‘ఏమోయ్ మన పుత్రరత్నం లేచాడా? ఈ రోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడా... ఆ జాబ్స్ కి అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్. మంచి కంపెనీ, ఇన్సెంటివ్స్ కూడా బాగున్నాయి. త్వరగా లేచి అప్లై చేయమను. బద్ధకస్తుడు..’ అంటూ నోట్లో తిట్టుకుంటూ రామబ్రహ్మం తన భార్య వైదేహితో కాస్త చిరాకు పడుతూ చెప్పాడు.
‘అబ్బా ఏదో ఒకటి అనకపోతే మీకు తెల్లారదా..? పొద్దస్తమాను మీ కళ్ళన్నీ వాడి పైనే. ఏదో కాస్త వేసవికాలం కదా అని ఒక గంట ఎక్కువ సేపు పడుకుంటే అంత మాత్రానికి బద్ధకస్తుడు అని నోరు పారేసుకోకండి. సుడి తిరగాలే గానీ ఒక్క ఏడాదిలోనే కోటీశ్వరుడు అయిపోతాడు. అయినా వాడి జాతకంలో శని ఉంది. అందుకే కాస్త వాడికి వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నాయి. మొన్నీ మధ్య మన వంశీ జాతక చక్రం వేసి మరీ చూపించాడు మా అన్నయ్య. ఇంకో రెండు సంవత్సరాలు వాడి జాతకం ఇలాగే ఉంటుందట. తర్వాత ఒక్కసారే రైజ్ అవుతుందట. అందుకే ఇంకా వేటికీ అప్లై చేయకుండా ఈ రెండు సంవత్సరాలు కాస్త రెస్ట్ తీసుకుని ఆ దుష్ట గ్రహాలకి ఏవో శాంతులు చేయించి, తర్వాత అప్లై చేద్దామని ఊరుకున్నాడు. ఏది అర్థం చేసుకోరు. అన్నీ నేనే చెప్పాలి’ అని లోలోపల గొణుక్కుంటూ వంట పనికి ఉపక్రమించింది.
ఇంతలో ‘ఏవండోయ్ బ్రహ్మంగారు ఆవకాయ పచ్చడి పెట్టిద్దాం అనుకుంటున్నాం. కాస్త మంచి ముహూర్తం చూసి చెప్పండయ్యా. సంవత్సరం వరకూ ఉండాల్సిన పచ్చడి’ అన్నాడు రంగారావు వచ్చి. రామబ్రహ్మం కాసేపు ఆలోచించి ‘కాయలు ఎప్పుడు కోశారు?’ అని అడిగి తెలుసుకుని ‘ఈరోజు మధ్యాహ్నం పెట్టించు’ అని చెప్పగానే అతను బుర్ర మీద గోక్కుంటూ ‘అయ్యా తమరు అన్నీ తెలిసినవారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఈరోజు అమావాస్య కదండీ’ అన్నాడు.
‘అదా నీ డౌటు ఇంకో రెండ్రోజులు ఆగితే, కాయ పచ్చడికి కాదు కదా! కూరలో కూడా పనికిరాకుండా పోతుంది. నేను మంత్రించి ఓ తాయెత్తు ఇస్తాను. పచ్చడి పెట్టాక జాడీకి కట్టండి’ అని చెప్పగానే అతని మొహం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. రామబ్రహ్మం అక్కడే కూర్చుని, చదువుకుంటున్న తన కూతురు రమ్య వైపు చూడగానే తనకేదో అర్థమైనట్టుగా పెరట్లోకి వెళ్ళి, మామిడాకు కట్టిన పసుపు దారాన్ని తీసుకొచ్చి, రంగారావుకి ఇచ్చింది. దాన్ని తీసుకుని కళ్ళకు అద్దుమిని, ‘వస్తానండయ్యా. గత సంవత్సరం కూడా ఇలానే తాయెత్తు ఇచ్చారు. ఆ పచ్చడి ఇప్పటికీ కూడా పాడవలేదంటే నమ్మండి’ అంటూ డబ్బులు ఇవ్వబోతున్న రంగారావుని, ‘వద్దు’ అని వారించాడు రామబ్రహ్మం.
‘కాయలు శుభ్రం చేశాక, కాస్త ఎండలో రెండు గంటలు సేపుఉంచండి. చెమ్మ లేకుండా ఉంటుంది. ఉప్పు, కారం, నూనె సరిగ్గా వేయమన్నానని చెప్పు’ అని చెప్పగానే ‘అలాగే’ నంటూ బయలుదేరాడు. ఇదంతా కిటికిలోంచి చూస్తున్న వైదేహి ‘నేను పచ్చడి పెట్టేటప్పుడు ముహూర్తం చూడండి అంటే ఎప్పుడైనా విన్నారా?,‘ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టొచ్చు’ అని నా మాట కొట్టి పారేసారు. అదే బయటవాళ్ళు వచ్చి అడిగితే మాత్రం చక్కగా తాయెత్తులు కూడా ఇస్తారు’ అంటూ మూతి తిప్పింది. ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్లుగా తన జేబులో ఉన్న పొట్లాన్ని తీసి ‘‘ఏమోయ్ హైదరాబాదులో ఉంటున్న నా స్నేహితుడు జగన్నాథం మన పుత్ర రత్నానికి గోమేధికంతో చేసి, పూజలో పెట్టి, మంత్రించిన ఉంగరాన్ని పంపించాడు. అది పెట్టుకుంటే ఎలాంటి గ్రహాలైనా తిరగబడాల్సిందే. వెంటనే వాడ్ని లేపు. ఆ ఉద్యోగానికి అప్లై చేసి, చదవమని చెప్పు, విజయం తప్పనిసరిగా వస్తుంది’ అనేసరికి వైదేహి తెగ సంబరపడిపోతూ ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకొని కొడుకు చెవిలో ఊదింది.
అప్పటివరకూ మత్తుగా నిద్రపోతున్న శ్రీకర్ హుషారుగా లేచి, తయారై, ఉంగరం పెట్టుకొని, ఉద్యోగానికి అప్లై చేయడమే కాకుండా అటకపై పెట్టిన పుస్తకాలని ఓ సారి దులిపి, ఆ ఉంగరాన్ని చూసుకుంటూ, పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు. పరీక్షల్లో మంచి మార్కులు రావడమే కాదు ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. నెల రోజుల తర్వాత ఉద్యోగంలో జాయిన్ కావాలని పిలుపు కూడా వచ్చింది. దాంతో తల్లీ-కొడుకులు పరమానంద భరితులై దీనంతటికీ కారణం జగన్నాథం గారు పంపించిన ఉంగరమేనని అతనికి కృతజ్ఞతలు చెప్పాలని ఫోన్ చేయబోయారు. అది చూసిన రమ్య వాళ్ళని వారించి అసలు నిజం చెప్పింది. ‘అది నాన్న పాత ఉంగరం. మెరుగు పెట్టించారంతే.’ అంది. ఇంతలో వారి సంభాషణ వింటున్న రామబ్రహ్మం వచ్చి, కొడుకుని ప్రశంసిస్తూ ‘ఉద్యోగం వచ్చింది ఉంగరం వల్ల కాదు. నీ కృషి పట్టుదల వలన. ‘‘నా జాతకం బాలేదు’’ అని నువ్వు పెట్టుకున్న అనుమానం, భయం తీర్చడం కోసమే నేనూ, చెల్లి ఈ ఉంగరం నాటకం ఆడాం. రమ్య మెరుగు పెట్టించిన ఉంగరానికి పసుపు, కుంకుమ అద్ది ఇచ్చింది అంతే’ అన్నాడు చిరునవ్వుతో.
ఇంకా అనుమానం తీరని వైదేహి కూతురు వైపు చూసి-‘మరి తాయెత్తు’ అంటూ కళ్ళతోనే ప్రశ్నించింది.
రమ్య పక పకా నవ్వుతూ ‘నాన్న రంగారావుకి ఎటువంటి తాయెత్తు ఇవ్వలేదు. ఎంత చెప్పినా వినడని ఏదో అతని సంతృప్తి కోసమని దారానికి మామిడాకు కట్టి తెమ్మని చెప్పారు అంతే. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఇచ్చాను’ అంటూ నవ్వింది.
‘అన్నీ తెలిసినవాడికే అమావాస్య. ఏది తెలియనివాడికి ఏకాదశి అన్నట్టు, జాతకాలు మీద ఆధారపడి చేతిలో ఉన్న విలువైన సమయాన్ని చేజార్చుకోవడం చాలా తప్పు. ఎవరైనా శ్రమ, కఠోర దీక్షతో పనులు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు’ అంటూ కొడుకుని అభినందించాడు.
పేలూరి వెంకట మీనాక్షి
9912601765








కామెంట్‌లు (0)