‘అయితే, అంత దూరం వెళదాం అంటావా?’ అడిగాడు కృష్ణ బాలాజీ ప్రశ్నార్థకంగా.
‘వెళితే బాగుంటుంది. పనులు మన కోసం రావు. పనుల కోసమే మనం వెళ్ళాలి. రైలే కదా! మన ఊరి నుంచి బయలుదేరి.. నిడదవోలులో సర్కారు ఎక్ష్ప్రెస్ ఎక్కితే తెల్లవారేసరికి అక్కడుంటాం. వచ్చేది పెద్ద పండుగ.. ఖర్చులకు వస్తాయి కదా!’ అన్నాడు శశిధర్. వాళ్ళు ఇద్దరూ స్నేహితులు.
పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలంలో ఉండే విజ్జేశ్వరం సొంత ఊరు. చదువులు అంతంతమాత్రమే కావడంతో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. జనవరి ఒకటవ తేదీన నెల్లూరు జిల్లాలో ఉన్న పెన్నానది సమీపంలో ఇసుక లోడింగ్ పనులకు వెళ్లారు కుటుంబాలతో సహా. కృష్ణబాలాజీకి భార్య ప్రియాంకతో పాటు ఇద్దరు పిల్లలు అయితే, శశిధర్ కు భార్య రమ్యశ్రీతో పాటు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత అన్నట్లుగానే ఉంది అక్కడ. ఇద్దరూ దండిగానే డబ్బులు సంపాదించారు. అనుకున్నట్లుగానే సంక్రాంతికి ఒకరోజు ముందుగా బయలుదేరారు స్వంత ఊరైన విజ్జేశ్వరానికి. వాళ్ళ బస దగ్గర నుంచి.. నెల్లూరు రైల్వేస్టేషన్లకి చేరుకునేటప్పటికే ఇసుకేస్తే రాలనట్లు ఉన్నారు జనం. ఆ రద్దీని అంతటినీ చూస్తూ ‘ఈ రైలు మన నిడదవోలులో ఒక్క నిముషమే ఆగుతుంది. ఇంత జనంలో మనం పిల్లలతో టైముకి దిగగలమో! లేదో! ఎందుకైనా మంచిది.. టిక్కెట్లు రాజమహేంద్రవరం వరకూ తీసెయ్యి. ఇక్కడ వీలుకాకపోతే.. అక్కడైనా దిగవచ్చు’ చెప్పాడు శశిధర్ టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన కృష్ణబాలాజీతో. అలాగే చేసాడు కృష్ణబాలాజీ. అలా రాత్రి తొమ్మిది గంటల సమయంలో సర్కారు ఎక్కగలిగారు వాళ్ళు.
జనరల్ భోగీ కిటకిటలాడిపోతుంది. అది మాములు సమయంలోనే రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక పండుగ సందర్భాల్లో ఇక చెప్పనే అక్కరలేదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న జనం.. కూర్చునే చోటు లేక, చాలావరకూ నిలబడే ఉన్నారు. సర్దుకునే వీలు కనిపించక.. ఆడవాళ్ళూ, పిల్లలూ నడిచేదారి మధ్యలోనే చోటుచేసుకుని, ఓ తుండుగుడ్డ పరచుకుని, నేలపైనే కూర్చున్నారు. రాత్రి పూట ప్రయాణం కావడంతో నిద్రకు ఎంతోసేపు ఆగలేకపోయారు. చిన్నపిల్లలు అంత చలిలోనూ, ఉక్కబోతను భరించలేక ఏడుస్తున్నారు. వాళ్ళను సముదాయించలేక తల్లులు అవస్థ పడుతున్నారు. అంతా రణగొణ ధ్వని. రైలు తనదైన వేగంతో ప్రయాణిస్తుంది. ప్రియాంకా, రమ్యశ్రీ పిల్లలతో అలాగే సర్దుకుని కూర్చున్నారు. మగవాళ్ళకి సీట్లు దొరక్క నిలబడి, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
రైలు ఆగినప్పుడల్లా దిగేవాళ్ళ కన్నా ఎక్కేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మధ్య రాత్రి రెండున్నరకు విజయవాడ చేరుకుంది. అక్కడ ఎక్కువ సమయం ఆగడంతో కిందకు దిగారు స్నేహితులు ఇద్దరూ టీ ల కోసం అన్నట్లు. ఆడవాళ్ళకి తినడానికి తినుబండారాలు తీసుకున్నారు.
శశిధర్ కి టీ తాగిన వెంటనే, ఓ సిగరెట్టు కాల్చే అలవాటు. రైలు కదలడానికి ఇంకా టైము ఉండడంతో ఓ సిగరెట్టు తీసుకుని కాల్చడం మొదలుపెట్టాడు భోగీ పక్కనే నిలబడి. అంతలో ‘కాకినాడ వైపుకి వెళ్ళే సర్కారు ఎక్సెప్రెస్ రెండవ ఫ్లాట్ ఫారం నుండి కొద్దిసేపటిలో బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది’ అన్న అనౌన్సుమెంటు వినిపించడంతో రైలు దిగినవాళ్ళు అందరూ పరుగు పరుగున భోగీలోనికి ఎక్కడం ప్రారంభించారు.
‘సరే! రా.. ఇక దాన్ని పడెయ్యి’ అంటూ కృష్ణబాలాజీ ముందుకు కదిలాడు.
‘నువ్వు నడువు’ అంటూ చేతిలో సిగరెట్టును మరో రెండు దమ్ములు లాగి .. చివరిగా ఎక్కి, రైలు డోరు దగ్గరే నిలబడిపోయాడు. రైలు ఊపు అందుకోవడంతో భర్త శశిధర్ కనబడకపోవడంతో అంతా కలియజూస్తూ రమ్యశ్రీ కంగారుగా అడిగింది ‘అన్నయ్యా! ఆయనేడి?’ అంటూ.
‘ఉన్నాడులేమ్మా! ఆ చివరన నిలబడ్డాడు. కంగారుపడాల్సిన పని లేదు. వాడి అలవాటు తెలిసిందే కదా!’ అంటూ సిగరెట్టు కాలుస్తున్నాడు అన్నట్లు సౌంజ్ఞ చేసి చెప్పాడు కృష్ణబాలాజీ. కుదుటపడింది ఆమె.
తెల్లవారేసరికి .. నిడదవోలు జంక్షన్ కి ముందునున్న కాల్దారి అనే చిన్నస్టేషను దాటగానే అందర్నీ గుమ్మం దగ్గరకు నడిపించి, రైలు దింపేశాడు కృష్ణబాలాజీ. రాజమహేంద్రవరం వరకూ వెళ్ళే అవసరం లేకుండా. అప్పటికీ శశిధర్ కనిపించకపోవడంతో అతని సెల్ కి ఫోన్ చేశాడు. సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ మళ్ళీ చేసినా అదే జవాబు. ఏం చెయ్యాలో తోచక స్టేషను మాస్టారుకి విషయం వివరించారు.
వాళ్ళని ఎగాదిగా చూసిన స్టేషను మాస్టారు.. తనకి అప్పటికే రైల్వే పోలీసులు నుంచి అందిన సమాచారం గురించి చెప్పాడు. రైలు గుమ్మం దగ్గర ఉన్న ఒండ్రు శశిధర్ అనే వ్యక్తి కాల్దారి రైల్వేస్టేషనులో జారిపడి, మృతి చెందాడని. ఆ చిన్నస్టేషనులో రైలు ఆగదు. కాబట్టి, ఆ విషయాన్ని జనాలు ఎవ్వరూ గుర్తించలేదు. కన్నీరు మున్నీరు అయ్యింది రమ్యశ్రీ. అప్పటికే రైల్వే పోలీసులు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కేసు దర్యాప్తు నిమిత్తం.
పి.ఎల్.ఎన్. మంగారత్నం
9701426788








కామెంట్‌లు (0)