దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత స్వంత ఉరిలోకి అడుగు పెట్టబోతున్న చైతన్య ఆనంద లోకంలో విహరిస్తున్నాడు. చిన్ననాటి నుంచి వీధి, వీధి తిరిగిన ఊరు, ఆడుకున్న మిత్రులు, తీర్చిదిద్దిన గురువులు ముఖ్యంగా సుందరం మాస్టర్ ఇవన్నీ మధురస్మృతులే. ఊరి గురుంచి ఈ ఆరు సంవత్సరాల ఎటువంటి సమచారం అందకుండా చేసిన కుటుంబసభ్యుల పట్ల కోపం కన్నా, ఊరులో అడుగు పెట్టబోతున్నాననే ఆనందం తనలో ఎక్కువగా ఉంది. చిన్నతనపు జ్ఞాపకాల దొంతర ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
శాంతిపురం ఒక చిన్న గ్రామం. అధికంగా మెట్ట ప్రాంతం. వర్షం మీద ఆధారపడి పంటలు పండే గ్రామం. కృష్ణమూర్తి-లక్ష్మీలకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు శేఖర్, చిన్నవాడు చైతన్య. శేఖర్, చైతన్య కన్నా పదేళ్లు పెద్ద. గ్రామంలో ప్రైమరీ స్కూల్ చదువులు మాత్రమే ఉండడంతో, హైస్కూల్ చదువుల కోసం శేఖర్ మేనమామ తన దగ్గరకు తీసుకెళ్ళాడు. శేఖర్ డిగ్రీ పూర్తికాగానే సర్వీస్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, ఢిల్లీలో స్థిరపడ్డాడు. చైతన్య సెకండరీ విద్యకు వచ్చేసరికి శాంతిపురంలో పదవ తరగతి వరకూ స్కూల్ అప్ గ్రేడ్ అయ్యింది. చైతన్య ఆరవ తరగతిలో సైన్స్ టీచర్ గా సుందరం మాస్టరు వచ్చారు. సుందరం మాస్టారు బ్రహ్మచారి. తన జీతంలో కొంత మొత్తాన్ని పేదపిల్లల కోసం, సైన్స్ ప్రదర్శనల కోసం, ఆరోగ్య కార్యక్రమాల కోసం వెచ్చించేవాడు. హేతువాద ఆలోచనలతో నిరంతరం సైన్స్ ప్రచారం చేస్తూ, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉండేవాడు. సుందరం మాస్టరు జీవన విధానం, ఆలోచనలు చైతన్య మీద చాలా ప్రభావితం చేశాయి. తన స్నేహితులు కృష్ణ , రహీమ్ , డేవిడ్, నాగరాజు ఒక టీమ్‌గా సుందరం మాస్టర్ తో పాటు సైన్స్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. తల్లితండ్రులు కట్టడి చేస్తున్నా వినకుండా దయ్యాల ప్రచారానికి వ్యతిరేకంగా రాత్రివేళ శ్మశానంలో నిద్ర చేయడం, గాలిలో నుంచి విభూతి సృష్టించడం, అరచేతిలో కర్పూరం వెలిగించడం, చేతబడి వంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం చేస్తూ ఉండేవారు. గ్రామ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం చేసేందుకు సుందరం మాస్టర్ ఈ టీమ్‌తో సిద్ధంగా ఉండేవారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు. పదవ తరగతికి వచ్చేసరికి జిల్లా వ్యాప్తంగా వందకు పైగా సైన్స్ ప్రదర్శనలు ఈ టీం నిర్వహించారు. పది పరీక్షల తర్వాత వేసవి సెలవులకు ఢిల్లీలో ఉన్న అన్న శేఖర్ దగ్గరకు వెళ్లాడు. అప్పుడే కరోనా లాక్ డౌన్ విధించడంతో చైతన్య ఢిల్లీలోనే ఉండిపోయాడు. శేఖర్, చైతన్యను అక్కడే ఇంటర్ లో చేర్పించాడు. అటుపై బిటెక్ సీట్, మంచి యూనివర్సిటీలో రావడంతో మొత్తం ఆరేళ్లు ఢిల్లీలో గడిపాడు. ఊరికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. టీచర్లకు, మిత్రులకు రాసిన ఉత్తరాలకు జవాబు రాలేదు. దీని వెనుక కుటుంబ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు అనుమానం చైతన్య మదిలో ఉన్నది. బిటెక్ చివరి సంవత్సరంలో మంచి ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడం, అటుపై ఉద్యోగంలో చేరడానికి మరికొంత సమయం ఉండడంతో స్వంత ఊరికి ప్రయాణం అయ్యాడు.
చైతన్యకు గ్రామ పరిస్థితి తన ఊహకు భిన్నంగా ఉంది. కులమతాల పేరు మీద ఉత్సవాలు, కటౌట్ లు, ఫ్లెక్సీలు కనిపించాయి. మనుషుల మధ్య మానసిక గోడలు గ్రామం మొత్తం కట్టుకున్నారు. మరొకవైపు డ్రగ్స్ మత్తులో యువత, మద్యం మత్తులో పురుషులు జోగుతున్నారు. గ్రామంలో ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో భయంతో- బిక్కు బిక్కుమంటూ తమ కష్టాలు పోవాలని మహిళలు దేవుని సేవలో బతుకుతున్నారు. గ్రామంలో చాక్లెట్స్ రూపంలో గంజాయి స్కూల్ పిల్లలకు అమ్ముతున్న విషయం వచ్చినరోజే చైతన్య తెలుసుకున్నాడు. ఈ మాఫియా వెనుక ఆ అధికార పార్టీ ఎంఎల్ఏ, ఆయన అనుచరగణం ఉండడమే కాక, ఈ మాఫియాను ఎదురించిన వారిని భౌతికంగా దాడులకు గురిచేయడం, పోలీస్ వ్యవస్థ రాజకీయ ఒత్తుడులతో వీరి పట్ల ఉదాసీనంగా ఉండడం ఆందోళనకు గురిచేసింది.
శాంతిపురంలో ప్రతి వీధి సుందరంగా ఉన్నది. కానీ ప్రతి కుటుంబమూ ఆందోళనలో గడుపుతున్నది. ప్రతిచోటా ఆత్మీయ పలకరింపు చైతన్య హృదయాన్ని కదిలించింది. ‘ఊరి జనంలో ఇంకా ఎక్కడో ఆప్యాయత, మానవత్వం ఉన్నాయి.. వాటిని బయటకు తీయాలి. పాతుకుపోతున్న రుగ్మతలను తొలగించాలి. ఊరి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి’ అని అనుకున్నాడు. మరొకవైపు త్వరగా ఊరి నుంచి వెళ్లిపొమ్మని కుటుంబసభ్యుల ఒత్తిడి పెరిగింది. ‘గ్రామమా? స్వార్ధమా?’ చైతన్యలో అంతఃసంఘర్షణ మొదలైంది.
‘సమాజం కలుషితం అయితే.. రేపు తాను కలుషితమవుతాడు. స్వార్ధంగా బతికితే.. రేపటి సమాజ పరిస్థితి దారుణంగా మారుతుంది. అందుకే ఊరి కోసం నిలబడాలి’ అని నిర్ణయించుకున్నాడు. సుందరం మాస్టర్ మార్గదర్శకత్వంలో పాత టీం సహాయంతో ఊరి కోసం పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాడు.
ఇక తన పాత టీం సభ్యుల కోసం వాకబు చేయగా, నాగరాజు ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఎవరి సహకారం లేక గ్రామానికి దూరమయ్యాడు. కృష్ణ, డేవిడ్, రహీమ్ పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగి, మతాల ప్రచారకులుగా మారిపోయారు. సుందరం మాస్టర్ కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై, అటుపై ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక ఆశ్రమంలో చేరారు. తన ప్రణాళిక సిద్ధం చేసుకొని, ముందుగా తన పాత టీంను ఒకచోట సమావేశ పరిచాడు. డేవిడ్, కృష్ణ, రహీమ్ ముగ్గురిని ఒకచోట కూర్చోపెట్టి, ఊరి బాగు కోసం వాళ్ళ ఆలోచనలను చెప్పమ్మన్నాడు. కులం, మతం మత్తు బాగా తలకెక్కి ఒకరి మీద ఆధిపత్యం కోసం వాదనలు చేసుకోవడం మొదలుపెట్టారు ఆ ముగ్గురు. చాలాసేపు సహనం వహించిన చైతన్య ముగ్గురిని గట్టిగా మందలించాడు. గతంలో తమ గ్రామాన్ని, ఇప్పటి గ్రామాన్ని పోల్చి చెప్పాడు.
‘కులాలు, మతాల పేరుతో ఒకవైపు, మద్యం, డ్రగ్స్ మత్తులో మరొకవైపు ఊరు వల్లకాడు కాబోతుంటె.. మనుషులను కాపాడుకోవాడమా? లేక కులమతాలను కాపాడుకోవడమా? ఇలా గ్రామాన్ని వదిలేస్తే.. రేపు మన భావితరాలకు ఎటువంటి సమాజాన్ని అందివ్వబోతున్నామో ఆలోచించండి. భవిష్యత్తులో ఇలా అశాంతితో, అరాచకంతో మన సమాజాన్ని నింపితే, మనుషులను మనషులుగా చూడలేని అమానవీయ సమాజంలో రేపటి తరం బతకగలదా?’ అంటూ వారిని ఆలోచింపజేశాడు. చాలాసేపు నిశబ్దం తర్వాత చైతన్య ఆలోచనలకు అనుగుణంగా స్నేహితులు గ్రామం కోసం పనిచేయడానికి సిద్ధమయ్యారు. అటుపై నాగరాజును వెళ్లి కలిశారు. అందరూ కలిసి సుందరం మాస్టర్ దగ్గరకు వెళ్లారు. అందరూ మళ్ళీ ఒక్కటవ్వడంతో సుందరం మాస్టారు సంతోషించారు. ఊరి బాగు కోసం, యువత ఆలోచన చేయడం మాస్టారుకు నచ్చింది. తాను సహకారం అందిస్తానని చెప్పారు.
చాలా సంవత్సరాల తర్వాత సుందరం మాస్టారు శాంతిపురం గ్రామంలోకి అడుగుపెట్టారు. మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఆరోగ్య ప్రసంగాలు, యువత కోసం ప్రత్యేకంగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు. మొదట డ్రగ్స్ వాడుతున్న యువత రాలేదు. వీరి కార్యక్రమాలకు అడ్డు తగిలారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడి, ఒప్పించడంతో కొంత ఘర్షణ తగ్గింది. కృష్ణ , డేవిడ్, రహీమ్ లు తమ పని తమ మత సమావేశాలలో మొదలుపెట్టారు. వీరి కృషికి మహిళల నుంచి స్పందన రావడం మొదలైంది. సుందరం మాస్టర్ తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో యువతకు ఇండోర్, అవుట్ డోర్ ఆట పరికరాలు సిద్ధం చేశారు. విడతల వారీగా ఆరోగ్య కాంప్ లు, ఆరోగ్య ప్రసంగాలు మొదలుపెట్టారు. చైతన్య, నాగరాజు, జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గ్రామ పరిస్థితిని, తమ ఆలోచనలను ఆయన ముందుంచారు. ప్రజలు చైతన్యం అయితే వారికి కావాల్సిన పోలీస్ రక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
అన్నివైపుల నుంచి ప్రయత్నాలు ప్రారంభమై మొదట మహిళలు సంఘటితంగా తమ ప్రాంతంలోని బెల్ట్ షాపులను మూయించారు. దీనితో వారిలో ధైర్యం పెరిగింది. ఆరోగ్య ప్రసంగాల ద్వారా పురుషులలో ఆలోచన మొదలై, ఊరిలోకి వచ్చే డ్రగ్స్ రవాణాదారులను అడ్డుకోవడం ప్రారంభించారు. ఈ సందర్భంలో డ్రగ్స్ మాఫియాకు గ్రామ ప్రజలకు ఘర్షణలు మొదలవడంతో కలెక్టర్ ప్రజల అండతో తాను, పోలీస్ ఫోర్స్ ను దింపారు. ప్రజలు ఐక్యంగా, చైతన్యంతో ఒకే మాట మీద నిలబడ్డారు. మద్యం, డ్రగ్స్ ఊరిలోకి రాన్వికూడదని నినాదాలు చేశారు. దాంతో మాఫియా వెనక్కి తగ్గింది. నిదానంగా గ్రామంలో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. కలెక్టర్ ప్రత్యేకశ్రద్ధతో మద్యం, డ్రగ్స్ భాదితులకు అవసరమైన కౌన్సిలింగ్, ఆరోగ్య సహకారం అందించారు. క్రమంగా మార్పు మొదలైంది.
ఓ రోజు గ్రామంలో విజయోత్సవ సభను పెట్టి సుందరం మాస్టర్ ను , చైతన్యను, వారి మిత్ర బృందాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. చైతన్య కుటుంబ సభ్యులు సైతం తమ కొడుకు ప్రయోజకత్వానికి మురిసిపోయారు. ఆ సభలో చివరిగా సుందరం మాస్టర్, చైతన్యలు సందేశాన్ని ఇచ్చారు. ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. అనునిత్యం అప్రమత్తంగా, సమిష్టిగా నిలిస్తే ఎటువంటి పరిస్థితులనైనా ఎదిరించవచ్చు’. అని చెప్పారు. ఈ స్ఫూర్తితో మరిన్ని గ్రామాలను బాగు చేయడానికి అధికార యంత్రాంగం ప్రతిన పూనింది.
మనస్విని








కామెంట్‌లు (0)