test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుజరాత్ ఎగువ సభలో ‘నిశ్శబ్దం’.. ప్రజాస్వామ్య తిరోగమనానికి నిదర్శనమా.. ?

2 గంటల క్రితం

Gujarat, a State without an Opposition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 03:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అహ్మదాబాద్:   భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో గుజరాత్ నియంతృత్వానికి నిదర్శనంగా నిలవనుందా.. రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శక్తి సింగ్ గోహిల్ పదవీకాలం ముగియడంతో.. 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎగువ సభలో ప్రతిపక్షాల ఉనికే లేకుండా పోతోంది. రాష్ట్రానికి ఉన్న మొత్తం 11 రాజ్యసభ స్థానాలూ అధికార బిజెపి ఖాతాలోకే వెళ్లనుండటం, ‘ప్రతిపక్ష రహిత ఎగువ సభ’గా గుజరాత్ మారడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనంగా మారింది. ఇది ప్రజాస్వామ్య తిరోగమనానికి నిదర్శనమా లేక ఏకపక్ష ఆధిపత్యానికి పరాకాష్ట అనే చర్చకు తెరలేపింది.

పదవీకాలం ముగియడం అనేది  సర్వసాధారణమే అయినప్పటికీ..  ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన దిగ్గజాలను అందించిన గుజరాత్ మట్టిలో కాంగ్రెస్ ఇంతలా నామరూపాలు లేకుండా పోవడం గమనార్హం.  1995 నుంచి గడచిన మూడు దశాబ్దాలుగా బిజెపి ఇక్కడ సాగిస్తున్న నియంతృత్వ పోకడలు  ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం అంటే, పాలకులకు అడ్డూఅదుపు లేకుండా పోవడమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్‌లో సామాన్యుడి గొంతుకను అసెంబ్లీలో నొక్కేసిన అధికార పక్షం, ఇప్పుడు పార్లమెంట్ వేదికగానూ ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేయడంలో సఫలమైంది. ఇది ప్రజాస్వామ్యాన్ని తిరోగమనం వైపు నడిపించడమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్ ఉద్యమం తెచ్చిన వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 182 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన 18 సీట్లను కూడా ఏ పార్టీ సాధించలేకపోయింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితం కాగా, ఆప్ 5 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన వలసలతో ప్రస్తుతం సభలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 162కి చేరగా, కాంగ్రెస్ 12 స్థానాలకు పడిపోయింది. ఈ దారుణ సంఖ్యాబలం కారణంగా, కనీసం ఒక్క రాజ్యసభ అభ్యర్థిని కూడా నామినేట్ చేసే నైతిక అర్హతను ప్రతిపక్షాలు కోల్పోయాయి. ఫలితంగా గోహిల్ సీటుతో పాటు ఖాళీ అయిన మిగిలిన మూడు సీట్లు కూడా ఏకపక్షంగా బిజెపి కైవసం చేసుకుంది.

రాజ్యసభ సభ్యుడిగా  శక్తిసింగ్ గోహిల్ సహకార బ్యాంకుల సవరణలపై పోరాడారు.  పార్లమెంటులో  రాహుల్ గాంధీపై  వ్యాఖ్యలకు గాను నిబంధనలకు విరుద్ధంగా ఆరోపణలు చేశారంటూ  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు నోటీసులు ఇచ్చారు.   ఇప్పుడు గుజరాత్ సమస్యలను ఎగువ సభలో ప్రస్తావించే అవకాశం లేదు. బిజెపితో పోటీపడగల సరైన వ్యూహాన్ని రచించడంలో తాము విఫలమయ్యామని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నప్పటికీ.. "రాష్ట్రంలో కాంగ్రెస్ ఆనవాళ్లే లేవు" అనే బిజెపి వ్యాఖ్యలు వారి అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ప్రతిపక్షం లేని గుజరాత్‌లో రేపు రైతుల సమస్యలపై, సామాన్య ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో ఎవరు నిలదీస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం గుజరాత్ నుంచి పార్లమెంటులో మిగిలిన ఏకైక గొంతుక బనస్కాంత లోక్‌సభ ఎంపీ గేనిబెన్ ఠాకోర్ మాత్రమే. 2024 ఎన్నికల్లో ఆమె గెలవడంతో లోక్‌సభలో పదేళ్ల పాటు ప్రతిపక్షాల గొంతుకను వినిపించనుంది. ఒక లోక్‌సభ ఎంపీ, సున్నా రాజ్యసభ ఎంపీలు.. ఇదీ నేడు గుజరాత్‌లో ప్రతిపక్షాల దీనస్థితి. ఏకఛత్రాధిపత్యం వైపు సాగుతున్న గుజరాత్ రాజకీయం, భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీస్తుందా? లేక ఏకపక్ష నిర్ణయాలకు రాజమార్గం అవుతుందా అని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అరుణాచల్ ప్రదేశ్, గోవాల్లో సైతం పూర్తి స్థాయిలో ప్రతిపక్ష సభ్యులే లేని పరిస్థితి ఉన్నప్పటికీ.. ఆ రెండు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ సీట్లు ఒక్కొక్కటి చొప్పున ఉండటం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్