test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడవి రుచులు.. అద్భుతం..

31 మే, 2026

Wild Flavors... Magnificent!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 03:07 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రకృతి ప్రసాదించిన పచ్చని సంపదను రోజువారీ ఆహారంలో మార్చుకోవడంలో గిరిజనులు ముందుంటారు. ఆధునిక వంటకాలకు దొరకని అడవి రుచులను, ఆరోగ్య రహస్యాలను వీరు తమ దైనందిన ఆహారంలో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా కొండకోనల్లో సహజంగా పెరిగే కొండ ఆకు, తీగలకు అల్లుకునే సుగుణాల గుమ్మడి ఆకు, పుల్లటి రుచితో నోరూరించే గున్న చింత ఆకుకూరలతో వీరు చేసే వంటలు అద్భుతమైన పోషకాలకు నిలయాలు. గిరిజనులు అడవిలో దొరికే ఆకులను ఎక్కువ మసాలాలు లేకుండా, వాటి సహజమైన రుచి, పోషకాలు పోకుండా చాలా తక్కువ పదార్థాలతో వండుతారు. అడవి తల్లి ఒడిలో దొరికే ఈ విశిష్టమైన ఆకుకూరలను గిరిజనుల సాంప్రదాయ వంటలుగా ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం.

ప్రకృతి ప్రసాదించిన పచ్చని సంపదను రోజువారీ ఆహారంలో మార్చుకోవడంలో గిరిజనులు ముందుంటారు.


గున్న చింతల ఆకుతో …

కావాల్సినవి: గున్న చింతల ఆకు- 2 కప్పులు, కందిపప్పు- కప్పు, పచ్చిమిర్చి- 4 , ఉల్లిపాయలు- రెండు, వెల్లుల్లి రెబ్బలు: 7 (దంచినవి), కారం- చెంచా, పసుపు- పావు చెంచా, ఉప్పు- రుచికి తగినంత, నూనె- రెండు చెంచాలు, నీళ్లు- తగినన్ని.
తయారీ : గున్న చింతల ఆకులను కాడలు లేకుండా ఏరి, చేతులతో బాగా నలపాలి. ఒక మట్టి పాత్రలో కొద్దిగా నీరు పోసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా ఎసరు రానివ్వాలి. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసి, ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పప్పు సగం ఉడికిన తర్వాత, సిద్ధం చేసుకున్న గున్న చింతల ఆకును, కారాన్ని ఆ పాత్రలో వేసి బాగా కలపాలి. చింత ఆకులోని పులుపు మిగతా పదార్థాలకు పట్టేలా మూత పెట్టి సన్నని మంటపై ఇగిరే వరకూ మగ్గనివ్వాలి. కూర దగ్గరకు పడ్డాక, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్రతో నూనెలో పోపు పెట్టి కూరలో కలపాలి. ఈ కూర అన్నంలోకి, రొట్టెలోకి బాగుంటుంది. గున్న చింతల ఆకులో విటమిన్-సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండకాలం, వర్షాకాలంలో వచ్చే జీర్ణకోశ సమస్యలను నివారించడానికి, నోటికి రుచిని అందించడానికి గిరిజనులు ఈ పుల్లటి ఆకుకూర వంటకాలను ఎక్కువగా తింటారు.


ప్రకృతి ప్రసాదించిన పచ్చని సంపదను రోజువారీ ఆహారంలో మార్చుకోవడంలో గిరిజనులు ముందుంటారు.

కొండ ఆకుకూర ఇగురు
కావలసినవి: కొండ ఆకుకూర- రెండు కట్టలు, పచ్చిమిర్చి 4-5, ఉల్లిపాయ-1 పెద్దది, చింతపండు – కొద్దిగా (చిన్న నిమ్మకాయ సైజు), ఉప్పు- రుచికి తగనంత, పసుపు- పావు చెంచా, నూనె – 2 చెంచాలు, పోపు దినుసులు- గుప్పెడు(ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు).
తయారీ : కొండ ఆకుకూరను నీటిలో రెండు, మూడుసార్లు కడగాలి. ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి అందులో తరిగిన కొండ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి, ఉడికించాలి. ఆకు సగం ఉడికిన తర్వాత, దానికి కొద్దిగా చింతపండు రసం పోయాలి. ఇది ఆకుకూరలోని వగరును తగ్గించి, మంచి రుచిని ఇస్తుంది. ఆకుకూరలోని నీరంతా ఇగిరిపోయిన తర్వాత, గిన్నె దించి, పక్కన పెట్టాలి. మరొక చిన్న పాత్రను పొయ్యి మీద పెట్టి, కొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర , దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించాలి. ఈ పోపును ముందుగా ఉడికించి పెట్టుకున్న కొండ ఆకుకూర మిశ్రమంలో వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు చిన్న మంటపై ఉంచి, కూర గిన్నె దించేయాలి. ఈ కూరను ఎక్కువగా రాగి సంకటి లేదా జొన్న రొట్టెలలోకి చాలా బాగుంటుంది. వర్షాకాలంలో లభించే ఈ కొండ ఆకుకూరలు వారి శరీరానికి ఎంతో బలాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తాయని వారు నమ్ముతారు.


ప్రకృతి ప్రసాదించిన పచ్చని సంపదను రోజువారీ ఆహారంలో మార్చుకోవడంలో గిరిజనులు ముందుంటారు.

గుమ్మడి ఆకు ఇగురు

కావాల్సినవి: లేత గుమ్మడి ఆకులు/చిగుళ్లు- 2 కట్టలు, పచ్చిమిర్చి- 4-5, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, వెల్లుల్లి రెబ్బలు: 6-7 (కచ్చాపచ్చాగా దంచినవి), చింతపండు రసం- 2 చెంచాలు, పోపు దినుసులు- గుప్పెడు(ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి), పసుపు- పావు చెంచా, ఉప్పు- రుచికి తగినంత, నూనె- 2 చెంచాలు.
తయారీ : గుమ్మడి ఆకు వెనుక భాగంలో ఉండే పీచును, కాడలకు ఉండే గరుకు ముళ్లను చేత్తో లాగి, వలిచేయాలి. ఆకులను గట్టిగా నలుపుతూ నీళ్లలో రెండు, మూడు సార్లు బాగా కడగాలి. దాంతో ఆకులపై ఉండే గరుకుదనం పోయి ఆకు మెత్తబడుతుంది. ఆపై సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తరిగిన గుమ్మడి ఆకుకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పసుపు, ఉప్పు, అర గ్లాసు నీళ్లు పోసి, మూత పెట్టాలి. పొయ్యి మీద పెట్టి సన్నని మంటపై ఆకు మెత్తబడే వరకూ ఉడికించాలి. నీరంతా ఇగిరిపోతున్న సమయంలో కొద్దిగా చింతపండు రసం వేసి కలపాలి. కూర దగ్గరకు పడ్డాక గిన్నె దించి, పక్కన పెట్టాలి. వేరొక పాత్రలో నూనె పోసి, వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి. వెల్లుల్లి మంచి సువాసన వచ్చే వరకూ వేగాక, ఉడికించిన గుమ్మడి ఆకు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. పోపు అంతా కూరకు పట్టేలా రెండు నిమిషాలు మగ్గనిచ్చి, దించేయాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్