కాంగ్రెస్ – బిజెపి రెండూ కూడబలుక్కొని కేరళంలో సిపిఎం ప్రతిష్టను దెబ్బతీయటానికి బరి తెగించాయి. ఎన్నికలకు ముందు ఇడి నోటీసులు ఇవ్వటంతో మొదలైన రాజకీయ కుట్ర, బుధవారం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అద్దె ఇంటిపై దాడులకు తెగబడడం దాకా విస్తరించింది. దేశంలో ప్రతిపక్ష పార్టీలపైనా, నాయకులపైనా అవినీతి ఆరోపణలు గుప్పించడం, ఆ తరువాత తన గుప్పిట్లో పెట్టుకున్న దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయించడం కేంద్రంలోని మోడీ-షా ప్రభుత్వం చాలాకాలంగా అనుసరిస్తున్న మోసకారి మూస నమూనా! ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ల మీద సాగించిన దాష్టీకం, ఆ కేసుల్లో నిజం లేదని కోర్టుల్లో నిర్దోషిత్వం రుజువు కావడం దేశ ప్రజల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. తరువాతి కాలంలో నిజం ఏమిటో జనానికి తెలిసినా పర్లేదు; ఈలోగా అవినీతి పంకిలం అంటించి రాజకీయ లబ్ధి పొందాలనే బిజెపి కుట్రపూరిత వ్యూహం అత్యంత దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, మానవీయ విలువలకు తీరని కళంకం!
అవినీతితోనూ, అవినీతిపరులతోనూ నిండా మునిగిపోయిన బిజెపికి అవకతవకలపై విచారణో, విలువల పరిరక్షణో ప్రాధాన్య అంశం కాదు. ఆ పేరుతో ఆయా పార్టీలను, నాయకులను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం, తాను చేపట్టే ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై నోరెత్తకుండా చూసుకోవటం కీలకమైన విషయం! అందుకోసం సిబిఐ, ఇడి, ఐటి, ఎన్ఐఎ వంటి ప్రభుత్వ సంస్థలను తన పెంపుడు చిలకలుగా మార్చుకొంది. నిండా అవినీతిలో కూరుకుపోయిన ఇతర పార్టీల నాయకులు జీ హుజుర్ అంటూ కాషాయ పార్టీ కండువా కప్పుకుంటే కేసులన్నీ అటకెక్కుతున్నాయి. అవినీతి బురద మొత్తం ఎటో కొట్టుకుపోతోంది. అవినీతిపరులకు అండదండలిచ్చిన బిజెపి పాలకుల నీతిమాలిన దృష్టాంతాలు గడిచిన పన్నెండేళ్లలో కోకొల్లలు! అత్యంత ప్రమాదకరమూ, నీతిబాహ్యమూ అయిన ఈ ధోరణి దేశానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
పాలనను ఒక బాధ్యతగా భావించే సిపిఎం పారదర్శకతను ఒక ప్రామాణికంగా తీసుకొని పనిచేస్తుంది. అవినీతికి ఆమడదూరంలో ఉంటుంది. అలాంటి పార్టీ పైనా, పాలన పైనా ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించడం, జరిగిన అభివృద్ధిని మరుగునపర్చి, జరగని అవకతవకలను నేతలకు అంటగట్టడం కేరళంలో కాంగ్రెస్ – బిజెపి ఒక వ్యూహం ప్రకారం చేస్తూ వచ్చాయి. మసాలా బాండ్ల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌కు ఇడి నోటీసులు ఇచ్చింది. విజయన్ కుమార్తె నిర్వహణలోని సంస్థ అందించిన సేవల నిమిత్తం పొందిన ప్రతిఫలాన్ని వివాదాస్పదం చేసి, మనీ లాండరింగ్ సెక్షన్లు బనాయించింది. ఎన్నికల్లో వాటిని ప్రచారాస్త్రాలుగా వాడాలనేది వారి దుర్మార్గపు ఎత్తుగడ. రాహుల్ గాంధీ ఇంకో రెండడుగులు ముందుకేసి, పినరయి విజయన్‌ను ఎందుకు అరెస్టు చేయరంటూ ప్రశ్నించాడు! కేరళంలో అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచి ఒకపక్క కాంగ్రెస్, మరోపక్క సంఘ్ పరివార్ శక్తులూ సిపిఎంపై దాడులకు తెగబడ్డాయి. దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ – బిజెపి రెండూ కుమ్మక్కై కుటిల రాజకీయానికి పాల్పడడం ద్వారా వాటి నిజరూపం ఏమిటో వెల్లడి చేసుకున్నాయి.
కమ్యూనిస్టు పార్టీని అంతం చేయాలని, కుతంత్రాలతో అడ్డుకోవాలని దేశంలో ఎర్రజెండా పుట్టుక నుంచే విఫలయత్నాలు జరిగాయి. పెషావర్, మీరట్ కుట్ర కేసులు మొదలుకొని, తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో నిషేధం దాకా, కేరళలో ఏర్పడ్డ మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేయడం, పశ్చిమ బెంగాల్‌లో 1972 – 77 మధ్య అర్ధ ఫాసిస్టు బీభత్సకాండ వరకూ పాలకులు చేపట్టిన నిర్బంధాలూ, నిషేధాలూ, కేసులూ, కుట్రలూ అనేకం. కమ్యూనిస్టు పార్టీ వాటన్నింటినీ అధిగమిస్తూ పురోగమించింది. ప్రజల పక్షాన నికరంగా నిలబడి, ఆ ప్రజల అండతోనే ఎన్నో విజయాలు సాధించింది. ఇప్పుడు కేరళంలో కాంగ్రెస్ – బిజెపి ఉమ్మడిగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని, దుర్మార్గ దాడులను, కేసులను ఆ విధంగానే ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఎక్కడా, ఎప్పుడూ బెదిరింపులకు, కేసులకు తలవొంచకుండా ముందుకు సాగుతుంది. విలువలకు నిలబడుతుంది. ఎలాంటి కుట్రలూ, కుతంత్రాలనైనా ప్రజల మద్దతుతో తిప్పికొడుతుంది. విజయన్ ఇంటిపై కుట్రపూరిత దాడుల గురించి తెలిసిన వెంటనే దేశమంతా వెల్లువెత్తిన నిరసనలే ఎర్రజెండా పట్ల ప్రజల నమ్మకానికి నిదర్శనం. కుమ్మక్కు పార్టీల కుట్రలూ, కుత్సితాలూ సిపిఎం నీతీ నిజాయితీ ముందు కుప్పకూలక తప్పదు!
Print Editionకుట్రపూరిత దాడి!
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 29, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)