ప్రజాశక్తి-గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శనివారం తెల్లవారుజామున ఎటిఎమ్ చోరీ యత్నం విఫలమైంది. పట్టణంలోని ప్రముఖ కేంద్రమైన ట్రావెలర్స్ బంగ్లా సర్కిల్ సమీపంలో ఉన్న ఎస్‌బిఐ ఎటిఎమ్ లక్ష్యంగా చోరికి దుండగులు యత్నించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి.. ఎటిఎమ్ మిషన్ను పూర్తిగా పెకలించి వాహనంలో వేసుకుని తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎటిఎమ్ సెంటర్ కు ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమై పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దీంతో సమీపంలోని ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు. బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసేసరికి దుండగులు పెకలించిన ఏటీఎం మిషన్ను అక్కడే వదిలేసి, తమ బొలెరో వాహనంలో పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఆ సమయంలో ఏటీఎం మిషన్‌లో సుమారు రూ. 3 లక్షల రూపాయల నగదు ఉందని తెలిపారు. యజమాని అప్రమత్తత వల్ల ఆ క్యాష్ అంతా సురక్షితంగా మిగిలిందని అధికారులు తెలిపారు. ఎటిఎం కేంద్రంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించి, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన సర్కిల్‌లోనే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
గుంతకల్లులో ఏటీఎం చోరీకి యత్నం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 13, 2026, 08:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)