test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గరళ జలం

28 మే, 2026

godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 11:26 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి నది కాలుష్యంపై తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తెలుగు ప్రజల జీవనాడులుగా ప్రసిద్ధికెక్కిన గోదావరి, కృష్ణా నదులు కాలుష్యం కాటుకు గురవుతున్న తీరుపై ఆందోళనలు వ్యక్తం కావడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే ఎన్నో నివేదికలు ఆ విషయాన్ని ఎత్తి చూపాయి. పర్యావరణవేత్తలు ఎన్నో సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. అయినా, ప్రభుత్వ యంత్రాంగంలో ఇప్పటి వరకు చలనం లేదు. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ స్వయంగా స్పందించడంతో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. నిజానికి మానవ నాగరికత నదీ తీరాల ఒడ్డునే అభివృద్ధి చెందింది. సింధు నాగరికత నుంచి నైలు, టైగ్రిస్‌, యూఫ్రటిస్‌, గంగా ఇలా ప్రపంచ చరిత్ర అంతా నదుల చుట్టూనే తిరిగింది. నీరు ఉన్న చోటే మనిషి స్థిరపడ్డాడు. వ్యవసాయం పుట్టింది. పట్టణాలు ఏర్పడ్డాయి. సంస్కృతులు వికసించాయి. కానీ ఇప్పుడు అవే నాగరికతలు పరిశ్రమలు, నగరాల రూపంలో, నియంత్రణలేని వినియోగ సంస్కృతి రూపంలో నదులను మురుగుకాలువలుగా మార్చేస్తున్నాయి. గోదావరి, కృష్ణాలు కూడా దీనికి మినహాయింపు కాదు. ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి గోదావరిలో కలుస్తున్న కాలుష్య జలాలను చూసి పవన్ కల్యాణ్ నిశ్చేష్టులైనట్లు వార్తలు వచ్చాయి. అదొక్కటే కాదు. రాజమహేంద్రవరం నుంచి ధవళేశ్వరం వరకు గోదావరిలో పెరుగుతున్న జీవ, రసాయన ఆమ్లజనులు (బిఒడి) పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు, కెజి బేసిన్ ఆయిల్ అండ్ గ్యాస్ కాలుష్యం, కాకినాడ పారిశ్రామిక వాడ వ్యర్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరిని విషతుల్యంగా మారుస్తున్నవి ఎన్నో! ఫలితంగా ఇప్పటకే కొరింగా మడ అడవుల ఉనికి ప్రశార్ధకంగా మారింది. చేపల జాతులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. నది, సముద్ర సంగమ ప్రాంత జీవావరణ (ఎస్ట్యూరి ఎకాలజీ)సమతుల్యం దెబ్బతింటోంది.
​కృష్ణా నదిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న హైదరాబాద్‌, విజయవాడ, పరిసర పట్టణాలు, పరిశ్రమలు, కృష్ణా నీటి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) నివేదికలు పలుమార్లు హెచ్చరించాయి. మూసీ నది ద్వారా భారీ పరిమాణంలో మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కృష్ణాలో కలుస్తున్నాయి. అదే నీరు చివరకు కృష్ణాలో కలుస్తోంది. విజయవాడ, గుంటూరు వంటి నగరాలు తాగునీటి కోసం కృష్ణాపైనే ఆధారపడుతున్నాయి. ఇదే పరిస్థితి గోదావరి తీర పట్టణాల్లో కూడా ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం వంటి పట్టణాల ప్రజలు గోదావరి, దాని ఉప నదుల నీటినే తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కలుషిత నీరు సరఫరా అయితే ప్రజల్లో చర్మవ్యాధులు, జీర్ణాశయ సమస్యలు, కలరా, టైఫాయిడ్‌, హెపటైటిస్‌, కిడ్నీ సమస్యలు, చివరకు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందువల్ల నదులను కాపాడటమన్నది కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాదు. అది ప్రజారోగ్యం, ఆహార భద్రత, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ, జీవ వైవిధ్యం, తాగునీటి భద్రత మొదలైన వాటితో ముడిపడిన అత్యంత కీలకమైన అంశం.
​పవన్ కల్యాణ్ పర్యటన తరువాత ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని గోదావరి నదికి, పుష్కరాలకు మాత్రమే పరిమితం చేసింది. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేవలం పుష్కరాలకొచ్చే యాత్రికుల కోసమే కాదు. నదుల తీర ప్రాంతంలో నివసించే కోట్లాదిమంది ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత చర్యలు చేపట్టాలి. వాటిలో భాగంగా మురుగుజలాలను నదుల్లో కలవకుండా, పూర్తి స్థాయి ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి, ప్రత్యేక పైపు లైన్ల ద్వారా ఆ నీటిని ప్రజల తాగునీటేతర అవసరాలకు సరఫరా చేయాలి. కాలుష్యాలను నదుల్లోకి వదలకుండా పరిశ్రమలపై కఠిన పర్యవేక్షణ ఉంచాలి. ప్రమాదకర వ్యర్థాలను నదిలో కలపకుండా నియంత్రించాలి. అవసరమైన చోట ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ జోన్లను ఏర్పాటు చేయాలి. మడ అడవుల పునరుద్ధరణ, చిత్తడి నేలలు, నది బఫర్ జోన్ల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అప్పడే నదులు కేవలం నీటి వనరులుగా కాకుండా నిజమైన జీవనాడులుగా భావి తరాలకు అందుతాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్