* పగలు వెలిగితే జూనియర్ ఇంజినీర్లపై చర్యలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పట్టణాల్లో విద్యుత్ లైట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం మరలా సిద్ధమైంది. విజన్ 2047లో భాగంగా 123 అర్బన్ లోకల్ బాడీల్లో విద్యుత్ ప్రణాళికలు అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం అయ్యింది. మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలలో ఇంధన సంరక్షణ కార్యాచరణ పేరుతో దీనిని రూపొందించారు. దీనికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మే 19వ తేదీన అంతర్గత మెమో నం. 3256371/1/ఎస్సి.ఎ/ఎ1/2026ను మే 13వ తేదీన జారీచేశారు. దీనిలో ప్రభుత్వ నిధులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో అత్యధిక భాగాన్ని వీధి దీపాలు, మున్సిపల్ భవనాలు, నీటి సరఫరా, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు వినియోగిస్తున్నాయని, దీనివల్ల ఉత్పత్తికి తగిన విధంగా ఆదాయం రావడం లేదని తెలిపారు. ప్రజోపయోగానికి ఎక్కువ విద్యుత్తు వాడుతున్నామని చెప్పడమే దీనికి అర్ధం.ఈ ఖర్చును తగ్గించడానికి రాష్ట్రవ్యాప్త సమగ్ర ఇంధన ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాలు, నీటి శుద్ధి కేంద్రాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలతో పాటు రవాణా వాహన సముదాయాలపై సమగ్ర ఇంధన ఆడిట్‌ను నిర్వహించనున్నారు. మొదటి దశ ఆడిట్ ప్రక్రియను అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో 90 రోజుల్లోగా, మిగిలిన పురపాలక సంఘాల్లో 150 రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించారు.
వీధి దీపాలే కీలకం
దీనిలో భాగంగా వీధి దీపాల నిర్వహణను కీలకాంశంగా పేర్కొన్నారు. సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు నుంచి సూర్యోదయం తర్వాత 30 నిమిషాల వరకు మాత్రమే వీధి దీపాలు పనిచేయాలని షరతు పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో వీధిలైట్ల నిర్వహణకు సంబంధించి రాత్రి ఆరు గంటల నుండి ఉదయం 5.30 గంటల వరకూ వెలిగే విద్యుత్ దీపాలను అవసరాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు. వారు దీపాలకు లెక్క ప్రకారం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేస్తారు. రాత్రి ఆరుగంటల నుండి ఉదయం 5.30 గంటల మధ్యలో అనగా జనసాంద్రత తక్కువగా ఉండే 11 గంటల నుండి ఉదయం 5.30 గంటల వరకూ వీధి దీపాలకు సరఫరా అయ్యే విద్యుత్ కెపాసిటీని తగ్గిస్తారు. దీనికోసం ఎక్కడైనా ఎస్వి(సోడియం వేపర్) ల్యాంపుల వాడుతుంటే స్థానంలో ఎంవి (మెర్క్యురీ వేపర్-ప్రసుత్తం కనిపించే తెల్లటిలైట్లు) వేస్తారు. వీటిల్లో ఎస్ వి ల్యాంపులు విద్యుత్ తక్కువ అయితే మాడిపోతాయి. అదే ఎంవి ల్యాంపులు మాడిపోవు. ఉదాహరణకు మామూలు రోజుల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం వరకూ 100 యూనిట్లు వినియోగం అయిందనుకుంటే దాన్ని విద్యుత్ సరఫరాను డిమ్ చేయడం ద్వారా లైట్ల కాంతిని తగ్గించి 50 యూనిట్లకు తగ్గిస్తారు. మిగిలిన 50 యూనిట్లకు లెక్కగట్టి కార్పొరేషన్, ప్రైవేటు నిర్వాహకులూ పంచుకుంటారు. ఇది ఎవరికి ఎంత శాతం పంచుకోవాలనేది ఖర్చును బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుంది. గతంలో విజయవాడ ఇలాగే రియల్ ఎనర్జీ కంపెనీ ప్రయోగాత్మకంగా వీధిదీపాల నిర్వహణ చేపట్టింది. దానికోసం వీధిలైట్లు అన్నింటినీ మార్చేశారు. అనంతరం కంపెనీ నిర్వహించలేక వెళ్లిపోయింది. ఇప్పుడు అదే పద్దతిని మరలా తీసుకొస్తున్నారు.
మరికొన్ని….
పగటిపూట లైట్లు వెలిగితే సంబంధిత జూనియర్ ఇంజనీర్‌ను వ్యక్తిగతంగా బాధ్యులను చేసి చర్యలు తీసుకోనున్నారు. రాత్రి 12:00 నుండి తెల్లవారుజామున 4:30 గంటల మధ్య తక్కువ జనసాంద్రత ఉండే సమయాల్లో వీధి దీపాలకాంతిని తగ్గించనున్నారు. దీనికోసం ఏర్పాటు చేసే కంట్రోల్ ప్యానళ్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని 50 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. పండుగల సమయాల్లో ఫ్లైఓవర్లు, జంక్షన్లపై అనవసరపు అలంకరణ దీపాలను రాత్రి 10 లేదా 11 గంటల తర్వాత వేయకూడదని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త అలంకరణ లైటింగ్ పనులకు ఆమోదం తెలపకూడదని షరతుల్లో పేర్కొన్నారు. మున్సిపల్ భవనాల్లో ఎసి టెంపరేటర్ 24 డిగ్రీల వద్ద నిర్వహించాలని పేర్కొన్నారు. భవన శక్తి ఆడిట్ పరిధిలోకి రాని పోర్టబుల్ ఎసిల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. కార్యాలయాల్లో సాయంత్రం 6:00 గంటలకు లేదా కార్యాలయ సమయం ముగిసిన వెంటనే అనవసరమైన లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల విస్తరణకు సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఖర్చులను తగ్గించడానికి ప్రధాన పంపింగ్ స్టేషన్లను గరిష్టంగా ఆఫ్-పీక్ అవర్స్ (రాత్రి 10:00 నుండి ఉదయం 6:00 గంటల వరకు) నడపాలని పేర్కొన్నారు. 10 సంవత్సరాల కంటే పాత పంపు సెట్లకు 60 రోజుల్లోపు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, వాటి స్థానంలో ఫైవ్ స్టార్ రేటెడ్ మోటార్లను అమర్చనున్నారు. ప్రతి మున్సిపల్ వాహనానికి రోజువారీ మైలేజ్, ఇంధన లాగ్‌లను నిర్వహించనున్నారు. వ్యర్థాలను సేకరించే వాహనాలకు రూట్తోపాటు జిపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయనున్నారు. అధికారుల వ్యక్తిగత ప్రయాణాలకు లేదా వీడియో కాన్ఫరెన్స్/డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా చేయగలిగే పనుల కోసం వాహనాలను వినియోగించొద్దని సూచించారు. తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో సైకిల్ ట్రాక్ మార్గాలను తక్షణమే గుర్తించాలని ఆదేశించారు.








కామెంట్‌లు (0)