పుట్టిన ప్రతి బిడ్డా వసపోసినట్టు మాట్లాడుతుంది. సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది. బడిలో చేరేప్పటికే కనీసం మూడు వేల పదాలు ఆమెకు వచ్చు. చుట్టూ ఉన్న ఎవరితోనైనా ఆమె సమర్థవంతంగా సంవాదం చేయగలదు. తన అవసరాలన్నీ సొంత భాషా సామర్థ్యంతో తీర్చుకోగలదు. ఆ మాత్రం నేర్చుకోని బిడ్డ భూప్రపంచంలో వుండనే వుండదు. మరి బడికి వచ్చేప్పటికి అదే భాషను చదవడానికి రాయడానికీ, కొత్త భాషను వినడానికి మాట్లాడడానికీ ఏళ్ళు పూళ్ళు అదే బిడ్డ ఎందుకింత ఆపసోపాలు పడుతోంది. అయిదో తరగతి బిడ్డకు మూడో తరగతి వాచకం చదవడం ఎందుకు రాదు? ఏడో తరగతి పిల్లాడు ఐదో తరగతి వాచకం ఎందుకు చదవలేడు? అసలు ఇంటిలో వినడం మాట్లాడడం నేర్చుకున్నట్టే బిడ్డ బడిలో చదవడం, రాయడం కూడా నేర్చుకోగలదా? అలా నేర్చుకోకుండా ఏది అడ్డుపడుతున్నట్టు?
పసిబిడ్డ ప్రతి చర్యా నేర్చుకోవడమే!
పై ప్రశ్నలు మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుల్ని, విద్యారంగ తాత్వికుల్ని, బోధనాశాస్త్ర పరిశోధకుల్ని చాలాకాలం వెంటాడాయి. దీనిపై కావలసినన్ని ప్రయోగాలు జరిగాయి. నిర్ధారణలు వచ్చాయి. వైగోట్స్కీ మాటల్లో చెప్పాలంటే “బిడ్డ ప్రతిచర్యకు ఎంతో అర్థం ఉంటుంది. వారి ప్రతిచర్యా నేర్చుకోడమే! వారి స్వగతాలు మనకు అర్థం లేనివనిపించవచ్చు. కానీ అవి వారికెంతో విలువైనవి. తాము చేస్తున్న ప్రతి పనినీ ఈ స్వగతాలే క్రమబద్ధీకరిస్తాయి. ఆర్గనైజ్ చేస్తాయి. మానవ అభ్యసనలో ఎదుగుదలలో ఈ “మాటలే” ప్రధాన ఘట్టం. వీటినించే వాళ్ళ ఆలోచనలు వికసిస్తాయి. మనం ఇప్పటిదాకా ఆలోచనల్ని మాటల్లో వ్యక్తీకరిస్తాము అనుకుంటున్నాం. కానీ వైగోట్స్కీ ప్రకారం ఈ మాటలే ఆలోచనలకు ప్రాతిపదికలు. వానరుడు నరుడిగా పరిణామం చెందే క్రమంలో మానవుడి సామాజిక పరిణామాల్లోనే గాదు శారీరక పరిణామాల్లో కూడా భాష ఎంతో కీలకపాత్ర పోషించింది.
మరి బడిలో జరుగుతున్నదేమిటి? బళ్ళోనూ మొదట పిల్లలు నేర్చుకునేది భాషే. బయటి ప్రపంచంతో బిడ్డ సమర్థవంతంగా సంధానం కాగలగడమే. ఇంటి నుంచి బడికి మారగానే మరి ఉన్నట్టుండి సినిమా రీలు మారినట్టు, సరిహద్దు దాటినట్టు వ్యవహారమంతా ఎందుకు తల్లకిందులవుతోంది?

పండితురాలు అమ్మ
బిడ్డకు ఆకలవుతుంది. ఆకలి అంటే ఏదో తనకు తెలీదు. కానీ శరీరంలో ఏదో అసౌకర్యం ఏర్పడింది. బిడ్డ ఏడుస్తుంది. అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది. పాలిస్తుంది. పాలిస్తూ పాలిస్తూ బిడ్డని ఆప్యాయంగా స్పృశిస్తుంది.. ముద్దాడుతుంది. “ఆకలి అయిందా అమ్మా! నా బుజ్జి కదే! అంటూ ఏవేవో మురిపాలు కురిపిస్తుంది. మరి ఆ తల్లి మాటలకి ఏమర్థం వుంది? అవి బిడ్డకి అర్థమయ్యేనా? ఇవన్నీ స్వగతాలే కదా! ఆ స్వగతమే బిడ్డ విన్న మొదటి మాట కావచ్చు. ఆ స్పర్శే, ఆ పాటే, ఆ మాటలే బిడ్డను స్వీయ ప్రపంచం నుంచి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టించేవి. అనుసంధానం చేసి పెట్టేవి. తల్లి తర్వాత ఇంటిల్లపాది చేసే ఈ ముచ్చట్లే ఆమెని ఊహకందనంత వేగంగా వికసింపజేసేవి. నాలుగేళ్ల బిడ్డలో ఇతర అభివృద్ధి, భాషా సామర్థ్యాభివృద్ధి కూడా ఒకే వేగంతో సాగుతాయి. అంతకంటే విచిత్రం ఈ అభివృద్ధి పిల్లలందరిలోనూ దాదాపు సమానంగా ఉంటుంది. మాటకున్న విలువ అంత మహత్తరమైందన్న మాట !

ఇలా పసిబిడ్డలతో చేసే సంభాషణలో మనం అర్థాలు వెతకం.. తప్పుల్ని పట్టం. పిల్లలు చెప్పిందే చెబుతున్నా వింటాం. అన్నిటికంటే మించి ప్రతి మాటను ముత్యంగా లెక్కించి సంబరపడుతాం.. ప్రోత్సహిస్తాం. బిడ్డతో మాట్లాడేప్పుడు ఆ బిడ్డల్లా మారిపోతాం. వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. అస్సలు ఎప్పుడూ వాళ్ళ భాషను సంస్కరించాలనీ, క్రమబద్ధీకరించాలని కోరుకోం. గుర్రాన్ని “గుల్లం” అంటే విరగబడినవ్వుతాం. మళ్ళీ మళ్ళీ అనమని ఒక్కోసారి ఒక్కో ముద్దు ఇస్తాం. ఎంత అద్భుతం! ఈ ప్రక్రియలో మనం పిల్లలకి భాష నేర్పుతున్నామన్న ఆలోచనే మనకు లేదు. నేర్చుకొంటున్నామన్న స్పృహ పిల్లలకూ లేదు. కోటానుకోట్ల తల్లిదండ్రులు సహస్రబ్దాల నుంచి తమ పిల్లల్ని ఇలాగే పెంచుతున్నారు. వారికి ఇలానే నేర్పుతున్నారు. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. ఒక “డ్రాపౌట్” లేదు. ఒకరు వెనకబడ్డవారు లేరు. ఒక సిలబస్ లేదు. పాఠ్యప్రణాళిక లేదు. కనీస అభ్యసన ప్రమాణాల ఊసు లేదు. పరీక్షలు అసలే లేవు. ఉన్నదల్లా ఒక్కటే “ఒకానొక పద్ధతి”. ఆ పద్ధతిలో అందరికంటే పండితురాలు అమ్మ!
ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?
పిల్లలతో మనమైనా, మనతో పిల్లలైనా, పిల్లల్లో పిల్లలైనా ఏం మాట్లాడుకోవాలి ? ఎలా మాట్లాడుకోవాలి? అనే యక్షప్రశ్నలు మనకు ఎదురవుతుంటాయి. వీటికి ఒకటే సమాధానం. ఏమైనా మాట్లాడొచ్చు. ఎలా అయినా మాట్లాడొచ్చు అని. కావలసింది మాట్లాడ్డం అంతే! ఇలా అంటే (చలం గారి మాటల్లో చెప్పాలంటే) మన గుండెల మీద పెంకులు లేచిపోతున్నట్టనిపించవచ్చు!
పిల్లలకి భాష నేర్పడం అటుంచి ముందు మనం పిల్లల భాష నేర్చుకోవాలి. పిల్లల్లానే మాట్లాడాలి. పిల్లల ప్రపంచంగానే మనబడి ఉండాలి. ఒక్కరోజు మనం మాట్లాడే పదాలన్నీ రాసిపెట్టుకున్నామనుకోండి. వాటి అర్ధాలు పిల్లలకు తెలుసా అని లెక్కేసి చూసుకున్నామనుకోండి. లేకుంటే ఒకరోజు పిల్లల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి ఏం మాట్లాడుకుంటున్నారో రికార్డు చేసామనుకోండి. అందులోని పదాలన్నీ క్రోడీకరించి మన పదాలతో పోల్చి చూసుకున్నామనుకోండి. అప్పుడు నన్నయ భాష మనకి ఎలా వుంటుందో మన భాష పిల్లలకీ అలానే వుంటుందని సులభంగా అర్థమైపోతుంది. మరో సంగతి.. భాషకు అర్థం కావడం ఒక్కటే చాలదు. అది ఆత్మీయంగానూ ఉండాలి.. అప్పుడే మనం ఎదుటివాళ్ళతో మమేకమవుతాం. పిల్లల విషయంలో ఈ జాగ్రత్త మరీ అవసరం!

తగ్గుతున్న భాషా ప్రాధాన్యం
మన చదువుల్లో భాషల ప్రాధాన్యం బాగా తగ్గుతోంది. ఆశ్చర్యంగా ఇతర దేశాల చదువులతో పోలిస్తే ఇది విరుద్ధమైన పోకడ. భాషను బాగా నేర్చుకోడంతోనే పసితనంలో పిల్లల వికాసం జరుగుతుంది. తర్వాత ధారాళంగా చదవడంతోనే విమర్శనాత్మక దృక్పథం, తార్కికత ఏర్పడతాయి. పాఠ్యేతర గ్రంథాల పఠనంతోనే స్వీయ అభ్యసనం సాధ్యమవుతుంది. పిల్లలు ఎంత వేగంగా, ఎంత అర్థవంతంగా చదవగలుగుతున్నారు, చదివిన దానిపై వారెలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు, దాన్ని ఎంత సమర్థవంతంగా వ్యక్తం చేయగలుగుతున్నారు.. అనేవి ఆధునిక విద్యలో ప్రపంచవ్యాప్తంగా చాలక కీలకమైన గీటురాళ్లు. కార్పొరేట్ విధానం వచ్చాక, పోటీ పరీక్షలు ఏకైక లక్ష్యంగా మారాక మన చదువుల తీరే మారిపోయింది. ఎంత పెద్ద స్కూలు – ఇంగ్లీషు చదవులపై ఎంత ఆర్భాటం చేసినా అందులోని పిల్లలు విద్య పూర్తయ్యేటప్పటికి ఎన్ని పుస్తకాలు సొంతంగా చదివారని లెక్క తీస్తే దాదాపు శూన్యమే ఎదురవుతుంది. ఇక ఈ స్కూళ్ళు తెలుగును వదిలేసి చాలాకాలమయింది. దీనివల్ల భాషలకు ఎంత నష్టం వచ్చిందనేది పక్కన పెడితే మన పిల్లలు మొదట తీవ్రంగా నష్టపోతున్నారు. మన విద్యావిధానాల్లో, బోధనా పద్ధతిలో, అభ్యసన లక్ష్యాల్లో తీవ్రమైన మార్పులు రాకుండా దీన్నుంచి బయట పడలేమన్పిస్తుంది.
సంస్కరణా తాపత్రయం
పిల్లల భాషను ఎప్పటికప్పుడు సంస్కరించాలని మనకు మహా తాపత్రయం! “వాళ్లు తప్పులు మాట్లాడతారు. మంచిగా మాట్లాడరు.” చదువుకున్న వాళ్ళ మాటలు వారికి రావాలి. మరీ పేద పిల్లల యాస ఘోరంగా ఉంటుంది. అంతా అనాగరికం. ఇవన్నీ సరిచేసి శుద్ధభాషను నేర్పడానికే కదా బడి ఉండేది” అని మన దృఢమైన విశ్వాసం. ఇదెక్కడికి దారితీస్తుందంటే పిల్లలు నోరెత్తడానికే బడిలో భయపడిపోతారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పసిబిడ్డలు “బడికి” పోతా అనకుండా “బలికి” పోతామనే అంటారు. దాన్ని సంస్కార హైన్యం అంటున్నామా? “బలికి” అన్నప్పుడే మనం చెంప వాయించి వుంటే, ప్రతి వాక్యాన్ని వ్యాకరణాంశాలు వెతికి సరిచేసి ఉంటే ఏమయ్యేది? బహుశా పిల్లలందరూ మూగమొద్దులయ్యేవారు. మనం ముందు ధారాళంగా స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి.. ప్రోత్సహించాలి. పెరిగేకొద్దీ సమాజంలో వారు భాగస్వాములయ్యే కొద్దీ ఏది తప్పో, ఏది ఒప్పో వాళ్లే తెలుసుకుంటారు. మనబడిలోనూ ఇంతే. పిల్లలు తప్పులు చెయ్యడం నేర్చుకోవడంలో భాగం. ఇక ‘సంస్కారం’, ‘నాగరికత’, ‘సంస్కృతి’ అంటారా ఎవరి సంస్కారాలు వారివి. ఎవరి నాగరికత వారిది. వాటితో తమ అవసరాలు వాళ్ళు అద్భుతంగా తీర్చుకుంటున్నారు.. బతుకుతున్నారు. అదీ ఒక బతుకేనా అని మనం అనొచ్చు. మరి మనలా వాళ్ళు పెట్టి పుట్టలేదే! దీన్ని మర్యాదగా గుర్తించడం మంచిది. భాష సామాజికమైంది.. సాంస్కృతికమైంది. కంఠస్థం చేసి వొంట పట్టించుకునేది కాదు. మన పిల్లలు నిరుపేద పిల్లలు. తరతరాల మానవ సంస్కృతికి వారు నిజమైన వారసులు. దీన్ని మనం మరిచిపోకూడదు.
సమస్య ఏమంటే మన పుస్తకాల్లో వాళ్ళ భాష వుండదు. కనీసం మనం రాసే బడి గోడల మీది నినాదాల్లో కూడా వాళ్ల విషయాలు, మాటలు వుండవు. అంతా పరాయీకరణ. ఇక వారికి దొరికింది ఒకే మార్గం.. పిల్లల్లో పిల్లలు మాట్లాడుకోడం. దానికీ మనం నిషేధాలు విధిస్తే ఎలా? దీనికో చక్కని చిట్కా ఏమంటే పిల్లల్ని గ్రూపులు చేసి చదువు నేర్పడం. మనం చెప్పిన పాఠాన్ని గురించి వాళ్లలో వాళ్లే మాట్లాడుకోనివ్వడం. వాళ్ల భాషలో వాళ్లని చర్చించుకోనివ్వడం. వాళ్ళ సాంస్కృతిక సామాజిక నేపథ్యంలోంచి విశ్లేషించుకోనివ్వడం. అప్పుడు విషయం పరాయిదైనా సొంతం చేసుకోగలరు.
అలాగే పిల్లల సొంత భాషలో మనం మాట్లాడ్డంలో ఆత్మీయత వుందనుకున్నాం. ఆత్మీయతను కేవలం భాష ద్వారానే వ్యక్తం చేయలేము. పిల్లలతో కలిసి మనం ఆడితే, పాడితే, అభినయిస్తే, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే అప్పుడు అత్యంత సహజంగా వాళ్ళ భాషలో మనం మాట్లాడుతాం. వాళ్ళు మనతో మాట్లాడతారు. పిల్లల పదాల లిస్టులు కంఠస్థం చేసినంత మాత్రాన మనం పిల్లల భాషలో మాట్లాడలేము.
ఇక్కడ మనకు మరో చిక్కు వుంది. “పిల్లల్ని మాట్లాడనిస్తే అడ్డదుడ్డ ప్రశ్నలు వేస్తారు. మనల్ని విసిగిస్తా”రని. ఈ పెద్దరికపు భేషజం కూడా మనల్ని వెంటాడుతుంది. “మాట్లాడ్డం” అనే మాటలోనే “మాట్లాడనివ్వడం”, ” వినడం” అనేవి కూడా దాగి వున్నాయి. విరుద్ధభావాల ఘర్షణ నుంచే జ్ఞానం వికసిస్తుంది. ఈ క్రమాన్ని మనం ఒప్పుకుంటే సమస్య ఉండదు. కానీ ఈ ఒప్పుకోవడం మనకి- అంటే పెద్దలకి, గురువులకి, అధికారులకి, నాయకులకి అంత సులభంగాదే!

ఇంగ్లీషు మీడియం
ఇప్పుడు శిశు విద్య నుంచే ఇంగ్లీష్ మీడియం శాస్త్రీయమా కాదా అనే చర్చను వదిలేసి దానికి సామాజిక అంగీకారం వుందా లేదా అనే దశలోకి మనం చేరుకున్నాం. ఇంగ్లీషు భాష నేర్చుకోడానికి ఇంగ్లీష్ మీడియం అవసరమనే భ్రమలోకి వెళ్లిపోయాం. ఇదో వింతా, విషాదమూ! అదలా వుంచితే మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియం ప్రారంభించి 18 ఏళ్లు కావస్తోంది. దీనివల్ల ఏ ఫలితాలు వచ్చాయో, మరీ పేద పిల్లలు ఏమయ్యారో లోతుగా అధ్యయనం చేసిన వారెవ్వరూ లేరు. ఇప్పుడు మన రాష్ట్రంలో మాతృభాషా మాధ్యమం ఒక అనధికార నిషేధానికి గురైంది. దీంతో పిల్లలు అటు ఇంగ్లీషుకూ, ఇటు తెలుగుకూ రెంటికీ చెడ్డ రేవళ్ళయ్యారు. ఇలా ఎందుకు జరగాలి? ప్రాథమిక దశ వరకు మాతృభాష చదవడం రాయడం బాగా నేర్పుతూ, సమాంతరంగా ఇంగ్లీషు వినడం, మాట్లాడడం నేర్పి ఒక దశకు వచ్చాక ఇంగ్లీష్ మీడియంలోకి ప్రవేశింప చేయవచ్చు. ఈ పద్ధతి ప్రపంచమంతా వుంది. అసలు సమస్య తెలుగును గానీ, ఇంగ్లీషునుగానీ శక్తివంతంగా నేర్పడంలో వుంది.

కావలసింది శాస్త్రీయ భాషా విధానం
ఇవన్నీ ఏమీ అసాధ్యమైనవి కావు. ప్రస్తుత భాషా విధానం మన పిల్లల్ని, దేశాన్ని కుంగదీస్తోందని మన పాలకులకు తెలియంది గాదు. ప్రపంచమంతా ఏ దారిన పోతుందో మనందరం చూడకా గాదు. సమస్య మనకంటూ ఒక భాషా విధానం లేకపోవడంలో వుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం మన నూతన (జాతీయ) విద్యా విధానం. ఒకవైపు ఈ సమస్యను గుర్తిస్తున్నట్టు పైపైకిది కన్పిస్తుంది. కానీ పరిష్కారం మాత్రం ఇందులో కనబడదు. ఒక స్పష్టమైన నిర్దేశాన్నిది చెయ్యదు. పైగా పసిపిల్లలు ఎన్ని భాషలయినా నేర్చుకోగలరనీ, మన దేశం బహుళ భాషల దేశమనీ, వీలున్నన్ని భాషలు చిన్నతనంలోనే పిల్లలకు నేర్పాలని ఓ విచిత్రమైన వాదాన్నిది ముందుకు తెస్తుంది. వీటిలో సంస్కృతానికి పెద్ద పీట వేయమంటుంది. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత గొప్ప విద్యావంతులవుతారా? అసలు ఇది సాధ్యమా? ఆధునిక ప్రపంచంలో ఎక్కడైనా ఇది అమల్లో ఉందా? ఒక భాషనే నేర్పలేని మనం బహుళ భాషల్ని ఏమి నేర్పగలం? ఈ చర్చలోకి నూతన విద్యావిధానం వెళ్లదు. లోపం ఎక్కడుందో వెతకదు.
డిజిటల్ విప్లవం మనల్ని చుట్టుముట్టాక భాషా ప్రపంచం కూడా తీవ్రమైన మార్పులకు లోనవుతోంది. ఇప్పుడు మన సొంత భాష మీద పట్టు వుంటే చాలు. మనకు ప్రపంచంలోని అన్ని భాషలూ కరతలామలకమవుతాయి. ప్రపంచ సాహిత్యమంతా మనకు అంతర్జాలంలో ఆఘమేఘాల మీద లభ్యమవుతోంది. మరి ఈ అవకాశాన్ని మన పిల్లలకు అందించేలా మన చదువులున్నాయా? మన విద్యావిధానాలున్నాయా? మన విద్యావంతులకైనా ఈ దృక్పథం వుందా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. వీటికి జవాబుల్ని వెతుక్కోలేనంత కాలం దూరం మనమింకా ప్రయాణం చేయలేదనిపిస్తోంది. దీనివల్ల పిల్లలకు వచ్చే నష్టం, దేశానికి వచ్చే నష్టం మనకు ఇంకా అర్థం కావాల్సి వుందనిపిస్తోంది.


విఠపు బాలసుబ్రహ్మణ్యం
మాజీ శాసనమండలి సభ్యులు, విద్యావేత్త









కామెంట్‌లు (0)