దేశాన్ని షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) విస్ఫోటనం ఇక్కడి యువతలో, ముఖ్యంగా నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న నిరసనాగ్నికి ప్రతిరూపం. కాగా సిజెపి ఎత్తుకున్న సోషల్ మీడియా ఉద్యమం లావాలా ఎగసిపడుతుండటం, తక్కువ సమయంలోనే అత్యధిక ఫాలోవర్లతో సంచలనం కలిగించడం పట్ల కేంద్రంలో పాలక బిజెపికి గంగవెర్రులెత్తుతోంది. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను చంపేస్తామంటూ బెదిరింపులు, ఆ పార్టీ అధికారిక వెబ్‌సైట్ తొలగింపు, ఎక్స్ ఖాతా నిలిపివేత, ఇన్‌స్టాగ్రాం హ్యాకింగ్ వంటివి చకచకా జరిగిపోవడానికి వెనుక కేంద్ర బిజెపి జోక్యం కనిపిస్తుంది. ఒక విద్యార్థి నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఉద్యమానికి మోడీ ప్రభుత్వం ఎంతగానో భయపడుతోందని ఈ చర్యలు రూఢి పరుస్తున్నాయి. వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ, పార్టీగా బిజెపి సోషల్ మీడియా ద్వారానే అమిత ప్రచారం పొంది అధికారంలోకొచ్చారన్నది జగద్విదితం. విద్వేషాలను ఆ వేదికలుగానే రెచ్చగొట్టాయి. సోషల్ మీడియాను అంతగా ఉపయోగపెట్టుకున్న బిజెపి నిరసనలన్నా, ప్రశ్నించడమన్నా తట్టుకోలేదు. అందుకే సోషల్ మీడియాకు హద్దులు కావాలని కోరుకుంటోంది. అందులో భాగంగా సిజెపి ప్రచారాన్ని అణచివేత, నిర్బంధాలతో నియంత్రిస్తోంది. సిజెపి సోషల్ మీడియా ఖాతాల స్తంభన రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్య హననం. భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం. అందుకే కేంద్రం చర్యలపై ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తలు, సోషయల్ మీడియా యాక్టివిస్టులు, యువత నుంచి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఈ నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నిరుద్యోగులను బొద్దింకలు (కాక్రోచ్)తో పోల్చుతూ వ్యాఖ్యానించిన 48 గంటల్లో బోస్టన్‌లో చదువుతున్న అభిజీత్ సిజెపి పేరిట సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ (వ్యంగ్య) పోస్టులతో ఉద్యమం లేవదీశారు. నిరుద్యోగం, ప్రభుత్వాల విధానాల లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ధనవంతులు, కుటుంబ నేపథ్యం, విద్రోహ ప్రసంగాలను నిరసించారు. కొన్ని రోజుల్లోనే ఆ ఉద్యమానికి దేశంలోని యువత లక్షల్లో ఆకర్షితులయ్యారు. సిజెపి ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య వారం రోజుల్లోనే రెండు కోట్లకు చేరడాన్ని బట్టి యువతలో, నిరుద్యోగుల్లో అసంతృప్తి, నిరసన, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బెంబేలెత్తిన మోడీ ప్రభుత్వం సిజెపి ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. తనకు ఇష్టం లేని వారిపై జాతి వ్యతిరేకులుగా పాకిస్తాన్, చైనా ఏజెంట్లుగా ముద్ర వేయడం బిజెపి, పరివారానికి అలవాటే. సిజెపిపైనా అదే అస్ర్తం ప్రయోగించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. సిజెపిపైనా, అభిజీత్‌పై పాక్ ముద్ర వేశారు. ఆ పార్టీ ఫాలోవర్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వారుగా హిందూ మతోన్మాద పడిగట్టు పదాలతో వాక్చాపల్యానికి పోయారు. దానికి అభిజిత్ ఆధారాలతో సహా తిప్పికొట్టారు. తన ఫాలోవర్లలో 94 శాతం ఇండియా వారేనని భౌగోళిక సమాచారాన్ని వెల్లడించి బిజెపి ప్రభుత్వానికి కంగు తినిపించారు. అయినాసరే, నిరసన గొంతు నొక్కేందుకే బిజెపి సర్కార్ ఉపక్రమించడం ద్వారా ప్రజాస్వామిక హక్కులను కాలరాసేందుకే నిర్ణయించుకోవడం ఆందోళనకరం.
బిజెపి పుష్కరకాల ఏలుబడిలో నిరుద్యోగం ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు బద్దలు కొడుతోంది. అధికారంలోకి రాకముందు మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చి మాట తప్పారు. మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటివి నిరుద్యోగులను వెక్కిరిస్తున్నాయి. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎఫ్‌డిఐలు, పెట్టుబడులు కార్పొరేట్లకే లాభిస్తున్నాయి. వాళ్ల కోసమే లేబర్ కోడ్లు. ప్రభుత్వరంగంలో కొత్త రిక్రూట్‌మెంట్‌లు లేవు. డిజిల్ పేరిట ఉద్యోగాలు రద్దవుతున్నాయి. అవినీతి, నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వంటివి సరేసరి. ఈ విధానాలపై యువతలో, నిరుద్యోగుల్లో అసహనం తీవ్రమవుతోంది. సిజెపి రేపిన సంచలనం సారాంశం ఇదే.
యువత నిరసన
26 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 26, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)