ఋతుస్రావం అంటే ఈసడించుకోవడం, మొహం చిట్లించుకోవడం దగ్గరి నుండి ఎవరైనా రుతుస్రావం పేరు ఎత్తితే మౌనంగా ఉండే దశ వరకూ చేరుకున్నాము. ఋతుక్రమం సాధారణంగా ఐదు రోజుల పాటు, ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి, అవుతుంది. కాబట్టి, ఐదవ నెల అయిన మే 28వ తారీఖున “మెనుస్ట్రువల్ హైజీన్ డే” (ఋతుక్రమ పరిశుభ్రతా దినోత్సవం)గా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగానే “ఋతుస్రావానికి అనుకూలమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం” అనే థీమ్ ను ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆడవాళ్ళకు ఏమాత్రం అనుకూలంగా లేని ఈ ప్రపంచాన్ని రుతుస్రావానికి అనుకూలమైన ప్రపంచంగా మార్చడం అంత తేలికకాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. అది సాధ్యం చేసుకునే దిశగా ప్రయాణం చేయడమే పరిష్కారం.
ఋతుస్రావానికి అనుకూలమైన ప్రపంచాన్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలంటే చేయాల్సిన పనులు…
ఋతుస్రావం గురించి మాట్లాడడం. చిన్నపిల్లల దగ్గరి నుండి ముసలివాళ్ళ వరకూ ప్రతి ఒక్కరూ రుతుస్రావం గురించి స్నేహ పూర్వకంగా మాట్లాడుకోగలగాలి. దానివల్ల వచ్చే ఇబ్బందులు, చిరాకులు, ఆరోగ్యకరమైన రుతుస్రావం లక్షణాలు రోజూవారీ సంభాషణల్లో మెదలాలి.
పరిశుభ్రమైన, నాణ్యమైన శానిటరీ ప్రొడక్ట్స్ అందరికీ తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటం. ప్రభుత్వ బడుల్లో పిల్లలకి, వేతన కార్మిక స్త్రీలకు, అసలు బడికి/ పనికి వెళ్లలేని పిల్లలకు, మహిళలకూ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయడం వంటివి చేయాలి.


పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండటం
ఋతుస్రావం అయినపుడు కాదు కదా కనీసం ప్రతిరోజూ మల మూత్ర విసర్జన చేసుకున్నపుడు శుభ్రం చేసుకోవడానికి కూడా మన దేశంతో సహా, చాలా వెనుకబడిన దేశాల్లో నీటి సౌకర్యం లేదు. శుభ్రమైన టాయిలెట్లు, నీళ్లు, సబ్బు, నాప్కిన్లు వేయడానికి చెత్త డబ్బాలు ఉండటం మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఋతుస్రావం ఇబ్బందుల వల్ల స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లలేని ఆడపిల్లలకు సంవత్సరానికి ముప్పై నుండి నలభై రోజుల చొప్పున హాజరు తక్కువైనా పరీక్షలకు అనుమతివ్వాలి. ఉద్యోగినులకు, మహిళా కార్మికులకు నెలకు రెండు మూడు రోజులు వివరణ అక్కర్లేని సెలవు ఇవ్వాలి.
ప్రపంచంలో దాదాపు సగం మంది జనాభాకి వారి జీవితంలో కనీసం 30-35 సంవత్సరాల పాటు నెలసరి వస్తుంది. నెలసరి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిపడ్డా, తర్వాత చాలామంది మహిళలు దానికి అలవాటు పడిపోతారు. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు మాత్రం, మొదటి నాలుగైదు సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడతారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఇంచుమించు 30 కోట్ల మంది మహిళలు నెలసరి ఎదుర్కొంటారు.
టాయిలెట్లు.. సదుపాయాలు..
నాలుగు వందల కోట్ల మంది మహిళల్లో 200 కోట్ల మంది మహిళలకు ప్రతినెలా నెలసరి అవుతూనే ఉంది. మిగిలిన వారు చిన్న పిల్లలు, ముసలివాళ్ళు. ఈ 200 కోట్ల మహిళల్లో నాలుగో వంతు మహిళలకి, అంటే 50 కోట్ల మందికి నెలసరి సమయంలో తమను తాము శుభ్రంగా ఉంచుకోవడానికి సరైన సదుపాయాలు అందుబాటులో లేవు. పేద దేశాల్లో అయితే సగం (50%) మంది మహిళలకు సరైన సదుపాయాలు అందు బాటులో లేవు. భారతదేశంలో కనీసం 25% మంది ఆడపిల్లలు నెలసరి సమయంలో, ఆ మూడు – నాలుగు రోజుల పాటు స్కూళ్ళకి, కాలేజీలకి, పనికి వెళ్లడం లేదు. దీనికి వారు చెప్పిన ముఖ్యకారణం ఏమిటంటే వారి పాఠశాలలో/ విద్యాసంస్థల్లో/ పనిచేసే చోట సరైన టాయిలెట్లు అందుబాటులో లేకపోవడమే.
నెలసరి సమయంలో శుభ్రంగా ఉండాలంటే టాయిలెట్ లో ఏమేమి వస్తువులు ఉండాలి – శుభ్రమైన నీళ్లు, చేతులు, శరీర భాగాలు కడుక్కోవడానికి ఒక సబ్బు ఉండాలి. వారు మళ్లీ మళ్లీ వాడగలిగే గుడ్డలు ఉపయోగిస్తుంటే బట్టలు ఉతికే సబ్బు, ఉతుక్కోవడానికి సరైన స్థలం కల్పించబడాలి. అమ్మాయిలు వాడేసిన శానిటరీనాప్కిన్ వేయడానికి ఒక చెత్తబుట్టను, అవి చుట్టడానికి న్యూస్ పేపర్లు కూడా అందుబాటులో పెట్టాలి. అవి అందుబాటులో లేకపోతే వాటిని టాయిలెట్లలో పడేసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు టాయిలెట్ పైప్ బ్లాక్ అయిపోతుంది. మహిళలు తమ తమ నెలసరి ప్రొడక్ట్స్ లేదా ఉత్పత్తులను, అండర్వేర్ లను బాత్రూంలోనే పెట్టుకునే విధంగా వారికి ఒక కబ్ బోర్డు లేదా ఒక బ్యాగ్ ఏర్పాటు చేయవచ్చు. వారి టాయిలెట్లకి సరైన డోర్లు ఉండాలి.
తలుపు లోపల కచ్చితంగా గొళ్లెం పెట్టుకొనే సదుపాయం ఉండాలి. కిటికీలు ఎవరికీ కనబడనంత ఎత్తులో ఉండాలి. ఇవన్నీ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ ప్రదేశంలోని యాజమాన్యాలు చాలా పటిష్టంగా అమలుచేయాలి. లేదంటే కేవలం ఈ నెలసరి సమయంలో ఇబ్బందుల మూలంగా చాలామంది అమ్మాయిలు స్కూల్లో వెనకబడిపోతుంటారు. మలమూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ యోని చుట్టూ ప్రదేశాన్ని నీళ్లతో కడుక్కోవాలి. యోని దానంతటికి అదే స్రావాలను బయటకి పంపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సబ్బు నీరు యోనిలోకి పంపించడం వంటివి చేయకూడదు.


అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్..
ఒకటి, శానిటరీ ప్యాడ్స్ అందరికీ తెలిసినదే. 1920లో ఒకటవ ప్రపంచం యుద్ధం ముగిశాక అక్కడ యుద్ధంలో గాయపడిన వారికి ఉపయోగించే దూది బ్యాండేజీలని రక్తాన్ని బాగా పీల్చుకుం టాయని నర్సులు గమనించి, వాటిని ప్యాడ్స్ గా వాడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దూదిని లేదా సెల్యులోజ్ వంటి ఇతర పదార్థాలని నెలసరి సమయంలో వాడే ప్యాడ్స్ లాగా తయారుచేసే కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు మనదేశంలో ఏ ప్రాంతంలో ఉన్న గ్రామానికి వెళ్ళినా కూడా వారి దగ్గర ఈ శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే వాటి ధర ఎక్కువని ఇంకా చాలామంది పాత చీరల గుడ్డలను, బట్టలను కత్తిరించి ప్యాడ్ లుగా వాడుకుంటున్నారు. మన దేశంలో అమ్మాయిలు మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు, పెళ్లి అయ్యేంత వరకూ శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడటానికి ఇష్టపడతారు. దీనికి వారి కుటుంబంలో కట్టుబాట్లు అయ్యి ఉండొచ్చు. ఇంకేదైనా వాడాలంటే భయం కూడా కారణం కావచ్చు. చాలామంది తల్లిదండ్రులకు నెలసరి పైన సరైన అవగాహన లేక వారి బిడ్డలకు తప్పుడు అవగాహన ఇస్తారు.
పెరిగిన సాంకేతిక, శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి నెలసరిలో వాడటానికి రకరకాల సదుపాయాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నెలసరికి సంబంధించి శానిటరి నాప్కిన్స్ కాకుండా అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు – టాంపూన్న్లు, మెనుస్ట్రువల్ కప్, మెనుస్ట్రువల్ డిస్క్, పీరియడ్ పాంటీలు, డైపర్లూ, పర్యావరణంలో కలిసిపోయేటటువంటి బయోడెగ్రడబుల్ ప్యాడ్లు, పాత గుడ్డలు, మొదలైనవి.
వీటన్నిటిలో యోని లోపల పెట్టుకొని ఉపయోగించాల్సినవి టాంపూన్లు, మెనుస్ట్రువల్ కప్ లు, మెనుస్ట్రువల్ డిస్క్ లు. టాంపూన్లు పూర్వకాలం నుండే వాడుతున్నారు గానీ వాటికి ఆ పేరు తర్వాతే పెట్టారు. పూర్వం గ్రీకులు ఉన్నిని, దూదిని, ఇంకా ఏదైనా ఒక మెత్తని గుడ్డని చిన్న చెక్కకు చుట్టి యోని లోపల పెట్టుకోవడం వంటివి చేసేవారు. కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ ట్యాంపూన్లను రక్తం లాంటి ద్రవాలను బాగా పీల్చుకునేలాంటి దూదిలాంటి పదార్ధాలతో తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ట్యాంపూన్లపైన అవగాహన కలుగుతుంది. రెండు, మూడు దశాబ్దాల కింద వరకూ కూడా శానిటరీ నాప్కిన్స్ విస్తృతంగా అందుబాటులో ఉండేవి కాదు. అంతకు మునుపు దాదాపు అందరూ పాత, మెత్తటి గుడ్డల్నే నాప్కిన్స్ గా వాడేవారు. ఇప్పటికీ ప్యాడ్స్ ఖరీదు ఎక్కువని కొందరు, పర్యావరణానికి కాస్త మేలు చేద్దామని కొందరూ గుడ్డల్నే వాడుతున్నారు.


శుభ్రపరచుకోవడం ముఖ్యం..
ఈ గుడ్డలతో సమస్య ఏంటంటే వాటిని శుభ్రంగా ఉతికి ఎండలో, వేడి, గాలి తగిలే విధంగా ఆరేయాలి. లేదంటే వాటిని నీళ్ళల్లో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి ఆరేయాలి. ఎప్పుడూ వదులుగా, తేలిగ్గా ఉండే లోదుస్తులు మాత్రమే ధరించాలి. కానీ మన దగ్గర ఉన్న స్టిగ్మా (నెలసరి పట్ల మూఢ నమ్మకాలు, అంటు లేదా అసహ్యం) మూలాన అసలు నెలసరి గుడ్డలను ఎవరికీ కనబడకుండా ఆరేయడము, చీకట్లో ఆరేయడము, గాలి, వెలుతురు తగలని ప్రదేశాల్లో ఆరేయడం వంటివి చేస్తారు. లోదుస్తులు కూడా పూర్తిగా ఆరకుండానే తడిగా ఉన్నపుడు వేసుకోవడం చేస్తుంటారు. పొడిగా ఉంచుకోకపోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
నెలసరి సమయంలో సరైన శుభ్రత లేకపోవడం, వాడిన బట్టలు సరిగా ఉతకకుండా, ఆరేయకుండా వాడటం వల్ల అనేక ఇన్ఫెక్షన్ లకు గురవుతారు.
అపరిశుభ్రతతో ఇన్ఫెక్షన్లు..
గర్భాశయ ముఖద్వారానికి, యోనికి, చర్మానికి ప్రధానంగా బ్యాక్టీరియా, ఫంగస్ వలన ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇన్ఫెక్షన్లు రావడం ఒక సమస్య ఐతే దాని గురించి చర్చించకుండా, ఎవరినీ సంప్రదించకుండా చిట్కా వైద్యం చేసుకోవడం, వైద్యుల దగ్గరకు వెళ్లడానికి సిగ్గుపడటం, సంకోచించడం ఇంకొక సమస్య.


మెనుస్ట్రువల్ కప్స్..
ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులలో పర్యావరణానికి హాని చేయనివి, ఆడవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేవి ఒక్క మెన్స్ట్రువల్ కప్ (మెన్స్ట్రూవల్ డిస్క్) మాత్రమే. ఇవి సిలికాన్ ను (ప్లాస్టిక్ వంటి మెత్తని పదార్థం) ఉపయోగించి తయారుచేస్తారు. ఒక్క కప్పు లేదా డిస్క్ ఐదు నుండి పది సంవత్సరాల వరకూ ఉపయోగించవచ్చు. చేతులు శుభ్రంగా కడుక్కొని, వీటిని ఇంగ్లీషులోని వి లేదా సి (V లేదా C) అక్షరాల ఆకారంలో మడత పెట్టి యోని లోపల పెట్టుకోవలసి ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే, రక్తస్రావం బట్టి 8- 12 గంటల వరకూ అలాగే ఉంచుకోవచ్చు. గర్భాశయం నుండి స్రవించే రక్తమంతా ఈ కప్పులో లేదా డిస్క్ లో చేరుతుంది. ప్రతి పన్నెండు గంటలకి ఒకసారి దానిని బయటకి తీసి నీళ్లు, సబ్బుతో శుభ్రం చేసి, మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. అన్ని వయసుల మహిళలకి రకరకాల సైజుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అప్పుడే రజస్వల అయిన అమ్మాయిలకి ఇవి వాడటానికి మొదట్లో కష్టమవుతుంది. వారికి తమ తమ శరీర భాగాల గురించి మొత్తం అవగాహన వచ్చాకనే ఇవి ఉపయోగించాలి. ఋతుస్రావం అలవాటు అయిన మహిళలకి, పిల్లలు కలిగిన మహిళలకి ఇవి వాడటం చాలా సులభం. నాప్కిన్స్ తో పోలిస్తే వీటి వల్ల ఇన్ఫెక్షన్లు అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇవి వాడటం ఒకసారి అలవాటు అయితే, నెలసరి సమయంలో కూడా మహిళలు అన్ని రకాల వ్యాయామాలు, స్విమ్మింగ్, ఏరోబిక్స్ వంటివి చేసుకోవచ్చు. అయితే నెలసరికి నెలసరికి మధ్యలో కచ్చితంగా దాన్ని వేడి నీళ్లలో కనీసం మూడు నిమిషాలు ఉడకబెట్టాలి. ట్యాంపూన్లు గానీ, కప్పులు లేదా డిస్కూలు వాడేవారు కచ్చితంగా ప్రతి పన్నెండు గంటలకి ఒకసారి తీసి శుభ్రం చేయాలి. లేదంటే చాలా అరుదుగా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
వివక్ష..అపోహలు..
నెలసరిలో ఉన్న మహిళల పట్ల సమాజంలో పరోక్షంగా వివక్ష ఉంటుంది. పోయిన సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో సోనీ అనే 36 ఏళ్ల మహిళ పూజ మొదలు పెట్టే రోజునే నెలసరి వచ్చిందని మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్నారు. తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నెలసరిలో ఉన్న మహిళలు మసీదులోకి వెళ్లడం కూడా నిషిద్ధమే. ప్రత్యక్షంగా నెలసరిలో ఉన్న మహిళల పట్ల వివక్ష చూపకపోయినా, సమాజంలో పేరుకుపోయిన అపోహలు, చిన్నచూపు, పితృస్వామ్య భావజాలం రకరకాల కట్టుబాట్లకి దారితీస్తాయి. దానివల్ల ఎంతోమంది మహిళలు వారి వారి నెలసరి సమయాలను బలవంతంగా హార్మోన్ల ద్వారా మార్చుకోవడం జరుగుతుంది. కొంతమంది మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా, పెళ్లిళ్లకు హాజరవ్వాలన్నా, పరీక్షలు రాయాలన్నా, రకరకాల కారణాల రీత్యా హార్మోను మందులు వేసుకోవడం జరుగుతుంది. అవి తరచూ వాడటం మహిళల ఆరోగ్యానికి, గర్భసంచికి మంచిది కాదు.


అందరూ చర్చించుకోవాలి..
నెలసరి పట్ల అపోహలను గురించి అందరూ చర్చించుకోవాలి. పురుషులకీ ఈ విషయాల పట్ల అవగాహన కలిగిస్తే వారు తమ తమ జీవిత భాగస్వాములకు, పిల్లలకు తగిన ధైర్యం చెప్పే వీలుంటుంది. లేదంటే ఆడవాళ్ళు తమలో తామే కుమిలిపోయి, ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యల వరకూ వెళతారు.
మూఢ విశ్వాసాలు.. వాస్తవాలు..
రుతుస్రావం అయేటప్పుడు పచ్చడి ముట్టుకుంటే బూజు పడుతుంది: ఇది కేవలం అపోహ మాత్రమే. పచ్చడికి బూజు తడి తగిలినపుడు, ఫంగస్ వల్ల పడుతుంది. నెలసరి ఉన్న ఆడవాళ్లు దాన్ని ముట్టుకోవడంవల్ల కాదు.
నెలసరి ఉన్నపుడు ఇంట్లో, ఇంటి బయట అటూ ఇటూ తిరగకూడదు, వ్యాయామం చేయకూడదు: ఆడపిల్లలు నెలసరి సమయంలో స్వేచ్ఛగా అన్ని పనులూ చేసుకోవచ్చు. శరీరం సహకరిస్తే వ్యాయామం కూడా చేసుకోవచ్చు.
పెరుగు, మాంసం, చేపలు తినకూడదు: వీటన్నిటిలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి. అన్నీ తినొచ్చు. వీటితో పాటు ఆకుకూరలు, రంగు రంగుల పండ్లు తింటే శరీరానికి కావాల్సిన ఇనుము అందుతుంది.
ప్రార్థన స్థలాలకు వెళ్ళకూడదు: అది కేవలం మత ఆచారం మాత్రమే. వెళ్ళకూడదు అనే దాని శాస్త్రీయ ఆధారం లేదు.
మెనుస్ట్రువల్ కప్ పెళ్లి కాని మహిళలు వాడకూడదు: మెనుస్ట్రువల్ కప్ లు అన్ని రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అందరూ వాడుకోవచ్చు.
తెల్లపు స్రావం అవ్వడం మంచిది కాదు: నెల మధ్యలో తెలుపు స్రావం అవ్వడం జననాంగాల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. దీని వల్ల దురద వస్తే, లేదంటే వాసన వస్తుంటే మాత్రమే వ్యాధి లక్షణంగా చూడాలి.
నెలసరి మూడురోజులే అవ్వాలి: నెలసరి మూడు నుండి ఏడు రోజుల వరకు అవ్వొచ్చు. క్రమం తప్పకుండా వస్తే అది ఆరోగ్యకరం అని భావించాలి.
నెలసరి నొప్పిని భరించాల్సిందే, వేరే మార్గం లేదు: అవసరం లేదు. నెప్పి రాకుండా, ఎలాంటి దుష్ప్రభావాలు కలగజేయని మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను సంప్రదించి సరైన మందులు వాడుకోవాలి
నెలసరి కడుపు నొప్పికి మందులు వాడితే అలవాటుగా మారుతుంది: నెలసరి నొప్పి తీవ్రంగా ఉన్నపుడు వైద్యులు సూచించే మందులు వేసుకోవాలి. అవి స్ర్తీ జీవితానికి సౌకర్యాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. ఇటువంటి అపోహలు తొలగించుకొని ఋతుస్రావానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.


కర్ణాటక ప్రభుత్వం
ఆ రాష్ట్రంలో సంఘటిత రంగాల్లో శ్రమ చేసే మహిళలకు సంవత్సరానికి పన్నెండు రోజులు వేతనం తో కూడిన సెలవు ప్రకటించింది. ఫ్యాక్టరీలు, తోటలు, బీడీ పనులు, మోటార్ యూనిట్ లలో పనిచేసే 18-52 సంవత్సరాల వయసు ఉన్న మహిళలందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. 1992లో బీహార్ లో మొట్టమొదటి సారిగా నెలకు రెండు రోజుల చొప్పున ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. తర్వాత కేరళ ప్రభుత్వం 2023లో యూనివర్సిటీలోని మహిళా విద్యార్థులకి నెలసరి సెలవు ప్రకటించింది. ఒడిశ్శా ప్రభుత్వం 2024లో ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే మహిళలకు నెలసరి సెలవు ప్రకటించింది. అయితే దీన్ని దేశ వ్యాప్తంగా చట్టం రూపంలోకి తేవడానికి సుప్రీం కోర్టు అభ్యంతరాలు తెలిపింది. ”నెలసరి సెలవు చట్టం తప్పనిసరి చేస్తే, మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గి పోతాయి, ఈ చట్టం తీసుకొస్తే లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొనే కంపెనీలు మహిళల బదులు పురుషులనే ఉద్యోగాలలో నియమించుకోవడానికి ఇష్టపడతారు“ అని సుప్రీం కోర్టు భావించింది. శ్రమ చేసుకునే ఆడవారికి నెలసరి సెలవు విషయంపై విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అప్పుడే యుక్త వయసులోకి అడుగుపెడుతున్న బాలికలకు నెలసరి క్రమం సరిగా రావడానికి, వారు ఆ అసౌకర్యానికి అలవాటు పడటానికి కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 13-18 సంవత్సరాల వయసు ఆడపిల్లలకి నెలకు రెండు మూడు రోజుల చొప్పున, వారి పాఠశాల/కాలేజీ హాజరులో 6-10% వరకు తగ్గినా పరీక్షలకు అనుమతించాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఎదుగుదలకు మేలు చేస్తుంది.








కామెంట్‌లు (0)