test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచప్పట్లు

08 మే, 2026

satire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 08, 2026, 06:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

‘నమో అమరావతీ/విశ్వ రాజధానిగా నిలుస్తున్నావు, వేల వేల ఎకరాల్లో వెలుస్తున్నావు!/పంట రైతు కంట నీరు తుడిచి వేసినావూ/కష్టం లేకుండానే కౌలు ఇచ్చినావూ/ పల్లెలన్ని తుడిచి పట్టణమవుతున్నావూ.. బ్రతికి ఉంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు/ కనులారా చూసి మురిసిపోయేవాడు!’ — పాట ముగించి ” జోహార్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు “–నినాదమిచ్చాడు గుంటూరు గాయకుడు.
” జోహార్ జోహార్”– సభ స్పందించింది. గాయకుడ్ని చప్పట్లతో అభినందించింది. అది వెంకటాద్రి నాయుడు గారి జయంతి కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా, పండగ వాతావరణంలో నిర్వహించాలని పై పెద్దలు దిగువ వరకు ఆదేశాలు ఇచ్చారు. సభాధ్యక్షులు షరా మామూలుగానే కొలతల నారాయణమూర్తి. తొలకరి జల్లులుగా ఆయన తన తొలి పలుకులను కురిపించడం ప్రారంభించారు.
” వెంకటాద్రి నాయుడు గారు 400 ఏళ్ల క్రితం జన్మించినా, ఆయన అమరావతి నిర్మాత. గత ఏప్రిల్ 27 ఆయన జయంతి. మన అమరావతి పూర్తయినంత వరకూ, ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవచ్చని మన పై పెద్దల నిర్ణయం.” ( చప్పట్లు )
” ఒక కొత్తదనాన్ని నిర్మించాలంటే, ఒక పాతదనాన్ని కోల్పోక తప్పదు. ఆనాటి నాయుడు గారి తొలి రాజధాని చింతపల్లి.. ఆనాటి మన కృష్ణా జిల్లా. స్వర్గం లాంటి తన రాజ్యానికి అమరావతి వంటి రాజధానిని ఆయన కట్టాలనుకున్నారు. ఈనాటి గుంటూరు జిల్లాలోని ధరణికోట దగ్గర, ఒక పాడు పడిపోయిన బౌద్ధ స్తూపం దగ్గర అమరావతి నిర్మించారు. ఆ సమయంలో స్తూపాన్ని చాలా వరకు ధ్వంసం చేయక తప్పలేదంటారు పెద్దలు. తప్పు చేశాడంటారు కొందరు! ఏదైనా కొత్తదనం కోసం పాతదనం ధ్వంసం కాక తప్పదు”( చప్పట్లు )
కొలతల వారు చిన్నగా నవ్వి,” అంతా, నేను చెప్పేస్తే ఏముంది! నాలుగు డబ్బులు ఉన్నాయి కాబట్టి, నాలుగు స్కూల్స్ పెట్టినంత మాత్రాన, పండితుడ్నీ, మేధావినీ కాదు. మన ప్రభుత్వాలు రైతుల దగ్గర భూములు తీసుకొని, లక్షలకు లక్షలిచ్చి, పరిశ్రమలు, మాల్స్, టూరిజం హబ్స్, పబ్స్ వంటి వాటికి చౌకగా…అర్ధా, పావలాకి ఎకరా భూమి ఇచ్చేస్తున్నాయంటే, దేనికి? ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించాలనే.. పవిత్రమైన కార్యక్రమం ఇది”( చప్పట్లు )
” ఇప్పుడు మన కవి, పండితులు దస్తూరీ కస్తూరి రావు గారు మాట్లాడతారు. వీరి తాత, ముత్తాతలు మహా విద్వాంసులూ, పండితులు. వీరి తాతగారు వీణ వాయిస్తే, జమిందార్లు పరవశించి సింహాసనాల మీదే నిద్రపోయేవారట! వీరి ముత్తాతలు కీర్తనలు పాడితే, కోటలు ఒడలు మరిచిపోయేవట! అమరావతి చరిత్రను ఔపోసన పట్టిన వంశం వీరిది. నా బోటి వాడు ఏం మాట్లాడగలడు? విని, తరించండి”( చప్పట్లు )
చప్పట్ల మధ్య, కుంకుమపువ్వు రంగు కాశ్మీర్ శాలువా సర్దుకుని, మెడలో బంగారు తాపడం రుద్రాక్ష మాల లాల్చీలోకి జారిపోతే, దాన్ని బయటకు తీసి, సర్దుకుంటూ–
” సభాయనమః.. సర్వేజనో సుఖినోభవంతు.. ఇప్పటికే సర్వజనులు సుఖముగా ఉన్నారు కదా ( చిన్నగా నవ్వి) ఎప్పుడైతే, అమరావతి నిర్మాణానికి నరేంద్రల వారు పవిత్రమైన మట్టీ, జలాలతో ఈ మహా ధరిత్రిని పావనం చేశారో, ఆనాడే ఈ ప్రాంత దరిద్రం అంతానికి ప్రారంభ ఘడియలు..గమనించలేదు చాలామంది మీడియా వారు కూడా! మన చంద్రుడు కాదు..ఇంద్రుడు..నరేంద్రుడతడు! మరి ఆ నర రూపేంద్రుడికి అమరావతి అక్కర్లేదా! ఈ పురాణ మర్మం ఎంతోమందికి అర్థం కాలేదు. ఎక్కడైతే, అమరావతి పేరుతో ఒక గ్రామం, ఒక పట్నం, ఒక నగరం ఏర్పడుతుందో, అక్కడ ఇంద్రాది, నరేంద్రాది దేవతలు ఆనంద తాండవం చేస్తారట! పురాణ గ్రంథాలు చెప్పాయి.”
వేసవి ఎండ.. అసలే విజయవాడ.. పండితుడు గనుక శాలువా తీయకూడదు.
” కొంచెం ఏసీ లెవల్ పెంచండి నాయనా! బాబూ..కార్యకర్తలు”– నవ్వుతూ కోరాడు.. పెంచారు.
” ఇక్కడ హాజరైన వారు ఎంత మహామహులైతేనేమీ! కార్యానికి కర్త లేకపోతే ఎంత ఖర్చు చేసినా ఫలితం ఉండదు”( చప్పట్లు)
” రైతు అన్నవాడు గొప్ప మమకారి. వరదొచ్చినా, కరువొచ్చినా, వడగళ్ల వానొచ్చినా.. ఆరుగాలం శ్రమ నాశనమైనా.. నమ్ముకున్న భూమిని అమ్మకానికి పెట్టడు. రైతు గొప్ప త్యాగపరుడు.. పండించిన పంటని పక్షులు, ఎలుకలు, పందికొక్కులు తినేస్తున్నా.. మనం పేపర్లు, టీవీల్లో చూస్తున్నాం.. మందకు మంద ఏనుగులు తొక్కేసి, తినేస్తున్నా.. భూత దయతో.. మానవత్వంతో చూస్తూ ఆ బాధను మరిచిపోతాడు. రైతు బలిచక్రవర్తి.. తాను బలైపోతాడు గానీ, మరొకరిని బలి తీసుకోడు. రైతు శిబి చక్రవర్తి.. తన తొడ కోసి దానం చేస్తాడు గాని ఎవర్నీ యాచించడు! రైతు కర్ణుడు.. మారు వేషంలో వచ్చి అడిగితే, కవచ కుండలాలు దానం చేశాడు. ఆ విధంగా, ఈ నూతన అమరావతి రైతులు, కూలీలు, ఇతర వృత్తుల వారు ధన్యులు. ఇదే పుణ్యలోకం! ఒకవేళ భగవంతుడు ఆయువులను తీసేస్తే, ఇంతకన్నా పుణ్యలోకం మరొకటి ఉందేమో! ఇంటికి వెళ్లి తాళపత్ర గ్రంథాలు పరిశీలించి చెబుతాను”( చప్పట్లు)
సభాధ్యక్షుడు లేచి” పండితుల వారి ప్రవచనం మనకొక దిశానిర్దేశం. మన రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ( చిన్న నవ్వుతో) వారికి దాని గుర్తుగా ఒక బంగారు రింగ్ తో ఘనసత్కారం ఏర్పాటు చేద్దాం”( చప్పట్లు)
” ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వేదిక మీదకు రావచ్చు.”
అప్పటికే, టైం మధ్యాహ్నం రెండయింది. ఎక్కువమంది సెల్ ఫోన్లలో, వాచీల్లో చూసుకొని అసహనంగా ఉన్నారు.
” చాలా దూరం నుంచి, మారు మూల నుంచి వచ్చారు.. ఉత్తరాంధ్ర ప్రతినిధులు ‌.. ఎవరో ఒకరు రండి! ” సాదరంగా ఆహ్వానించాడు నారాయణమూర్తి.
అనకాపల్లి తారాజువ్వలాగా, దూసుకొచ్చాడు పరదేశి. అందరికీ, వంగి వంగి దండాలు పెట్టి–
” అయ్యా! నేను పామరుడ్ని.. పాటలు.. మాటలు తప్ప ప్రెసంగం తెలీదు. నాకొక గొప్ప బాధ ఉంది. మీలాటి పెద్దలు మల్లా ఎప్పుడు దొరుకుతారు? నా మనుసులో మాట.. మా నాయుడుకీ తెలీదు.. అదేటంటే.. మా వొయిజాగు లో రెండు గాజువాకలున్నాయి. పాత గాజువాక.. కొత్త గాజువాక! మన దేశం రాజధాని పాత ఢిల్లీ.. కొత్త ఢిల్లీ! గుంటూరు దగ్గర ఆ నాయుడుగారి అమరావతి ఉండగా, మన కొత్త నాయుడిగోరి రాజధానికి అదే పేరు ఎందుకు? గ్రేమ సచివాలయాలకు స్వర్ణ సచివాలయాలని పేరెట్టారు. మనమెలాగైనా, ఈ ఆంధ్రని.. స్వర్ణాంధ్ర సేసేస్తాం. మరి దీనికి, స్వర్ణ అమరావతి అని పేరు పెట్టొచ్చు కదా! పేరెట్టీసినంతమాత్రాన.. బంగారంతో గోడలు కట్టేస్తామేటీ? ఆ రంగులో బోర్డులు తయారుసేసేస్తాం. ఆలోసించండి పెద్ద బుర్రల్లారా!”– అని గడగడా మాట్లాడేసి, గబగబా దిగిపోయాడు.( చప్పట్లు )
పరదేశి ప్రతిపాదన అందరికి నచ్చినట్టే ఉందని దశమంత నాయుడు లోలోపల సంబరపడిపోయాడు.

-‘ నల్లి ‘ కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్