ఒమన్ తీరం లోని చమురు నౌక పై క్షిపణి దాడి చేసి ముగ్గురు భారత నావికుల్ని పొట్టనబెట్టుకున్న అమెరికా దుశ్చర్య గర్హనీయం. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో ఒకరైన పట్నాల సురేష్ విశాఖ వాసి కావడం మరింత బాధాకరం. వీరు పౌర నావికులే తప్ప సైనికులు కారు. ఈ ఘటన పౌర నౌకాయానానికి పెరుగుతున్న ప్రమాదానికి హెచ్చరిక. ఆ నౌకలో ఇరాన్ చమురు రవాణా చేయడంలేదని దాని యజమానులు స్పష్టం చేసినా ఇరాన్ నుండి చమురు కొన్నారన్న నెపం మోపి అమెరికా దాడికి పాల్పడడం దురహంకారానికి నిదర్శనం. భారత వాణిజ్య నౌకలపై అమెరికా నావికాదళం ఈ వారం రోజుల్లోనే మూడుసార్లు దాడి చేసింది. ఘనత వహించిన నరేంద్ర మోడీ సర్కారు అమెరికా ఆంక్షలకు లోబడి ఉన్నప్పటికీ భారత నౌకలపై దాడి చేయడం భారత్ పట్ల ట్రంప్ సర్కారుకు ఎంత చిన్నచూపో విదితమవుతోంది. మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా ముగ్గురు నావికుల్ని బలి తీసుకున్న అమెరికా ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం లొంగుబాటు వైఖరి ప్రదర్శించడం అవమానకరం. పశ్చిమాసియాలో అమెరికా దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ దాడికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా భారత ప్రభుత్వం వ్యవహరించాలి. అమెరికా ఇజ్రాయిల్ సాగిస్తున్న దుర్మార్గాలను శాంతికాముకులు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలనే ప్రతి ఒక్కరూ ఖండించాలి.
భారత నావికులున్న నౌకపై అమెరికా దళాలు చేసిన దాడి పై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరపాలి. సంఘర్షణ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, వాణిజ్య నౌకలకు పటిష్టమైన నావికాదళ రక్షణ, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సి ఐ టి యు సహా వివిధ సంస్థలు చేస్తున్న డిమాండ్ సబబైనది. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, నౌకా యజమానులు, అలాగే నావికుల సంఘాలతో శాశ్వత సంక్షోభ నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ దాడిలో చనిపోయిన నావికా సిబ్బంది కుటుంబాలకు పరిహారం, బీమా మొత్తాన్ని సకాలంలో అందించి, వారిపై ఆధారపడిన వారికి శాశ్వత ఉపాధి కల్పించాలి. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న నావికులకు తప్పనిసరి యుద్ధ-ప్రమాద భత్యం, మెరుగైన బీమా కవరేజీని అందించాలి. సురక్షిత సముద్ర మార్గాలను ఏర్పాటు చేయడం, సంఘర్షణ ప్రభావిత జలాల్లో ప్రయాణాలను సమీక్షించడం, వాణిజ్య నౌకాయానం, పౌర నావికులను రక్షించడానికి అంతర్జాతీయ వేదికలపై బలమైన దౌత్యపరమైన చర్యలు చేపట్టడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. లేకపోతె మన నావికులకు భద్రత ఉండదు.
పశ్చిమాసియా లో అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం మూలంగా భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇంధన సంక్షోభం పర్యవసానంగా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. కాబట్టి ఈ యుద్ధాన్ని, అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధ కాంక్షను యావత్ ప్రపంచం వ్యతిరేకించాలి. కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం అమెరికాకు జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తూ దాని దురాగతాల్ని వివిధ సందర్భాల్లో వెనకేసుకు రావడం దారుణం. మనకు చౌకగా చమురు గ్యాస్ సరఫరా చేసిన దీర్ఘ కాల మిత్ర దేశం ఇరాన్ తో సంబంధాలు చెడగొట్టుకోవడంతో సహా పలు దౌత్య వైఫల్యాలకు పాల్పడింది.
అయినా తాజాగా అమెరికా మన నావికులపై చేసిన దాడిని ఇరాన్ ఖండించి మిత్రత్వాన్ని చాటుకుంది. దేశం ఇంధన సంక్షోభంలో చిక్కుకోవడం మోడీ ప్రభుత్వ స్వయంకృతాపరాధమేనన్న ఆర్థిక నిపుణుల మాట ప్రత్యక్షర సత్యం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మార్చుకొని భారత సార్వభౌమత్వాన్ని సమున్నతంగా నిలపాలి. అందుకోసం ప్రజల నుండి ఒత్తిడి పెరగాలి. ఆ దిశగా ప్రగతికాముక శక్తులు కృషి చేయాలి. అమెరికా, ఇజ్రాయిల్ తో సహా వివిధ దేశాల్లో సాగుతున్న యుద్ధ వ్యతిరేక వాతావరణం భారత్ లో అభివృద్ధి కావాలి.
ఎంత దారుణం..!
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 13, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)