test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయివేటుకు లాభాలు.. ఆర్టిసికి భారాలు

4 గంటల క్రితం

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 12:31 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఏజెన్సీల నుంచి వచ్చే *ఆదాయం లక్షల్లో
    - ఒక్కో డిపోలో ఛార్జింగ్ స్టేషన్లకే రూ.18 కోట్లు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బస్సులు ప్రైవేటువి, నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులు, లాభం తీసుకునేది వారు, నిర్వహణకు సహకరించేది ఆర్‌‌టిసి, ఆస్తులూ ఆర్‌‌టిసివే. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎపిఎస్‌ఆర్‌‌టిసి బస్సులు నడపలేదని, కొనలేదనే పేరుతో వాటి నిర్వహణనూ, ప్రైవేటు ఏజెన్సీలకు రూ.1,500 కోట్ల విలువైన ఐదు డిపోలను లీజు పేరుతో ప్రభుత్వం కట్టబెట్టేసింది. ‘ఆర్‌‌టిసికి సొంతంగా రూ.వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఎలక్ట్రిక్ బస్సులు కొనే ఆర్థిక స్తోమత లేదని, ప్రైవేట్ భాగస్వామ్యం అనివార్యమని, దానికి ప్రతిగా స్థలాలు ఇవ్వడం వ్యాపార ఒప్పందంలో భాగమే’ అని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చెప్పడం ప్రజలను మోసం చేడయమే. ప్రైవేటు ఏజెన్సీ కోసం విజయవాడ విద్యాధరపురం డిపోలో ఏకంగా రూ.18 కోట్ల ప్రభుత్వ నిధులతో బస్సు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోల్లోనూ ఇదే తరహా సదుపాయాలు కల్పిస్తోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండకపోవచ్చు. ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతున్న లీజు ఒప్పందాలతో భవిష్యత్తులో ఆర్‌‌టిసి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దానిపై ఆధారపడ్డ వేలమంది కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ఆస్తుల అమ్మకమే తొలి ప్రాధాన్యతగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది.
గ్రాస్ కాస్ట్ కంట్రాక్టు (జిసిసి) పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పన కోసం ప్రైవేట్ ఏజెన్సీలకు కేటాయిస్తున్న ఆర్‌‌టిసి డిపోలకు చెందిన స్థలాల మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంది. విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, తిరుపతిలోని మంగళం డిపోలు పూర్తిగా పినాకిల్ మొబిలిటీ సంస్థకు అప్పగించారు. విజయవాడ (విద్యాధరపురం డిపో)లో సుమారు 100 ఇ-బస్సుల నిర్వహణ కోసం రూ.18 కోట్లతో సివిల్, ఎలక్ట్రికల్ పనులు (ఛార్జింగ్ పాయింట్లు) చేపట్టారు. దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. దీంతోపాటు విశాఖపట్నం (గాజువాక డిపో), అనంతపురం వంటి ప్రాంతాల్లో విలువైన ఆర్‌‌టిసి భూములనూ ఇ-బస్సుల ఛార్జింగ్, షెడ్ల కోసం కేటాయించేందుకు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆర్‌‌టిసి బస్ డిపోలు పూర్తిగా నగరం మధ్యలో విలువైన ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో డిపో విస్తీర్ణం సగటున మూడెకరాల నుండి పదెకరాల వరకూ ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే.. విజయవాడ, వైజాగ్, గుంటూరు వంటి నగరాల్లో ఎకరా విలువ రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల పైమాటే (ప్రాంతాన్ని బట్టి). ఈ లెక్కన ఒక్కో డిపో భూమి బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుంది. కమర్షియల్ లీజు లెక్కన చూస్తే, ఇంతటి భారీ స్థలాలకు నెలకు వచ్చే అద్దె రూ.లక్షల్లోనే ఉంటుంది. జిసిసి ఒప్పందం ప్రకారం.. ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ స్థలాలను ఉచితంగా లేదా నామమాత్రపు లీజు రేట్లకు కేటాయించాలి. దీనికోసం ఒప్పందంలోనే ప్రైవేటు ఏజెన్సీలు బస్సులు కొనుగోలు చేసి ఆర్‌‌టిసి కోసం నడుపుతారు అనే పదాన్ని చేర్చారు.

తీవ్రంగా నస్టపోతున్న ఆర్‌‌టిసి
ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వాలనుకున్న ఆర్‌‌టిసి డిపోలను అదే సంస్థ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు లేదా పెట్రోల్ బంకుల లాంటి ఇతర వాణిజ్య అవసరాలకు వాడుకుంటే సంస్థకు శాశ్వత ఆదాయం వచ్చేది. కానీ ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వడం వల్ల ఆ ఆదాయాన్ని సంస్థ పూర్తిగా కోల్పోతుంది.

ప్రజల సొమ్ముతో వసతుల కల్పన
కేంద్ర ప్రభుత్వ పిఎం ఇ-బస్ సేవా వంటి పథకాల కింద వస్తున్న సబ్సిడీ నిధులు (రాష్ట్రంలో దాదాపు రూ.89.9 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.79.9 కోట్లు కేంద్రం మంజూరు చేసింది) డిపోల విద్యుద్దీకరణకు వాడుతున్నారు. ప్రభుత్వ నిధులతో, ఆర్‌‌టిసి స్థలంలో నిర్మించే ఈ అత్యాధునిక మౌలిక వసతులను ప్రైవేట్ ఆపరేటర్లు తమ బస్సుల నిర్వహణకు ఉచితంగా వాడుకోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా లీజు కాలాన్ని 12 ఏళ్లుగా పేర్కొన్నారు. అంతకాలం పాటు ఆర్‌‌టిసి తన సొంత స్థలాలపై పూర్తి నియంత్రణను కోల్పోతుంది. తరువాత లీజు పొడిగించుకున్నా లేదా సంస్థ మారినా లీజు మాత్రం మరో 12 ఏళ్లు లేదా 33 ఏళ్లు కొనసాగుతుంది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్