడికి వచ్చే వరకు ఆమె శాంతించలేదు.

"ఏమైంది?" అని అతను అడిగాడు. దానికి పెపే ఇలా బదులిచ్చాడు:

"అయ్యా, మీ భార్య చేస్తున్న ఈ గొడవ చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, నిజానికి మీ తరపున నేను కొంత అవమానంగా కూడా భావిస్తున్నాను. నా ఉద్దేశం ప్రకారం, మేము ఆ ప్యాంటును పాడు చేశామని ఆమె అనుకుంటున్నట్లుంది. కానీ అవి నాకు సరిగ్గా సరిపోతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను! బహుశా నేను మీ చివరి ప్యాంటును తీసేసుకున్నానని, ఇక మీరు మరొకటి కొనుక్కోలేరని ఆమె భ్రమపడుతున్నట్లుంది.."

ఆ ప్రసంగాన్ని ప్రశాంతంగా విన్న ఆ అమెరికన్, ఇప్పుడు ఇలా అన్నాడు: " కుర్రవాడా, నేను పోలీసులకు ఫోన్ చేయాలని అనుకుంటున్నాను"

"నిజంగానే?" పేపే ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, "దేనికోసం?"

"నిన్ను జైలుకు పంపడానికి..."

పేపే తీవ్రంగా బాధపడ్డాడు. నిజానికి, అతను కన్నీళ్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తన కన్నీళ్లను దిగమింగుకుని చాలా హుందాగా ఇలా అన్నాడు:

"అయ్యా, ప్రజలను జైలుకు పంపడం మీకు ఆనందాన్ని ఇస్తే, అది మీ ఇష్టం! కానీ ఒకవేళ నా దగ్గర చాలా జంటల ప్యాంట్లు ఉండి, మీ దగ్గర ఒక్కటి కూడా లేకపోయినా నేను అలా చేయను! నేను మీకు రెండు, బహుశా మూడు జంటల ప్యాంట్లు ఇస్తాను.ఒకేసారి మూడు ప్యాంట్లు ధరించడం అసాధ్యం అయినప్పటికీ! ముఖ్యంగా వేడి వాతావరణంలో..." ఆ అమెరికన్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఎందుకంటే ధనవంతులు కూడా అప్పుడప్పుడు జోకులను అర్థం చేసుకోగలరు. తర్వాత అతను పేపేకు కొంత చాక్లెట్ ఇచ్చి, ఒక ఫ్రాంక్ నాణేన్ని బహుమతిగా ఇచ్చాడు. పేపే ఆ నాణేన్ని కొరికి చూసి, కృతజ్ఞతలు చెప్పాడు.

"ధన్యవాదాలు, అయ్యా! ఈ నాణెం అసలైనదేనని నేను భావిస్తున్నాను?"

కానీ పేపే ఎక్కడో రాళ్ల మధ్య ఒంటరిగా నిలబడి, ఆ రాళ్ల పగుళ్లను ఏదో చీకటి చరిత్రను చదువుతున్నట్లుగా ఆలోచనాత్మకంగా పరీక్షిస్తున్నప్పుడు అందంగా కనిపిస్తాడు.

అటువంటి క్షణాలలో అతని ప్రకాశవంతమైన కళ్ళు ఆశ్చర్యంతో విప్పారి మసకబారుతాయి. అతని సన్నని చేతులు వెనుకకు కట్టుకుని ఉంటాయి. కొద్దిగా వంగిన అతని తల, గాలిలో ఊగే పువ్వులా అటు ఇటు మెల్లగా ఊగుతుంది. అతను తనలో తాను మెల్లగా ఒక రాగాన్ని ఆలపిస్తాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ పాడుతూనే ఉంటాడు.

అతను పువ్వులను, గోడలపై ఊదా రంగులో విరివిగా పూసిన విస్టేరియా పూలను చూడటం కూడా చూడముచ్చటగా ఉంటుంది. పట్టు వంటి ఆ పూరేకులు సముద్రపు గాలికి కదిలే మెల్లని ప్రకంపనలను వింటున్నట్లుగా, అతను వైలిన్ తీగలాగా నిలబడతాడు.

​అతను చూస్తూ ఇలా పాడుతాడు: "ఫియోరినో... ఫియోరినో..." దూరం నుండి, ఏదో ఒక పెద్ద తంబురా శబ్దంలా, సముద్రపు నిట్టూర్పులు వినిపిస్తాయి.

సీతాకోకచిలుకలు పూల మీద ఒకదానికొకటి వెంటాడుకుంటాయి. పేపే తన తల ఎత్తి వాటి కోసం పరిగెడతాడు. ఎండలో కళ్ళు ఆర్పేస్తూ, అతని పెదవులపై కొద్దిగా ఈర్ష్య, విచారం కలిసిన చిరునవ్వు ఉంటుంది. అయినప్పటికీ అది ఈ భూమిపై ఒక ఉన్నతమైన జీవికి ఉండే ఉదారమైన చిరునవ్వు.

"చో!" అని అరుస్తూ, పచ్చని బల్లిని భయపెట్టడానికి అతను చప్పట్లు కొడతాడు.

సముద్రం అద్దంలా ప్రశాంతంగా ఉన్నప్పుడు, రాళ్లపై అలల తెల్లని నురుగు లేనప్పుడు, పేపే ఒక రాయిపై కూర్చుని, తన ప్రకాశవంతమైన కళ్ళతో నిర్మలమైన నీటిలోకి చూస్తాడు. అక్కడ ఎర్రటి సముద్రపు నాచు మధ్య చేపలు మృదువుగా ఈదుతుంటాయి, రొయ్యలు అటు ఇటు దూకుతుంటాయి పీత పక్కకు పాకుతూ వెళ్తుంది.

నిశ్శబ్దంలో ఆ బాలుడి స్పష్టమైన స్వరం నీలిరంగు అలల పైనుండి మెల్లగా వినబడుతోంది:

"సముద్రమా, ఓ సముద్రమా...”

పెద్దలు తరచుగా పేపే వైపు అసహనంతో తలలు ఊపుతూ, ఇలా అంటుంటారు: “వీడు ఒక అరాచకవాది అవుతాడు!”

కానీ ఎక్కువ విచక్షణ కలిగిన దయగల వ్యక్తులు మాత్రం మరొక అభిప్రాయంతో ఉన్నారు:

“పేపే మన కవి అవుతాడు...”

ఇక వెండి రంగు జుట్టుతో, పురాతన రోమన్ నాణేలపై చెక్కిన రూపంలా ముఖం ఉన్న, జ్ఞాని, గౌరవనీయుడైన వృద్ధ వడ్రంగి పాస్క్వాలినోకి తనదైన సొంత అభిప్రాయం ఉంది.

“మన పిల్లలు మనకంటే చాలా మెరుగ్గా ఉంటారు. వారి జీవితాలు కూడా ఇంకా బాగుంటాయి!”

చాలా మంది ప్రజలు ఆయన మాటలను నమ్ముతారు.


మాక్సిమ్ గోర్కీ
ఇటలీ కథలు నుంచి
తెలుగు : కుమార్ కూనపరాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్