test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మనసుని శుద్ధి చేసే కవిత్వం..

23 గంటల క్రితం

Poetry that purifies the mind...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 02:20 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

నేటి ఆధునిక కవితాత్మను నడిపిస్తున్న కవుల్లో డా. సుంకరగోపాలయ్య ముందు వరుసలో ఉంటారు. కవిగా, సమీక్షకుడిగా డిగ్రీ విద్యార్థుల సిలబస్ రూపకర్తల చైర్మన్ గా, కవి సంధ్య పత్రిక ఉపసంపాదకుడిగా బహుముఖ పాత్రలు పోషిస్తూనే ‘ హోరు ‘సాహితీ సంస్థ తరఫున వివిధ కళాశాల విద్యార్థులకు కవిత్వ శిక్షణ అందించడం తోపాటు తమ గురువు గారైన రాధేయ గారి పేరు మీద పుష్కర కాలం పైనుండే రాధేయ కవితా పురస్కారాన్ని అందిస్తూ సాహితీ సేవ చేస్తున్నారు..!
ఎప్పుడో’ మా నాయన పాట’ కవిత్వ సంపుటితో ఒక జానపద జావళీలా పలకరించిన గోపాల్ గారు నేడు ‘నీటి కుండలాంటి మనిషి’తో మన ముందుకు వచ్చారు. పాత ప్రతీకల పీకలు నొక్కి కొత్త ప్రతీకల,పదబంధాలకు పెద్దపీట వేస్తారు.. ఇక్కడ చూడండి ‘ తెల్లవారుజాము కల్లో / గాథాసప్తశతి నాటి / అమ్మాయిని చూశాన్నేను ‘ అంటూ మొదలైన కవితలో.. ‘ ఊడలు ఊడలుగా దిగిన మర్రిచెట్టు కింద/ నీడ మత్తుగా నిద్రపోతుంది ‘ అనే పద ప్రయోగం చేశారు. మర్రి చెట్టు నీడలో మనిషి నిద్రపోవడాన్ని చూస్తాం. కానీ నీడ మత్తుగా నిద్ర పోతుందని చెప్పడంతోటే కవి మనల్ని కవిత్వావరణంలోకి తీసుకెళ్తాడు. ఆయన కవిత్వంలో చూస్తే నాన్న జానపద గేయ వారసత్వం కనబడుతుంది.
”అమ్మ -అడవి’ కవితలో.. ‘బజ్జోరా నాకన్నా/ మీ నాయన దచ్చనాది ఎల్లినాడు/ బజ్జోరా మా చిన్న / మీ తాత ఉత్తరాది యెల్లినాడంటూ..
అమ్మ లాలిపాటవుతాడు. ‘కపర కపర చీకటి’ కవితలోనూ బాంధవ్యాల గురించి తపించే లాంటిదే ఒక ఆదిమ రాగమాలపిస్తాడు.
గోపాల్ గారి కవిత్వంలో చరిత్ర తొంగి చూస్తుంది. కవితా సాధన కనిపిస్తుంది.
‘మరణంలేని పాట’ లో ‘అప్పుడెప్పుడో/
మెసపటోమియాలో కురిసిన వానలో /
నిండుగా తడిచి/ చినుకుల్ని కవిత్వం చేసిన మనిషి’ అంటూ సాగే కవితలో సింధూ నాగరికతను ఉటంకిస్తూ పాట గొప్పదనాన్ని కవితలోకి వొంపుకున్నారు.
అలాగే అశోక దుఃఖం కవితలో కూడా కళింగ యుద్ధానంతర అశోకుని దుఃఖాన్ని బుద్ధుని మాటలలో వినిపిస్తారు. సుంకర గోపాల్ గారి కవిత్వంలో కుల, మత
వర్గ, ప్రాంత వైషమ్యాలను పాతరవేసే సున్నిత ధిక్కారస్వర తీవ్రతను చూస్తాం..!
‘గీతల్లేని లోకం’లో ‘రాజ్యాలమధ్య/ ఈ సరిహద్దు గీతలేంటో తెలియట్లేదు/ గీతలు గీసి కంచెలు నాటి / ఏం తీసుకుపోతారో అర్థం కావట్లేదంటూ.. మనిషినీడనిచ్చే చెట్టెందుకు కావట్లేదోనని బాధపడుతారు.
ప్రస్తుత మనిషిలోని మార్కెట్ తనం గురించి తన కవితల్లో ఇలా ప్రశ్నిస్తాడు. ” మేకలను మచ్చిక చేసుకున్నట్టే / మార్కెట్ మనుషుల్ని సాకుతుంది / అక్కడెక్కడో ఆడే అట / ఇక్కడ బెట్టింగ్ యాపై ఆర్పేస్తుందంటూ హెచ్చరిస్తారు. అనంతరం కవిత కూడా అలాంటి కవితే..!
దూరమైపోతున్న బంధాల గురించిన కలవరింత గోపాల్ కవిత్వంలో కనబడుతుంది. ‘బాల్య యవ్వన్నల్లో గొడుగుల్లా.. నీడల్లా.. చప్పట్లలా మోగి దడి కట్టిన చేతులు ఇప్పుడు దూరమైనాయని ‘ఆ మిత్రులేరి ‘ కవితలో ఆవేదన చెందుతారు. ఇందులో నాన్నమీద రాసిన ‘పద్యవారసత్వం’, ‘అనగనగా ఒక అవ్వ’ అనే రెండు ఎలిజీలను హృదయంతో రాసి మనల్ని కన్నీరు పెట్టిస్తారు.

ప్రభుత్వ విధానాల మీద రాసిన పద్యాలు
కర్ర విరగకుండా పాముని చంపేవిధంగా ఉంటాయి. ‘ముగింపు’ కవితలో ఆదివాసీల మీద జరిగే ప్రభుత్వ మత దౌర్జన్యాలను, ‘బడ్జెట్ కు ముందే ‘కవితలో నీరసిస్తున్న బడ్జెట్ గురించి పదునైన వాక్యాలే వినబడుతాయి. మత చాందసాలను వ్యతిరేకించే ఆయనలోని నాస్తికుడ్ని, హేతువాదిని పట్టించే కవిత ‘కొత్త పంచాంగం’. గ్రహాల మీద,నక్షత్రాల మీద నిందలు వేయకుండా కృషి చేసి విజయం సాధించమంటారు. ఎలాంటి కవిత్వం రాయాలో తాను ఎలాంటి కవిత్వమవుతున్నానో ‘ఆత్మలు చప్పట్లు కొట్టే
వాక్యాల్లో’ వినబడతారు. ఆమె +నేను =కవిత, అనగనగా ఒక అవ్వ కవితల్లో స్త్రీ తత్వాన్ని వినిపిస్తూ తన చిట్టితల్లి హాస్టల్ కి వెళుతున్నప్పుడు అనుభవించే హృదయ సంచలనాన్ని ‘దిగులు చూపుల పద్యం’ తో మనహృదయాల్లోకి బట్వాడా చేస్తారు. గోపాల్ లోని తత్వవేత్తను భర్తీ, ప్రతిబింబం, చనిపోయాక నేనేమౌతాను కవితల్లో చూడవచ్చు నేటి విద్యార్థుల ఆత్మహత్యల పిరికి చర్యలపై ‘ఏ గాడిద ఉరేసుకోదు / ఒక్క మనిషి తప్ప’ అని ఖండిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తారు. ‘ అలజడి’ కవితలో పర్యావరణంపై మనిషి విధ్వంసాన్ని తూర్పారబడతాడు.
చివరిగా గోపాల్ లోని చైతన్యంతో కూడిన కవిత్వ శైలినీ, సౌందర్యాన్ని, సౌకమార్యాన్ని గమనించాలంటే ‘నువ్వే ఒక పాలపుంత’ లోకి పరకాయం చేయాలి. 49 పద్యాల ఈ కవిత్వం అనేక అంశాలను స్పృశిస్తూ ‘నీటి కుండలాంటి మనిషి’ దగ్గర ఆగుతుంది. ఒక నీటి కుండ ప్రకృతిలో భాగం.
స్వచ్ఛతకు ప్రతీక. కుమ్మరి కార్మికశక్తితో పుట్టి.. ఆ మంటల్లో కాలి కరుకుదనాన్ని సంతరించుకుని , చల్లని నీటిని అందించే పరోపకారంతో మన్ని అత్యంత సహజంగా మట్టిలోనే జీవితాన్ని ముగిస్తుంది. అలాంటి ఒక మనిషిని, అలాంటి ఒక జీవన ప్రయాణాన్ని గోపాల్ గారు కలగంటున్నారు. ఆ కలల సమాజాన్ని తన కవిత్వం నిండా నింపి మన దాహార్తిని తీరుస్తున్నారు. ఇది మనిషినీ , మనసుల్ని ఖచ్చితంగా శుద్ధి చేసే కవిత్వం.. మనందరి అలమారాల్లో భద్రంగా దాచుకుని చదువుకోవాల్సిన పొత్తం.


అన్నం శివకృష్ణ ప్రసాద్
9490325112

ప్రతులకు :

డా // సుంకర గోపాలయ్య

9492638547



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్