test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజీవవైవిధ్యం.. మనిషి అస్తిత్వం!

17 మే, 2026

animals
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 08:00 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం


మన ఇంటి పక్కన, మన ఊరిలో, మన రాష్ట్రంలో చేసే చిన్న చిన్న పనులు కూడా ప్రపంచ జీవవైవిధ్యాన్ని కాపాడగలవు.. అని ఈ సంవత్సరం థీమ్ చెప్తోంది. మనం తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చే గాలి వరకూ ప్రతిదీ ప్రకృతి ప్రసాదించిన వరమే. మే 22 ప్రపంచమంతా ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ జరుపుకుంటోంది. ఈ ఏడాది నినాదం స్థానిక కార్యాచరణతోనే ప్రపంచ మార్పు సాధ్యం. కానీ, ‘అభివృద్ధి అనే పరుగులో మనం ఆ ప్రకృతి మూలాలనే దెబ్బతీస్తున్నామా? మన దేశంలో జీవవైవిధ్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి? 2026 నాటికి మనం సాధించిన విజయాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


జీవవైవిధ్యం అంటే అడవులు, పులులు వగైరాల కంటే చాలా పెద్దది. భూమి మీద ఉన్న అతి చిన్న బ్యాక్టీరియా నుండి అతి పెద్ద నీలి తిమింగలం వరకు, మనం పట్టించుకోని అడవి గడ్డి నుండి మనల్ని పట్టించుకునే ఔషధ మొక్కల వరకు ప్రతిజీవి ఈ ‘బయోడైవర్సిటీ`లో భాగమే.

birds

మనమే సూపర్ పవర్!

జీవవైవిధ్య విషయంలో భారతదేశం ప్రపంచానికి సూపర్ పవర్! ప్రపంచ భూ వైశాల్యంలో కేవలం 2.4% మాత్రమే ఉన్నా, ప్రపంచ జీవవైవిధ్యంలో 7-8% మన దేశంలోనే ఉంది. సుమారు 45,000 మొక్కల జాతులు, 91,000 జంతు జాతులు, వేలాది పక్షులు, చేపలు, కీటకాలు... ఇది మన సంపద, మన గర్వం.

మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ ఘాట్లు, ఇండో-బర్మా ప్రాంతం, సుందాలాండ్ వంటి నాలుగు ప్రధాన బయోడైవర్సిటీ హాట్‌ ‌స్పాట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రపంచంలో ఎక్కడా లేని ఎండమిక్ స్పీసీస్ (స్థానిక జాతులు) ఉన్నాయి.

మన దేశపు వేదాలు, ఆయుర్వేదం, సంస్కృతి ప్రకృతిని దైవంగా భావించాయి. పువ్వులు, జంతువులు, నదులు, చెట్లు అన్నీ పూజనీయాలు.

పువ్వులను, జంతువులను పూజించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వాటిని కాపాడుకోవడమే. కానీ వాతావరణ మార్పు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, ఆక్రమణలు వంటి సవాళ్లు ఈ సంపదను తగ్గిస్తున్నాయి. జీవవైవిధ్యం లేకుండా ఆర్థికవ్యవస్థ కూడా నిలబడదు.

కనిపించని వెన్నెముక..

ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కనిపించని వెన్నెముక జీవవైవిధ్యం. అడవులు, నదులు, సముద్రాలు, పక్షులు, పురుగులు, సూక్ష్మజీవులు.. ఇవన్నీ కలిసి భూమిపై జీవచక్రాన్ని నడిపిస్తాయి. ఈ జీవచక్రం బలంగా ఉన్నప్పుడే వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, పర్యాటకం, మత్స్యరంగం వంటి ఆర్థిక రంగాలు సజావుగా పనిచేస్తాయి. అంటే జీవవైవిధ్యం అనేది కేవలం ప్రకృతి అందం కాదు.. అది దేశ ఆర్థిక భద్రతకు మూలాధారం.


పంటల వెనుక కనిపించని కార్మికులు


మనకు మార్కెట్లో కనిపించేది బియ్యం, పండ్లు, కూరగాయలు మాత్రమే. కానీ వాటి వెనుక లక్షలాది చిన్నజీవుల పాత్ర ఉంటుంది. తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులు వంటి పరాగసంపర్క జీవులు లేకపోతే అనేక పంటలు పండవు. నేలలో ఉండే సూక్ష్మజీవులు భూమిని సారవంతం చేస్తాయి. వర్షాలను సమతుల్యం చేసేది అడవులే. అంటే ఒక చిన్న జీవజాతి తగ్గినా ఆ ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడుతుంది. వ్యవసాయం బలహీనపడితే రైతు ఆదాయం తగ్గుతుంది. ఆ తర్వాత ఆహార ధరలు పెరుగుతాయి. చివరకు మొత్తం ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుంది.

అడవులను చాలామంది కేవలం చెట్ల సమూహంగా చూస్తారు. కానీ నిజానికి అవి కోట్ల రూపాయల విలువైన సహజ సంపద నిల్వలు. ఒక అడవి నాశనం అయితే అక్కడి జీవవైవిధ్యం మాత్రమే కాదు, ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థ కూడా బలహీనపడుతుంది. వరదలు, కరువులు, భూకంపనలు పెరిగితే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే జీవవైవిధ్య నష్టం చివరికి ఆర్థిక నష్టంగానే మారుతుంది.

సముద్రాల్లోని చేపలు, పగడపు దిబ్బలు, తాబేళ్లు, సూక్ష్మజీవులు .. ఇవన్నీ సముద్ర జీవవ్యవస్థలో భాగాలు. ఈ జీవవైవిధ్యం సమతుల్యం కోల్పోతే చేపల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మత్స్యకారుల జీవనం ప్రమాదంలో పడుతుంది. ఆహార భద్రత దెబ్బతింటుంది.. సముద్ర ఆర్థికవ్యవస్థ బలహీనపడుతుంది. ప్రస్తుతం సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అధిక మత్స్య వేట వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది.

అనేక ఔషధాలు అడవుల్లోని మొక్కలు, సూక్ష్మజీవుల నుంచే తయారయ్యాయి. ఇంకా వేలాది జీవజాతులపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. ఒక అరుదైన మొక్క లేదా సూక్ష్మజీవి అంతరించిపోతే, భవిష్యత్తులో ప్రాణాలను కాపాడే మందును మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే జీవవైవిధ్యాన్ని కాపాడటం అంటే వైద్యరంగ భవిష్యత్తును కాపాడటమే. ఇప్పటివరకు అభివృద్ధి పేరుతో ప్రకృతిని దెబ్బతీశాం. కానీ జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు.


జీవవైవిధ్యం బలంగా ఉంటేనే..

ఆహార భద్రత ఉంటుంది.

నీటి వనరులు నిలబడతాయి.

ఆరోగ్య వ్యవస్థ బలపడుతుంది

గ్రామీణ జీవనోపాధులు కొనసాగుతాయి.

వాతావరణ సమతుల్యం ఉంటుంది.

అందుకే జీవవైవిధ్య సంరక్షణ అనేది పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అది ఆర్థిక, సామాజిక, మానవ భవిష్యత్తుకు సంబంధించిన అంశం.

​జంతువుల రిపోర్టులు మారాయి!

గడిచిన కొన్నేళ్లుగా భారత్ చేపట్టిన సంరక్షణ చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం మన ‘వైల్డ్ లైఫ్’ రిపోర్ట్ కార్డ్ ఇలా ఉంది:


గర్జించిన పులులు


ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా తగ్గుతుంటే, భారత్ మాత్రం వాటి సంఖ్యను పెంచి ప్రపంచానికి మన సత్తా చూపించింది. 1973 లో మొదలైన ప్రాజెక్ట్ టైగర్ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం. ఒక్కప్పుడు 1,800 కంటే తక్కువ ఉన్న బెంగాల్ టైగర్లు ఇప్పుడు 3,682కి పెరిగాయి. టైగర్ రిజర్వుల సంఖ్య 58కి పెరగడమే కాకుండా, గ్రామస్తులను ఈ సంరక్షణలో భాగస్వాములను చేయడం వల్ల వేట గణనీయంగా తగ్గింది.


ఫలించిన ప్రాజెక్ట్ చీతా ప్రయోగం


దశాబ్దాల క్రితం అంతరించిపోయిన చీతాలను 2022లో నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టడం మనదేశం చేసిన అతిపెద్ద ప్రయోగం. 2026 నాటికి భారత్ లో మొత్తం 57 చీతాలు ఉన్నాయి. వీటిలో 37 భారత్‌ ‌లోనే పుట్టినవి! ఇటీవల కునోలో భారతీయ చీతా సహజంగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది ప్రపంచ స్థాయి విజయం. గాంధీ సాగర్ వైల్డ్‌ లైఫ్ సాంక్చురీకి కూడా చీతాలను తరలించారు. 2032 నాటికి 60-70 చీతాల స్వయం సమృద్ధి జనాభాను సాధించాలన్నది లక్ష్యం.


లెక్క తేలిన మంచు చిరుతలు


హిమాలయాల్లోని గడ్డకట్టే చలిలో జీవిస్తూ, అంత సులభంగా ఎవరికీ కనిపించని ‘హిమాలయాల దెయ్యాలు’ అని పిలువబడే మంచు చిరుతల జనాభాను తొలిసారిగా శాస్త్రీయంగా లెక్కించారు. మన దగ్గర దాదాపు 718 మంచు చిరుతలు ఉన్నాయని తేలింది.


రక్షణ పొందిన చిత్తడి నేలలు


నీటి వనరులు బాగుంటేనే పక్షులు, చేపలు బతుకుతాయి. భారత్ ఇప్పుడు 98 రామ్సర్ సైట్లను కలిగి ఉంది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. చెరువులు, కుంటలను కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా వేల సంఖ్యలో వలస పక్షులకు ఆశ్రయం లభిస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో మెరుగవుతున్న వైవిధ్యం


తెలంగాణలో హరిత హారం ద్వారా కోట్లాది మొక్కలు నాటడం వలన గ్రీన్ కవర్ పెరిగి, గాలి శుభ్రపడుతోంది. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు, కుంటలు పునరుద్ధరించబడ్డాయి. కాళేశ్వరం, అమరావతి, పక్కల్ లేక్, నల్లమల అడవులు అసంఖ్యాక పక్షులు, జంతువులకు ఆశ్రయం ఇస్తున్నాయి. హైదరాబాద్ సిటీ నేచర్ చాలెంజ్‌లో టాప్‌‌లో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ లో నల్లమల, శ్రీవెంకటేశ్వర అభయారణ్యాలు, గోదావరి-కృష్ణా డెల్టా మాంగ్రోవ్ అడవులు ఎంతో వైవిధ్యాన్ని సమర్థవంతంగా కాపాడుతున్నాయి. స్థానికులు, ఎన్జీఓలు, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్‌ కలిసి పనిచేస్తున్నారు.


ఆకాశమంత సవాళ్లు.. అయినా చిగురంత ఆశ..


భారత్ జీవవైవిధ్య పరిరక్షణలో కొన్ని గొప్ప విజయాలు సాధించినప్పటికీ, ముందున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసే మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అడవులు తగ్గడం, కాలుష్యం పెరగడం, వాతావరణ మార్పులు, పట్టణాల విస్తరణ.. ఇవన్నీ జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో దాదాపు 30 శాతం భూభాగం ‘‘ల్యాండ్ డీగ్రేడేషన్” సమస్యను ఎదుర్కొంటోంది. అంటే భూమి తన సహజ సారాన్ని, జీవశక్తిని కోల్పోతోంది. అధిక రసాయన వినియోగం, అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, నీటి దుర్వినియోగం వల్ల నేల బలహీనపడుతోంది. దీని ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాదు.. ఆ నేలలో జీవించే సూక్ష్మజీవుల నుంచి అడవి జీవుల వరకు అందరిపైనా పడుతోంది.

ఇంకో పెద్ద ప్రమాదం ‘‘ఇన్వేసివ్ స్పీసీస్” లేదా పరకాయ జీవజాతులు. ఇవి స్థానిక జీవవ్యవస్థలోకి ప్రవేశించి, అక్కడి సహజ జీవజాతులను బలహీనపరుస్తాయి. కొన్ని విదేశీ మొక్కలు, చేపలు, పురుగులు ఇప్పుడు భారతీయ జీవవైవిధ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి స్థానిక మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులపైనా ప్రభావం చూపుతున్నాయి. శాస్త్రవేత్తలు దీన్ని ‘‘నిశ్శబ్ద జీవవైవిధ్య సంక్షోభం”గా అభివర్ణిస్తున్నారు.

తీరప్రాంతాల్లో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. తుపాన్లు, సముద్ర అలల నుంచి సహజ రక్షణగా పనిచేసే మాంగ్రోవ్ అడవులు కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి. పోర్టులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాల వల్ల ఈ జీవవ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్నాయి. మాంగ్రోవ్స్ తగ్గితే కేవలం సముద్ర జీవజాతులే కాదు, తీరప్రాంత గ్రామాల భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది.

వాతావరణ మార్పు మరో పెద్ద సవాల్. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తీరు మారిపోవడం వల్ల పక్షుల వలస మార్గాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రతి ఏడాదీ వచ్చే కొన్ని వలసపక్షులు ఇప్పుడు ఆలస్యంగా వస్తున్నాయి. కొన్ని జాతులు తమ పాత ప్రాంతాలకు రావడం కూడా తగ్గిస్తున్నాయి. ఇది ప్రకృతి సమతుల్యంలో మార్పుకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.

పట్టణాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. వేగంగా పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాల మధ్య పచ్చని ప్రదేశాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. సరస్సులు చిన్నవవుతున్నాయి. చెట్లు తగ్గుతున్నాయి. ఫలితంగా పక్షులు, సీతాకోకచిలుకలు, చిన్న జీవజాతులు నగరాల నుంచి మాయమవుతున్నాయి. నగర ఉష్ణోగ్రతలు పెరగడం, గాలి నాణ్యత తగ్గడం కూడా ఇదే సమస్యతో ముడిపడి ఉన్నాయి.

అయితే ఈ సవాళ్ల మధ్య ఆశాజనకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ప్రకృతిని కాపాడాలనే అవగాహన కూడా పెరుగుతోంది. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, గ్రామీణ సమాజాలు, యువత కలిసి పనిచేస్తే జీవవైవిధ్యాన్ని రక్షించడం అసాధ్యం కాదు.

ఎక్ పేడ్ మా కే నామ్ క్యాంపెయిన్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి). ఈ క్యాంపెయిన్ ద్వారా 2024 సెప్టెంబర్ నాటికే 80 కోట్లకి పైగా మొక్కలు నాటడం జరిగింది. ఒక్క గంటలోనే ఐదు లక్షల మొక్కలు నాటిన ప్రపంచ రికార్డు (టెరిటోరియల్ ఆర్మీ ఎకాలజికల్ టాస్క్ ఫోర్స్) ఉంది.

ఇప్పుడు ఎక్ పేడ్ మా కే నామ్ 2.0 కూడా మొదలైంది. పాఠశాలల్లో ఈకో క్లబ్స్ ద్వారా విద్యార్థులు 5.5 కోట్లకి పైగా మొక్కలు నాటారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఒక్క రోజులోనే 35-37 కోట్ల మొక్కలు నాటి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్యాంపెయిన్ భారత్ నుంచి కొలంబియా వరకు అంతర్జాతీయంగా వ్యాపించింది.

అలాగే భారత్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వన్యప్రాణి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది. 2026 జూన్లో ఢిల్లీలో జరగనున్న ‘‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ సమ్మిట్” దీనికి నిదర్శనం. ప్రపంచంలోని దాదాపు 95 దేశాల నాయకులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. టైగర్, లయన్, స్నో లెపర్డ్, చీతా వంటి పెద్ద అడవి పిల్లుల సంరక్షణపై చర్చలు జరగనున్నాయి.

ఇది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు. జీవవైవిధ్య పరిరక్షణలో భారత్ కు పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యానికి గుర్తు. పులుల సంఖ్య పెంపులో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తోంది.


ప్రకృతి సేవలో చట్టాలు & టెక్నాలజీ

జీవవైవిధ్యాన్ని కాపాడడం కేవలం మొక్కలు నాటడం లేదా పులులను రక్షించడం మాత్రమే కాదు. దానికి బలమైన చట్టాలు, ఆధునిక టెక్నాలజీలతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఇక్కడే భారత ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పులు తెచ్చింది.


ప్రకృతి రక్షణలో హై-టెక్ యాత్ర

చట్టాలతో పాటు టెక్నాలజీ కూడా ప్రకృతిని కాపాడడంలో బలమైన ఆయుధంగా మారింది.

ఎఐ, డ్రోన్లు మరియు సాటిలైట్ సర్వైలెన్స్ అడవుల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కడ మొదలయ్యాయో నిమిషాల్లో గుర్తించడానికి AI-ఆధారిత కెమెరాలు, సాటిలైట్ ఇమేజెస్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఎఐ ఆధారిత సిస్టమ్స్ పనిచేస్తున్నాయి.

డ్రోన్లు అక్రమ వేటగాళ్లను, మరగు మాఫియాను, అక్రమ కట్టడాలను పట్టుకోవడంలో సూపర్ హీరోలుగా మారాయి. థర్మల్ డ్రోన్లు రాత్రి సమయంలో కూడా జంతువులను ట్రాక్ చేస్తాయి. భితార్కానిక, కునో వన్యప్రాణి అభయారణ్యాల్లో ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే విజయవంతంగా ఉపయోగపడుతున్నాయి.

బార్ కోడింగ్ ఒక అద్భుతమైన టెక్నాలజీ. వన్యప్రాణుల మాంసం, ఎముకలు, చర్మం, రక్తం వంటి అవశేషాలు దొరికితే, బార్ కోడింగ్ ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే ఆ జంతువు ఏ జాతికి చెందినదో, ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తేల్చేస్తారు. ఇది అక్రమ వేట, వైల్డ్ లైఫ్ ట్రేడ్ ను అరికట్టడంలో చాలా ప్రభావవంతంగా ఉపయోగపడుతోంది.

కెమెరా ట్రాప్స్ తో ఎఐ ద్వారా జంతువులను గుర్తించడం, GIS మ్యాపింగ్ ద్వారా నివాసాలు మ్యాప్ చేయడం, రియల్-టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి ఇతర ఆధునిక సాంకేతికతలు జీవవైవిధ్య పరిరక్షణలో చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.


స్థానికమే పరిష్కారం

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం కేవలం సదస్సులు, సెమినార్ల కోసం కాదు. ‘గ్లోబల్‌గా ఆలోచిస్తూ ‘లోకల్‌గా పని చేయవలసిన సమయం.

మనం చేయగలిగే చిన్న చిన్న పనులు:

1. దేశీ మొక్కలే ముద్దు: మన వాతావరణానికి అలవాటుపడని విదేశీ మొక్కల కంటే, వేప, రావి, చింత వంటి మన దేశీ మొక్కలు నాటాలి. అవి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా పక్షులకు మంచి ఆశ్రయం ఇస్తాయి.

2. విత్తన భాండాగారాలు: గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న దేశీ విత్తనాలను సేకరించి దాచుకోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రీయ పద్ధతులు పాటించాలి.

3. నీటి సంరక్షణ: వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న జీవరాశుల దాహాన్ని తీర్చవచ్చు.

4. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమేద్దాం: సముద్రాల్లో, అడవుల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల ఏటా లక్షలాది జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా దూరం పెట్టడం ముఖ్యం.

ఈ ప్రకృతి మనకు పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అనడం కంటే మనం మన పిల్లల దగ్గర తీసుకున్న ‘అప్పు అనడం మెరుగు. ఆ అప్పును మనం తీర్చాలంటే జీవవైవిధ్యాన్ని గౌరవించాలి. ఒక్క జీవి అంతరించిపోయినా ఆ ప్రభావం గొలుసుకట్టులా మన మీద పడుతుంది. ​


బయలాజికల్ డైవర్సిటీ (సవరణ) చట్టం, 2023

2002లో వచ్చిన బయోడైవర్సిటీ చట్టాన్ని 2023లో సవరించి, 2024 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు.

ప్రధాన మార్పులు: ఆయుష్ రంగానికి పెద్ద బూస్ట్: నమోదైన ఆయుష్ (ఆయుర్వేద, యోగ, యూనానీ, సిద్ధ, హోమియోపతి) వైద్యులు, హకీములు, స్థానిక వైద్య నిపుణులు వీరందరూ ముందస్తు వివరణ ఇవ్వకుండానే స్థానిక ఔషధ మొక్కలను ఉపయోగించుకోవచ్చు. కలివిక్త సాంప్రదాయ జ్ఞానం, సాగు చేసిన ఔషధ మొక్కలు కూడా ఈ చట్టం నుంచి మినహాయింపు పొందాయి. దీంతో మన సాంప్రదాయ వైద్యం మరింత బలపడుతుంది.

_ బెనిఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా): ఏదైనా కంపెనీ (ముఖ్యంగా విదేశీ కంపెనీలు) మన దేశంలోని జీవవైవిధ్య వనరులను లేదా స్థానిక గిరిజనుల సాంప్రదాయ జ్ఞానాన్ని వాడుకుని వ్యాపారం చేస్తే, వచ్చిన లాభాల్లో న్యాయమైన వాటా స్థానిక సమాజాలకు, గిరిజన తెగలకు, ఆ ప్రాంత అభివృద్ధికి ఇవ్వాలి. ఇది ఆర్థికంగా కాకుండా, నాన్-ఫైనాన్షియల్ బెనిఫిట్స్ (శిక్షణ, టెక్నాలజీ బదలాయింపు, సామగ్రి) కూడా ఉంటాయి.

ఈ సవరణలు విదేశీ కంపెనీలు మన జీవవైవిధ్యాన్ని ‘‘బయో-పైరసీ” (దోపిడీ) చేయకుండా అడ్డుకట్ట వేస్తూనే, మన దేశీయ కంపెనీలు, పరిశోధకులు, ఆయుష్ డాక్టర్లు సులభంగా పని చేసుకోవడానికి దారి చూపుతాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్