test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేటీకరణ ప్రకటనతోనే విశాఖ ఉక్కుకు కష్టాలు

2 గంటల క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 11:56 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- నాడు వేల కోట్ల డివిడెండ్లు..  నేడు కష్టాల సుడిగుండం
 - 'కూటమి’ పాలనలో తారాస్థాయికి చేరిన ప్రమాదాలు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ర్టంలో ఇపుడు ఒకటే చర్చ. అది విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌గురించే. ఈ నెల ఎనిమిదిన జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృత్యువాత పడడంతో యావత్తు ‌దేశం ఉలిక్కి పడింది. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు ప్రమాదాలతో విశాఖ ఉక్కు అట్టుడుకుతోంది. 2021 జనవరి 27న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్లాంట్ వంద శాతం అమ్మకం, ప్రైవేటీకరణ అని ప్రకటించినప్పటి నుంచీ ఉక్కు కర్మాగారానికి కష్టాలు మొదలయ్యాయి. ప్రకటన చేయక ముందు విశాఖ ఉక్కు రూ.900 కోట్ల నికర లాభంతో ఉంది. అప్పటివరకూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు రూ.వేల కోట్ల డివిడెండ్లు ఇస్తూనే ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ ప్లాంట్‌ ‌తీసుకోలేదు.

​అమ్మకం ప్రకటన తర్వాతే నష్టాలు
ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత ప్లాంట్‌ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ.2200 కోట్లు ఒకేసారి నష్టం వచ్చింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్లు, తదుపరి ఆర్థిక సంవత్సరంలో రూ.నాలుగు వేల కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ప్రైవేటీకరణ ప్రకటనకు ముందుటేడాది రూ.900 కోట్లు లాభాల్లో ఉంది. కార్మికుల సమిష్టి కృషితోనే ఈ లాభాలు వచ్చాయి. కానీ కేంద్రం వారిపై దుష్ర్పచారం సాగించింది.

​కూటమి ప్యాకేజీ - వాస్తవాలు
2024 ఎన్నికలకు ముందు ‘కూటమి’ పార్టీలు స్టీల్‌‌ప్లాంట్‌‌ను నష్టాల నుంచి బయటకు తెస్తామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించాయి. అధికారంలోకి వచ్చాక రూ.11400 కోట్లు ప్యాకేజీ కేంద్రం నుంచి వచ్చింది. కానీ పూర్తిగా షరతులతో కూడిన ప్యాకేజీ ఇది. మెరుగైన పని విధానం కోసం ఈ ప్యాకేజీని ఇస్తే బాగుండేది. కేంద్ర స్టీల్ సెక్రటరీ ఆదేశాలతో దీంట్లో నుంచి సుమారు రూ.8000 కోట్లను బ్యాంకులకు జమ చేసుకున్నారు. మిగిలిన మొత్తంలో విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులకు జమ చేసుకుంది. వర్కింగ్‌ ‌క్యాపిటల్‌ ‌లేక, రా మెటీరియల్‌ కొనడానికి వీల్లేక ప్లాంట్‌ ‌మరింత అవస్థల్లో పడింది. నడక సాగక అప్పుల్లోకి జారిపోయింది. కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కన్నం పెట్టిన బడా నేతలకు రూ.14 లక్షల కోట్లను మాఫీ చేసింది. ఎయిర్‌ ఇండియా అప్పులు తీర్చేసి టాటా సంస్థకు ఇచ్చేసినట్లుగా స్టీల్‌‌ప్లాంట్‌‌ను జిందాల్‌, మిట్టల్‌‌కు అప్పగించాలనే కుట్ర కూడా దీంట్లో దాగి ఉంది.

​కార్మికులు పనిచేయడం లేదనే వాదన
కార్మికులు ఎక్కువైపోయారు, పనిచేయడం లేదంటూ రాష్ర్టంలోని చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ఆదేశాలతో 2025లో ప్లాంట్ నిర్వహణను టోటల్‌ ‌మెయింటెనెన్స్‌ కాంట్రాక్టు (టిఎంసి)కిచ్చేసింది. దీంతో ప్లాంట్ లోకి అనుభవం లేనివారు జొరబడ్డారు. పర్మినెంట్‌ ‌కార్మికులు 1800 మందిని, కాంట్రాక్టు వర్కర్లు ఆరు వేల మందిని తీసేశారు. నిర్వాసితులు, స్థానికులు ఉపాధిని కోల్పో యారు. అప్పటికే ముడిసరుకు లేక రెండు బ్లాస్ట్‌ ‌ఫర్నేస్‌‌లను నిలిపేసి ఒక బిఎఫ్‌‌నే నడుపుతున్న పరిస్థితి ఉంది. టిఎంసికివ్వక ముందు రెండు ఫర్నేస్‌‌లపై 2025 ఏప్రిల్‌, మే నెలల్లో కొంత మేర లాభాల్లో ప్లాంట్‌ ఉంది. ఎన్‌ఎండిసి నుంచి విశాఖకు సరఫరా కావాల్సిన ఐరన్‌ ఓర్‌ ను ‘మిట్టల్‌’కు సరఫరా చేసేందుకు కేంద్రం ఆదేశించగా రాష్ర్టంలోని కూటమి సై అంది. దీనివల్ల విశాఖ ఉక్కుకు ముడిసరుకు కరువైంది. బయట నుంచి ప్లాంట్‌ ఐరన్‌ ఓర్‌ ‌కొనడంతో టన్నుకు రూ.ఐదు వేలు అదనంగా భారం భరించాల్సి వస్తోంది.

​కోలుకుంటున్న స్థితిలో టిడిపి తప్పుడు విధానం
ప్లాంట్‌‌ను తాము నష్టాల నుంచి లాభాల్లోకి తెస్తామని, ప్లాంట్‌ను రక్షిస్తామని అంటూ చంద్రబాబు, లోకేష్‌ ‌ప్లాంట్‌‌లో ముడిసరుకు లభ్యత లేకపోయినా కేంద్రం స్కెచ్‌‌కు అనుగుణంగా రాష్ర్టంలో రాజకీయ లబ్ధి కోసం బలవంతంగా మూడో ఫర్నేస్‌‌ను ప్రారంభింపజేశారు. ఈ ఫర్నేస్‌‌కు తగినంత కోక్‌ ‌లేదా సింటర్‌ ‌లభ్యత లేనందున ప్రైవేట్‌ ‌సంస్థల నుంచి అధిక ధరలకు కోక్‌‌ను కొనుగోలు చేయాల్సి వచ్చింది. కార్మిక సంఘాలు వద్దని వారించినా వినకుండా మూడో ఫర్నేస్‌‌ను ప్రారంభించడం వల్ల ‌ప్లాంట్‌ ‌మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోయిందన్నది వాస్తవం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్