test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరాచకం

08 మే, 2026

west
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 08, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాతి క్షణం నుంచి పశ్చిమ బెంగాల్లో సంఘపరివార శక్తులూ, కేరళలో కాంగ్రెస్ గూండాలూ సాగిస్తున్న హింసాకాండ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. అధికారంలోకి వస్తే ఏమైనా చేయవచ్చుననే అరాచక ప్రవృత్తిని నిర్భయంగా, నిస్సిగ్గుగా వెల్లడిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రమైన విషాన్ని, విద్వేషాన్ని వెళ్లగక్కే నాయకుల అక్కసుకు, అప్రజాస్వామిక ప్రవర్తనకూ తగ్గట్టుగానే- ఆ పార్టీలు పెంచిపోషిస్తున్న అరాచక మూకస్వామ్యం రాజ్యాంగ స్ఫూర్తికి పెను సవాలు. ఈ గూండాగిరి, హింసా ప్రవృత్తి ప్రజాస్వామిక విలువలకు గొడ్డలిపెట్టు. పగ, ప్రతీకార రాజకీయాలు చేసే దాడి కేవలం తమకు ఇష్టం లేని రాజకీయ పక్షాల మీద చేసే దాడి మాత్రమే కాదు; నాగరిక సమాజం మీదా, మానవీయ ప్రవర్తన మీదా చేసే దాడి కూడా!
తమకు అనుకూలంగా ఫలితాలు వెలువడ్డ మరుక్షణం నుంచే పశ్చిమ బెంగాల్లో బిజెపి అరాచక శక్తుల స్వైరవిహారం మొదలైంది! ఎన్నికల నిర్వహణకు కేంద్రం నుంచి దించిన వేలాది మంది పోలీసులు ఇంకా విధుల్లో ఉండగానే, వీధుల్లో హింసాకాండ మొదలైంది. సిపిఎం కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తల ఇళ్లూ లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. కార్యాలయాల కూల్చివేతలు, కాల్చివేతలు, దురాక్రమణలూ యథేచ్ఛగా సాగాయి. ముర్షిదాబాద్‌లో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాల పైనా దాడులు, దహనాలూ జరిగాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు కళ్లప్పగించి చూశారు తప్ప ఎక్కడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. డోమ్‌కల్‌లో పనిప్రదేశం నుంచి ఇంటికొస్తున్న సిపిఎం కార్యకర్త షఫీకుల్ ఇస్లాంపై తాజాగా బిజెపి తీర్థం పుచ్చుకున్న తృణమూల్ గూండాలు కాల్పులకు బరితెగించారు. అక్కడ సిపిఎం అభ్యర్థి గెలుపును జీర్ణించుకోలేక, భౌతికదాడులకు దిగారు. కేరళలో కాంగ్రెస్, ఐయుఎంఎల్‌ మూకలు కూడా సిపిఎం కార్యాలయాలపై దాడులకు తెగబడ్డాయి. పాలక్కాడ్‌లోని కార్యాలయంలోకి బాంబులు విసిరి, విధ్వంసానికి పాల్పడ్డాయి.
2011లో బెంగాల్‌లో అధికారంలోకి వచ్చాక తృణమూల్ కాంగ్రెస్ … సిపిఎం కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై, కార్యకర్తల నివాసాలపై, ఆస్తులపై ఇలాంటి దౌర్జన్యాలకే పాల్పడింది. వేలాదిమంది కార్యకర్తలను, సానుభూతిపరులను గ్రామాల నుంచి వెళ్లగొట్టి, తీవ్ర అరాచకం సృష్టించింది. త్రిపురలో 2018లో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక- దాడులూ, దౌర్జన్యాలూ నిరాటంకంగా సాగాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి కూడా వీల్లేని బీభత్సకాండ అనేక సందర్భాల్లో సాగింది. వామపక్షాల కార్యకర్తలను బెదిరించటం, పోలింగ్ బూత్‌ల నుంచి వెళ్లగొట్టటం యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. సుపరిపాలన గురించి సుదీర్ఘమైన ఉపన్యాసాలు దంచే ప్రధాని మోడీ హయాంలోనే ఈ దుర్మార్గం నడుస్తూ ఉంది. కేరళలో 2000-2017 మధ్య బిజెపి, సంఘ్ పరివార శక్తులు 85 మంది సిపిఎం కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాయి. కాంగ్రెస్, ముస్లింలీగ్ అరాచకవాదులు కూడా దాడులకు, దౌర్జన్యాలకు దిగటం పరిపాటి అయింది. 1972లో బెంగాల్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పాలకులు అర్ధ ఫాసిస్టు బీభత్సకాండ సాగించారు. 1200 మందికి పైగా సిపిఎం కార్యకర్తలను బలిగొన్నారు.
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఒకసారి ప్రజాదరణ పొంది, అధికారంలోకి వచ్చిన పార్టీ మరొకసారి ప్రజాతీర్పుతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుంది. అధికారమే శాశ్వతమనుకొని, పగ, ప్రతీకారాల పేరిట గూండాగిరి చెలాయించటం ప్రజాస్వామ్యానికి తలవొంపులు తెస్తుంది. తాము తప్ప అందరూ దేశద్రోహులే అనేంత బరితెగింపుతో బిజెపి, దాని పరివారశక్తులూ పార్టీలను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం ఇటీవల కాలంలో పెరిగింది. అది పెంచిపోషిస్తున్న విద్వేష, విభజన రాజకీయాలు భారతీయ సహజీవన సంస్కృతికి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. ఈ ధూర్త ప్రవర్తనను, దుష్టనీతినీ ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అరాచక శక్తులకు అండగా నిలుస్తున్న అధికార పార్టీల తీరును ఎండగట్టాలి. నూతన ప్రభుత్వాలు ఏర్పడటానికి ముందు జరుగుతున్న ఈ బీభత్సకాండకు ఎన్నికల సంఘానిదే నైతిక బాధ్యత. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను అప్రమత్తం చేసి, అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్