test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరగనున్న 'చెత్త' భారం

2 రోజుల క్రితం

garbage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఫీజలు నిర్ధారించేందుకు ప్రత్యేక కమిటీలు
    - ఎంత ఎక్కువ భారం వేస్తే అంత ఎక్కువగా కేంద్ర ప్రోత్సాహకాలు
    - జిఒలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రజానీకంపై చెత్త తొలగింపు భారం మరింత పెరగనుంది. ఇప్పటికే చెత్త సేకరణ కోసమంటూ వసూలు చేస్తున్న యూజర్‌ ‌ఛార్జీలకు అదనంగా నిర్వహణ ఖర్చులను కూడా ప్రజల నుండి వసూలు చేయాలని నిర్ణయించడమే దీనికి కారణం. దీంతో స్థానిక సంస్థలు ప్రజలకు సేవలు అందించడానికి బదులుగా, వారిపై భారాలు మోపే సంస్థలుగా మారనున్నాయి. ఇలా వేసే అదనపు భారాన్ని చట్టబద్దం చేసేందుకు ప్రత్యేక కమిటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలు ఖర్చును అంచనా వేసి ఎంతవరకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలో నిర్ణయించి, ఆ మొత్తాన్ని వసూలు చేసే హక్కును ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించనున్నాయి. ఈ మేరకు గత నెల 27వ తేదినే రాష్ట్ర ప్రభుత్వం 673వ నెంబర్‌ ‌జిఓను జారీ చేసింది. ఈ జిఒ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, నిర్వహణకు సంబంధించి రూ.30 వేల కోట్ల నుండి రూ.45 వేల కోట్ల వరకూ లోటు ఉందనిఅంచనా వేసిన ప్రభుత్వం, ఆ మొత్తాన్ని ప్రజలనుండే వసూలు చేయాలని నిర్ణయించింది. 'ప్రజలకు ఉచిత సేవలు అందించడం వల్ల ప్రభుత్వాలపైనా పట్టణ స్థానిక సంస్థలపైనా భారం పడుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వ సేవలు అందుకుంటున్న ప్రజల నుండి రాబట్టాలని``జిఓలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం,. ప్రజలపై ఎంత ఎక్కువగా వసూళ్ళు చేస్తే అంత అధికంగా కేంద్రం నుండి ప్రోత్సహకాలు అందుతాయని జిఓలో పేర్కొన్నారు. ప్రస్తుతం తయారవుతున్న వేలటన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించడానికే పరిమితం కావలసి వస్తోందని, నిధుల కొరత, అధునాతన సాంకేతికత లేకపోవడం వల్ల శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పూర్తిస్థాయిలో జరగడం లేదని జిఓలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ నిర్వహణను, పెట్టుబడులను, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌‌మెంట్‌‌లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలు చెత్త సేకరణలో భాగంగా ఇంటివద్దే వేరు చేసిన తడిపొడి చెత్తను సేకరిస్తాయి. దీన్ని జీపీఎస్ వాహనాల ద్వారా నేరుగా ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. చెత్త నిర్వహణను డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్, ట్రాన్స్ఫర్(డిబిఎఫ్ఓటి) పద్ధతుల్లో చేపట్టనున్నారు. అంటే ప్రవేటువ్యక్తుల భాగస్వామ్యంతో ప్లాంటు నిర్మించి, సొంత ఖర్చుతో నిర్వహిస్తారు. చెత్త ద్వారా ఉత్పత్తయ్యే వస్తువుల అమ్మకం, విద్యుత్ విక్రయం ద్వారా వచ్చే లాభాలన్నీ ప్రైవేటు వ్యక్తులకు వెళతాయి. దీనికోసం పనితీరు ఆధారంగా స్థానిక సంస్థలు ప్రైవేటు వ్యక్తులకు కొంత ప్రోత్సాహక చెల్లింపులు చేయనున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం అందించే కార్ఫస్ నిధులు, స్థానిక పన్నులు కూడా వారికే ఇవ్వనున్నారు. ఈ మొత్తం కార్యాచరణలో స్థానిక సంస్థతోపాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కూడా భాగస్వామ్యం కానుంది. శానిటేషన్ నిర్వహణకూ, వారి జీతాలకు అయ్యే ఖర్చునూ ప్రజల నుండే పూర్తిస్థాయిలో వసూలు చేయనున్నారు.

యూజర్‌ ‌ఛార్జీలపై నిరంతర పర్యవేక్షణ
చెత్త నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని అంచనా వేసి దాన్ని యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసే కమిటీ నిరంతరం పర్యవేక్షించి ప్రైవేటు వ్యక్తులకు లాభాలు వస్తున్నాయా ? నష్టాలు వస్తున్నాయా ? పరిశీలించి వాటి ఆధారంగా ప్రజల ముక్కు పిండి వసూలు చేసే అధికారం ఆయా సంస్థలకు కల్పించేలా జిఓ నిబంధనల్లో పొందుపరిచారు. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ద్వారా రూ.4,900 కోట్లు వసూళ్లు అవుతున్నాయి. దీనిలో రూ.1000 కోట్ల వరకూ ఆస్తిపన్నులు కాగా ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. అలాగే నూతన నిబంధనల ప్రకారం యూజర్ ఛార్జీల వసూలును మరింత కఠినం చేయనున్నారు. ఇప్పటికే ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తీసుకుంది. దీన్ని చూపించి భవిష్యత్లో ప్రజలపై భారాలు వేయనుంది. వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ పట్టణ స్థానిక సంస్థలే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అంటే పట్టణాభివృద్దిశాఖ ద్వారా వచ్చే కొంత నిధులూ కలిపి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇక నుండి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకుండా మొత్తం ప్రజల నుండే వసూలు చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు. ఇలా రూపొందించేలా కేంద్రం చేసిన ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ప్రజలపైనే భారాలు వేసింది.

నిర్వహణ ఖర్చులు స్థానిక సంస్థలవే 6800 టన్నుల చెత్త
రాష్ట్రంలో 123 పట్టణ ప్రాంతాల నుండి 6,890 టన్నుల చెత్త వస్తోంది. దీనిలో 3100 టన్నుల పొడి చెత్త ఉంటోంది. ఇందులో పునర్వినియోగానికి వీలుగా 945 టన్నులను చెత్త రీసైక్లింగ్ ఏజెన్సీలకు పంపుతున్నారు. మిగిలినదాన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు. గుంటూరు, విశాఖపట్నంలో ప్లాంట్లకు 2169 టన్నుల నుండి 2800 టన్నుల చెత్తను పంపుతున్నారు. అక్కడ 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నెల్లూరు, కడప, కర్నూలు, కాకినాడలో 3090 టన్నుల చెత్తను నిర్వహించే ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇవి కాకుండా 85 లక్షల టన్నుల పేరుకుపోయిన చెత్త ఉండగా దానిలో 80 శాతం వరకూ తొలగించారు.

అమృత్‌ 2.0లో భాగమే
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమృత్ 2.0 పథకంలో భాగంగా ఈ విధానం రాష్ట్రంలో అమలు కానుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సేవలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పిపిపి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించినా నిర్వహణ ఖర్చులూ స్థానిక సంస్థలే భరిస్థాయి. నిర్వహణలో వచ్చిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. పైగా వారికి బ్యాంకు రుణ గ్యారంటీ, వయబులిటీ గ్యాఫ్ ఫండింగ్ కూడా ప్రభుత్వమే చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసే సంస్తలకు 60 శాతం పెట్టుబడి ప్రభుత్వాలే అందించనున్నాయి. ఇందులో 30 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్రం భరించనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్