పర్వతాల మడతల్లో, ఆకాశాన్ని తాకే చెట్లతో చుట్టూ జలపాతాల నడుమ ఉన్న అడవి ప్రాంతంలో మొండాపూర్ అనే గ్రామం ఉంది. అందులో సుమారు రెండు వందల మంది తండా జాతి ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా ప్రకృతితో మమేకమైపోయారు. అందులో ఏడేళ్ల చిన్నారి చామంతి కుటుంబం కూడా ఉంది. ఆమె తండ్రి సింఘా అడవిలో కొద్దిపాటి పంటలు పండిస్తాడు. తల్లి సీమ భర్తకు పనుల్లో సాయం చేస్తూ గుమ్మడి పూవులతో గొడుగులు అల్లుతుంది. చామంతి గుబురైన వెంట్రుకలతో, మెరిసే కళ్ళతో, ఎప్పుడూ నవ్వుతూ ఆ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. చామంతి ప్రతి ఉదయం, పక్షుల కిలకిలరావాలతో మేల్కొంటుంది. అమ్మ చేసిన జొన్నరొట్టె, ఉల్లిపాయ ముక్కతో అల్పాహారం చేసి, తన చిన్న బుట్టను చంకన పెట్టుకుని అడవికి వెళ్తుంది. అక్కడ ఊడలమర్రి చెట్టుకింద కోటయ్య తాత జానపద కథలు, పక్షులను గుర్తించే విధానం, ఔషధ మొక్కల రహస్యాలు, ప్రకృతిని గౌరవించేతత్వం పిల్లలందరికీ నేర్పిస్తుంటాడు. ఒకరోజు తాత చెప్తున్న కథలు వింటున్న చామంతికి దూరంగా గంటలు మ్రోగిన ధ్వని వినిపించింది.
‘తాతా! ఆ గంటల సవ్వడి ఎక్కడ నుండి వస్తోంది?’ అడిగింది చామంతి._
‘ఈ అడవిని ఆనుకున్న ఊరిలో పాఠశాల ఉంది. అక్కడ గంటల_ సవ్వడి వస్తోంది. అక్కడ నగరం నుండి వచ్చిన మేష్టారు పిల్లలకు ఆధునికమైన టెక్నాలజీతో చదువు నేర్పిస్తారు’ అన్నాడు కోటయ్య. చామంతి ఆశ్చర్యపోయింది... ఆమెకు తాత నేర్పిన పాటలు, కథలు, అడవి భాషే తెలుసు. ఆ పాఠశాల చదువు అంటే ఏమిటో తెలుసుకోవాలనిపించింది. ఒక రోజు ధైర్యం చేసి, ఆ గంట ధ్వని వస్తున్న దిశగా అడుగులు వేసింది. అలా గ్రామం అంచులో ఉన్న ఒక చిన్న కట్టడాన్ని చేరుకుంది. దానికి ఉన్న కిటికీ ద్వారా లోపలకు చూసింది. చక్రీయంగా కూర్చున్న పిల్లలు వారి ముందున్న నల్లబల్ల మీద రాస్తున్న ఒక యువతిని చూసింది. ఆవిడ రాస్తున్నదేమిటో చామంతికి అర్థం కావడం లేదు. ఆ అక్షరాలను ఒక కర్రతో చూపిస్తూ పిల్లలతో వల్లె వేయిస్తుంది. చామంతి తనకు తెలియకుండానే తను కూడా పిల్లలతో పాటు ఏ బి సి డి అని పైకి అనేసింది. టీచర్ దృష్టి అటువైపు పడింది._
‘పాపా! ఇలా లోపలికి రా’ అని పిలిచింది టీచర్._చామంతి లోపలికి వెళ్లింది. అక్కడ నలుపు బల్ల మీద తెల్లటి చాక్ పీస్ తో రాసిన అక్షరాలు, గోడ మీద ఉన్న వివిధ రంగుల పళ్ళు, కూరగాయలు, జంతువుల బొమ్మల చిత్రాలు అంతా వింతగా కనిపిస్తున్నాయి.
‘నీ పేరేమిటి?’ టీచర్ ప్రశ్నించింది.
‘చామంతి’ అంటూ మెల్లగా జవాబిచ్చింది.
‘నువ్వు కూడా ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నావా?’
‘ఎలా చదువుకోవాలి?’ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది చామంతి.
‘వీళ్లందరూ చదువుకున్నట్లే నువ్వు కూడా చదువుకోవచ్చు. రేపు మీ అమ్మానాన్నలను తీసుకుని రా!’ అంది టీచర్. చామంతి అలాగేనన్నట్లు తలూపి అక్కడ నుండి తిరిగి ఇంటికి బయలుదేరింది. ఆమెకు తాత నేర్పిన జ్ఞానం, అడవి పాటలు ఇష్టమే కానీ ఆ కొత్త పాఠశాలలోని రంగులు, పుస్తకాలు, కొత్త భాష కూడా ఆకర్షించాయి. తను చూసిందంతా తన తల్లిదండ్రులతో, తాతతో చెప్పింది._
‘మనకు అడవి మొదటి గురువు. మన సంస్కృతిని, మన మూలాలను మర్చిపోకుండా కొత్త జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటే మంచిదే! నీకు ఇష్టమైతే నేర్చుకో’ ఆమె భుజం మీద చేయి వేస్తూ అన్నాడు సింఘా.
‘రోజూ అడవిగుండా ఒక్కదానివే నడచి వెళ్ళడం మంచిదికాదు. ఆ చదువు మనకు కూడు పెడుతుందా? గుడ్డ పెడుతుందా? వద్దు’ అంది సీమ.
‘మన తరానికి ఎలాగూ చదువు లేదు.. ఇప్పటి పిల్లలకు చదువు అవసరం ఉంది వద్దనకు సీమా!’ అని వారించాడు కోటయ్య తాత.బసీమ అయిష్టంగానే ఒప్పుకుంది. మరుసటి రోజు నుండి, చామంతి జీవితం మారింది. ఉదయం తాతతో అడవి బాష నేర్చుకోవడం, ఆ తర్వాత కొండ పక్కనే ఉన్న పాఠశాలకు వెళ్లి, ఏ బి సి డి లు నేర్చుకోవడం చేసింది. కొత్త పాటలు, కొత్త ఆటలు ఆడటంతో ఆమెకు సమయం తెలియడం లేదు. ఆమె తన తాత నేర్పిన జానపద కథలను తరగతి గదిలోని పిల్లలతో పంచుకోవడం ప్రారంభించింది. ఆ పిల్లలు కూడా ఆసక్తిగా వింటున్నారు. అలాగే వారి నుండి నగరం గురించి, రైళ్లు, విమానాల గురించి, వారి జీవనవిధానం గురించి తెలుసుకుని గూడెం వాళ్లకు చెప్తోంది. టీచర్ దగ్గర తను నేర్చుకున్న విద్య కూడా తోటి పిల్లలకు నేర్పుతూ చదువు పట్ల ఆసక్తి పెంచుతోంది.
ఒక రోజు పాఠశాలలో టీచర్ పిల్లలకు వారికి వచ్చిన_ చిత్రం వేయమని చెప్పారు. చామంతి ఒక చిత్రం గీసింది. ఆ చిత్రంలో, ఒక వైపు పర్వతాలు, చెట్లు, నది ఉన్నాయి. మరొక వైపు, పుస్తకాలు, పెన్సిల్స్, గ్లోబ్ ఉన్నాయి. మధ్యలో ఒక అమ్మాయి నిలబడి, ఇరువైపులా రెండు చేతులు చాచి రెండు ప్రపంచాలను కలుపుతూ నవ్వుతూ నిలబడింది.
‘చామంతీ, ఇది చాలా అందమైన చిత్రం. ఇది నీ కథ మాత్రమే కాదు నీ భవిష్యత్తు కూడా’ అంటూ ఆ చిత్రాన్ని చూసి గర్వపడింది టీచర్._సాయంత్రం, సూర్యుడు పర్వతాల వెనక్కి వెళ్తుండగా, చామంతి తన గ్రామం వైపు నడుస్తూ ‘గూడెంలో అక్షర దీపాలను వెలిగించాలి’ అని కలలు కంటోంది._
కె.వి. సుమలత
9492656255








కామెంట్‌లు (0)