test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు చక్రాల నేస్తం..!

31 మే, 2026

The Two-Wheeled Companion..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 10:08 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

మొదటిసారి నాన్న సైకిల్ వెనుక పట్టుకుంటే భయం భయంగా తొక్కిన రోజు గుర్తొస్తే.. మనసులో అలజడి.. పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరుస్తుంది. తరాలు మారుతున్నా, టెక్నాలజీ ఎంత పెరిగినా సైకిల్‌తో మనకున్న అనుబంధం మాత్రం ఎప్పటికీ మారదు. అది మన తాతల నాటి మధ్యతరగతి దర్పం, మన తండ్రుల నాటి బాధ్యత, మన బాల్యపు జ్ఞాపకం. జూన్ 3 ‘ప్రపంచ సైకిల్ దినోత్సవం’. మన జీవిత ప్రయాణంలో అంతర్భాగమైన ఆ రెండు చక్రాల నేస్తంతో మనకున్న అనంతమైన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం..


రెండు చక్రాలు, ఒక హ్యాండిల్ బార్.. ఒకవైపు పెడల్ పై కాలుపెట్టి తొక్కితే మరోవైపు కాలు పైకి లేస్తుంది. ఇలా రెండు కాళ్లనూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతుంటే.. బాల్యంలో విజయం సాధించినట్లే. అతి కష్టమైన పని మనం నేర్చుకునేట్లు..! ఆ అనుభూతి చిన్న మనసులో నిలిచిపోతుంది. సైకిల్‌ ‌తొక్కడం, నేర్చుకోవడం ప్రతిఒక్కరి జీవితంలోనూ ఒక మధురమైన జ్ఞాపకం. మోకాళ్లు పగిలినా, కింద పడ్డా వదలకుండా బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్న ఆ రోజులు.. స్నేహితులతో కలిసి ఊరంతా తిరిగిన ఆ క్షణాలు ఇప్పటికీ మన మనసుల్లో పదిలంగానే ఉంటాయి. సైకిల్ అంటే కేవలం ఒక వాహనం కాదు, రెండు చక్రాల తొలి నేస్తం.


సైకిల్ పుట్టుక..
ఇప్పుడు మనం చూస్తున్న సైకిల్ ఒక్కరోజులో తయారుచేయలేదు. దీని వెనుక రెండు శతాబ్దాల పరిణామక్రమం ఉంది. జర్మనీకి చెందిన బారన్ కార్ల్ వాన్ డ్రైస్ అనే ఆవిష్కర్త 1817లో సైకిల్‌కు మూలరూపాన్ని తయారుచేశారు. దానికి పెడల్స్ ఉండేవి కావు. చెక్కతో చేసిన ఆ వాహనాన్ని రెండు కాళ్లతో నేలపై నెడుతూ ప్రయాణించాల్సి వచ్చేది. అప్పట్లో దీన్ని ‘డ్రైసిన్’ లేదా ‘లాఫ్‌మాషీన్’ (రన్నింగ్ మెషిన్) అని పిలిచేవారు. ఆ తర్వాత 1860లో ఫ్రాన్స్‌కు చెందిన పియరీ మిచాక్స్, పియరీ లాల్‌మెంట్ అనే ఇద్దరు మెకానిక్‌లు మొదటిసారిగా ముందు చక్రానికి పెడల్స్‌ను అమర్చారు. దీనికి ‘బోన్‌షేకర్’ (ఎముకలు కుదిపేసేది) అని పేరు పెట్టారు. ఎందుకంటే అప్పట్లో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు. సైకిల్ చక్రాలు ఇనుము, చెక్కతో ఉండటంతో ప్రయాణం చాలా కుదుపులతో సాగేది. ఆ తర్వాత సైకిల్ వేగాన్ని పెంచడం కోసం 1870లో సైకిల్ ముందు చక్రాన్ని చాలా పెద్దదిగా, వెనుక చక్రాన్ని చిన్నదిగా డిజైన్ చేశారు. దీనిపై నుండి కిందపడితే బాగా గాయాలయ్యేవి అప్పట్లో. 1880లో జాన్ కెంప్ స్టార్లీ అనే బ్రిటీష్ ఆవిష్కర్త రెండు చక్రాలు సమానంగా ఉండి, చైన్ డ్రైవ్ సిస్టమ్‌తో నడిచే ‘సేఫ్టీ బైసికిల్’ను రూపొందించారు. దీనికి జాన్ బోయిడ్ డన్‌లప్ కనిపెట్టిన గాలితో నింపే (Pneumatic) రబ్బరు టైర్లు అమర్చడంతో మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక సైకిల్ తయారైంది.


సామాన్యుడి జీవితంలో సారథి..
ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో సైకిల్ సామాన్యుడి జీవితంలోకి ప్రవేశించింది. కార్లు, మోటార్ బైకులు కొనలేని మధ్యతరగతి, పేద ప్రజలకు సైకిల్ ఒక మంచి వాహనంలా మారింది. అప్పట్లో ఉపాధికి ఊతంలా ఉపయోగించారు. పాలు అమ్మేవారు, పేపర్ బాయ్స్, పోస్ట్‌మెన్, కూరగాయల వ్యాపారులు, పొలాలు వెళ్లే రైతులకు.. వీరందరికీ సైకిలే ప్రధాన ప్రయాణ సాధనమైంది. అంతేకాదు.. ఆ సమయంలో మహిళల సాధికారతలో సైకిల్ కీలక పాత్ర పోషించింది. 19వ శతాబ్దం చివర్లో మహిళలు చదువుకునేందుకు బయటకు వచ్చేవారు. తమ సొంత కాళ్లపై, ఎవరి సహాయం లేకుండా దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి చాలామంది మహిళలు సైకిల్ మీద ఆధారపడ్డారు. ఒకప్పుడు మన దేశంలో పెళ్లిళ్లలో సైకిల్‌ను వరకట్నంగా ఇవ్వడం గమనర్హం. ఇంటి ముందు సైకిల్ ఉంటే అదో పెద్ద హోదా. సైకిల్‌కు కూడా లైసెన్స్, నంబర్ ప్లేట్, రాత్రి పూట కచ్చితంగా డైనమో లైట్ ఉండాలనే నియమాలు ఉండేవంటే.. దాని ప్రాధాన్యత అప్పట్లో ఎంతో అర్థం చేసుకోవచ్చు.


ఆధునిక కాలంలోనూ..
కాలం మారింది బైకులు, కార్లు వచ్చాక సైకిల్ వాడకం కొంత తగ్గిందనిపించినా, ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా సరికొత్త రూపంలో విలాసవంతమైన, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ కు సింబల్‌గా సైకిల్స్ రీ-ఎంట్రీ ఇస్తున్నాయి. పర్వతాలు, గరుకు రోడ్లపై ప్రయాణించే వీలుగా గేర్, స్పోర్ట్స్ బైక్స్ రూపంలో అల్ట్రా-లైట్ వెయిట్ కార్బన్ ఫైబర్ బాడీలు, 21 వరకు గేర్ సిస్టమ్స్, పవర్‌ఫుల్ షాక్ అబ్జార్బర్స్ (సస్పెన్షన్) తో ‘మౌంటెన్ బైక్స్’ (MTB) సైకిళ్లు నేడు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిపై సుదూర ప్రయాణం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ సైకిళ్లు (ఇ-సైకిళ్లు) ఇప్పుడు మార్కెట్‌ను ఏలుతున్నాయి. అలసిపోయినప్పుడు పెడల్స్ తొక్కకుండా బ్యాటరీ మోటార్ సహాయంతో ఇవి నడుస్తాయి. తక్కువ దూరంలో ఆఫీసులకు వెళ్లేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ఐటీ ఉద్యోగుల నుండి సెలబ్రిటీల వరకూ.. వీకెండ్స్‌లో సైక్లింగ్ క్లబ్స్ ద్వారా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తూ ఫిట్‌నెస్ సాధిస్తున్నారు. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి సైక్లింగ్‌ను మించిన వ్యాయామం లేదని వైద్యులు కూడా చెబుతున్నారు. నిత్యం సైక్లింగ్ చేసేవారిలో మధుమేహం (డయాబెటిస్), గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 40% వరకు తగ్గుతాయని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.


నెదర్లాండ్స్ ఒక రోల్ మోడల్..
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరిగిన దేశాలు సైకిల్ వాడకాన్ని ఒక ఉద్యమంలా ప్రోత్సహిస్తున్నాయి. నెదర్లాండ్స్ లో జనాభా కంటే సైకిళ్ల సంఖ్యే ఎక్కువ. కార్ల కంటే సైకిళ్లకే రోడ్లపై మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకమైన సైకిల్ హైవేలు, వేల సంఖ్యలో సైకిల్ పార్కింగ్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. డెన్మార్క్ లో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి సైకిల్ ఉంటుంది. ఆఫీసులకు, పాఠశాలలకు సైకిళ్లపై వెళ్లడమే అక్కడ గౌరవంగా భావిస్తారు. పారిస్, లండన్ లో కాలుష్యాన్ని, ట్రాఫిక్‌ను తగ్గించడానికి ఈ నగరాల్లో ‘పబ్లిక్ బైక్ షేరింగ్’ సిస్టమ్స్ నడుస్తుంది. ఎవరైనా యాప్ ద్వారా సైకిల్ బుక్‌‌ చేసుకోవచ్చు. సైకిల్‌‌పై ప్రయాణించి, వారి గమ్యస్థానంలో వదిలేయవచ్చు. ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఐరోపా దేశాల్లో ఇప్పుడు ‘సైకిల్ టూరిజం’ ఒక పెద్ద పరిశ్రమ నడుస్తుంది. వేల కిలోమీటర్ల పొడవైన ప్రకృతి రమణీయమైన మార్గాల్లో కేవలం సైకిళ్లపై మాత్రమే ప్రయాణిస్తూ ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది అంటే సైకిల్‌ ‌కి ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.


సామాజిక మార్పునకు ‘సైకిల్’
విద్య ఖరీదైన నేటి పరిస్థితుల్లో సైకిల్ అక్షరాస్యతను పెంచే ఒక విప్లవాత్మక సాధనం. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో అమ్మాయిలు చదువుకునేందుకు ముఖ్య కారణం ‘సైకిల్`. గ్రామీణ ప్రాంతాల్లోని హైస్కూల్ విద్యార్థినులు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లలేక చదువు మానేసే వారి సంఖ్య పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత బాలికల చదువు ప్రోత్సహించేందుకు అమలు చేసిన ‘ఉచిత సైకిల్` పంపిణీ పథకం ద్వారా బాలికలు చదువుకునేందుకు వెళుతున్నారు అంటే దానికి కారణం సైకిల్‌.

భూమిని రక్షించే ‘సైకిల్‌’
గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ప్రపంచాన్ని భయపెడుతున్న నేటి తరుణంలో.. పైసా ఇంధనం ఖర్చు లేకుండా, కాలుష్యం విడుదల చేయకుండా ప్రయాణించే సైకిల్ భూమిని రక్షించే ఒక గొప్ప వాహనం. ఆరోగ్యం కోసం, పర్యావరణం కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం రోజువారీ జీవితంలో కనీసం చిన్న చిన్న దూరాలకైనా సైకిల్ వాడటం మంచిది. కాలుష్యం ఎరుగని ఈ పర్యావరణ హిత వాహనం నేడు ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన రేపటి వైపు నడిపిస్తోంది.

ఆదర్శాలకు సజీవ సాక్ష్యం.. సైకిల్ అంటే కేవలం పేదవాడి అవసరమే కాదు, కొందరు మహానీయుల నిరాడంబరతకు, ఆదర్శాలకు సజీవ సాక్ష్యం. భారతదేశ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత అయిన పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన సైకిల్ ప్రయాణమే. పార్లమెంట్ లో ప్రతిపక్షనేతగా ఎన్నికైనప్పటికీ, ఆయన తన సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్లేవారు. నిరుపేదల పక్షాన నిలబడటానికి సైకిల్‌ను ఒక యంత్రంగా, తన జీవన విధానంగా మార్చుకున్నారు. సుందరయ్య గారే కాదు, రామ్‌ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ వంటి ఎందరో ప్రజా నాయకులు సైకిల్‌ను తమ ప్రధాన రథంగా చేసుకుని పేద ప్రజలను కలిసేవారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు కూడా తన రాజకీయ ప్రస్థానంలో సైకిల్‌ను విరివిగా వాడారు.


పద్మావతి

9490559477


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్