test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోటీకి నేను అర్హురాలిని : వినేష్ ఫోగట్

11 మే, 2026

Vinesh reaches Gonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 03:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గోండా /ఉత్తరప్రదేశ్ : పోటీకి తాను అర్హురాలినని ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ స్పష్టం చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లోని గోండా చేరుకున్న ఆమె.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ )జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చారు. అయితే .. తాను పదవీ విరమణ తర్వాత పోటీల్లో తిరిగి పాల్గొనాలనే తన నిర్ణయం గురించి జూన్ లోనే అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్ల్యుడబ్ల్యు)కి తెలియజేశానని వినేష్ పేర్కొన్నారు. దీంతో పదవీ విరమణ చేసిన క్రీడాకారులకు సంబంధించిన వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (డబ్ల్యుఎడిఎ) కోడ్ లోని రూల్ 5.6.1తనకు వర్తించదని సమాధానమిచ్చారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో ఆమెను పోటీ చేసేందుకు అనుమతించలేమని, ఆమెపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు పోటీల్లో పాల్గొనలేరని డబ్ల్యుఎఫ్ ఐ పేర్కొంది. డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం.. పదవీ విరమణ నుండి తిరిగి వచ్చే అథ్లెట్లు తప్పనిసరిగా ఆరు నెలలకు ముందు నోటీసు ఇవ్వాలని, 2026 జూన్ 26 వరకు నేషనల్ ఈవెంట్లలో పాల్గొనేందుకు వినేష్ అనర్హురాలని తెలిపింది. క్రమశిక్షణా రాహిత్యం, ఫెడరేషన్ నిబంధనల ఉల్లంఘన, డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించారని డబ్ల్యుఎఫ్ఐ తీవ్రమైన పదజాలంతో షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

వినేష్ సమాధానంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసిందని, రెజ్లర్ కేవలం అర్హత అంశాన్ని మాత్రమే ప్రస్తావించి, గతంలో ఆమెకు జారీ చేసిన క్రమశిక్షణా నోటీసులపై సమగ్రమైన వివరణనివ్వలేదని డబ్ల్యుఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. క్రమశిక్షణా విచారణ చేపట్టి, తుది నిర్ణయం తీసుకునే వరకు, ఆమెను పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించలేమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

తనను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు డబ్ల్యుఎఫ్ఐ యత్నిస్తోందని వినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల విభాగంలో స్వర్ణపతకం కోసం జరిగిన పోరులో అనర్హత వేటుకు గురైన తన్వాత.. వినేష్ రెజ్లింగ్ కు రిటైర్ మెంట్ ప్రకటించింది. అయితే ఆమె తన రిటైర్ మెంట్ గురించి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని, కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వినేష్ భర్త వాదించారు. 2024 డిసెంబర్ లో యుడబ్ల్యుడబ్ల్యు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. ఆమె తన రిటైర్ మెంట్ గురించి అంతర్జాతీయ పరీక్షా సంస్థ (ఐటిఎ)కు సమాచారమిచ్చారని డబ్ల్యుఎఫ్ఐ ఆరోపిస్తోంది. తాను తిరిగి రావాలనే ఉద్దేశాన్ని తర్వాత ప్రపంచ సంస్థకు తెలిపానని, దీంతో గోండాలో జరిగే టోర్నమెంట్ లో పాల్గొనేందుకు తాను అర్హురాలినని వినేష్ వాదిస్తున్నారు.

నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ కి సంబంధించి పోటీలో పాల్గొనే రెజ్లర్ల  బరువును సోమవారం సాయంత్రం లెక్కిస్తారు. మంగళవారం నుండి టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్