test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సవాళ్ల మధ్య మరింత ముందుకు …

22 మే, 2026

election review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 08:16 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ రంగంలో పలు మార్పులను సూచిస్తున్నాయి. మొదటిది, కేరళంలో వామపక్ష ప్రజాతంత్ర ( ఎల్‌.డి.ఎఫ్ ) ప్రభుత్వం చారిత్రాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ఓటమిని చవిచూడటం మన వైపు నుండి తీవ్ర ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. రెండవది, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి విజయం, అసోంలో మళ్లీ అధికారం చేపట్టడం, పుదుచ్చేరిలో ఎన్.డి.ఎ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరచడం బిజెపి ఎన్నికల వ్యూహాత్మక బలాన్ని నొక్కి చెబుతున్నాయి. మూడవది, తమిళనాడులో టి.వి.కె వంటి సరికొత్త పార్టీ ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే అనూహ్య విజయం సాధించడం ప్రజలు ఒక సానుకూల మార్పు కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారనే వాస్తవానికి అద్దం పడుతోంది.

కేరళం​

కేరళం విషయానికి వస్తే, అధికారం కోల్పోయిన ఎల్‌.డి.ఎఫ్ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన దాదాపు అన్ని వాగ్దానాలను అమలు చేయగలిగింది. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడం, సామాజిక భద్రతా పింఛన్లను అందరికీ వర్తింపజేయడం ద్వారా సంక్షేమ రంగంలో ఈ ప్రభుత్వం దేశానికే ఒక మార్గదర్శిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆర్థిక, పరిపాలనాపరమైన ఆంక్షల నడుమ కూడా, వ్యవసాయ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రాష్ట్రం భారీ పురోగతిని సాధించింది. మన దేశ సమాఖ్య స్ఫూర్తిని రక్షించే పోరాటంలో ఎల్‌.డి.ఎఫ్ ప్రభుత్వ హయాంలో కేరళం దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామిగా నిలిచింది. గత పదేళ్లలో దేశంలో ఒక్క మతపరమైన హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోని ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది. అయినప్పటికీ దశాబ్ద కాలం అధికారంలో ఉన్న ఎల్‌.డి.ఎఫ్ ఓటమి చవి చూసింది.
అలాగే, కేరళం చరిత్రలో మొదటిసారిగా బిజెపి అసెంబ్లీలో మూడు స్థానాలను గెలుచుకోగలిగింది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం, దీనిని అడ్డుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుంది. అయితే, మతతత్వ శక్తుల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, మెతక ధోరణి ఈ రెండూ కేరళంలో బిజెపి ఎదుగుదలకు దారి తీశాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అంశాన్ని కచ్చితంగా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ ఎన్నికల్లో సి.పి.ఎం-ఎల్‌.డి.ఎఫ్ అనూహ్యంగా ఎదురుదెబ్బ తిన్నాయి. 5 జిల్లాల్లో ఎల్‌.డి.ఎఫ్ తరపున ఒక్క ప్రతినిధి కూడా ఎన్నిక కాలేదు. 1977లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా దేశమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు, కేరళం ప్రజలు కాంగ్రెస్ కూటమిని తిరిగి అధికారంలోకి తెచ్చారు. అప్పట్లో సిపిఎం నేతృత్వంలోని ప్రతిపక్షానికి అసెంబ్లీలో 30 కంటే తక్కువ సీట్లు వచ్చాయి. లోక్‌సభలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ 1980లో మనం మళ్లీ బలం పుంజుకోగలిగాము.

పార్టీకి చెందిన 5 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులం

దరినీ చేరుకోవడానికి కేరళ రాష్ట్ర కమిటీ నిర్మాణపరమైన ప్రణాళికను రూపొందించింది. 35,000 కంటే ఎక్కువ శాఖలు, స్థానిక కమిటీలు, ఏరియా కమిటీలు, జిల్లా కమిటీలలో భాగమైన వారందరినీ కలిసి, పార్టీ సానుభూతిపరులు, ఎల్‌.డి.ఎఫ్ మద్దతుదారులలోని కొన్ని తరగతుల ప్రజానీకం మనకు ఎందుకు ఓటు వేయలేదనే దానిపై లోతైన చర్చలు జరుపుతాయి. మొత్తం పార్టీ సభ్యత్వం, సానుభూతిపరులు ఈ చర్చల ద్వారా పొరబాట్లను సరిదిద్దుకోవడానికి, దిశా నిర్దేశం చేసుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించాం. పైనుండి కింది స్థాయి వరకు మన లోపాలపై విమర్శ, ఆత్మవిమర్శతో కూడిన చర్చలు జరగాలని ఆశిస్తున్నాము. అన్ని స్థాయిలలోనూ దిద్దుబాటు చర్యలు చేపట్టబడతాయి.

అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్

అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లలో బిజెపి గెలుపు హిందుత్వ-మతతత్వ, మితవాద శక్తుల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇది లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులన్నింటికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయం. పశ్చిమ బెంగాల్‌లో, అవినీతిమయమైన తృణమూల్ కాంగ్రెస్ (టి.యం.సి) ప్రభుత్వంపై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ పరిధి లోని సంస్థల దుర్వినియోగం, అలాగే ఎన్నికల కమిషన్‌ కుతంత్రాలు, ఎస్.ఐ.ఆర్ (సర్‌) ప్రక్రియ ల ద్వారా బిజెపి లబ్ధి పొందింది. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో బిజెపి మతపరమైన విభజన, విద్వేషపూరిత ప్రచారాల ద్వారా విజయం సాధించింది. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా డబ్బు కుమ్మరించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ మన ఓట్ల శాతాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఒక శాసనసభా స్థానాన్ని గెలుచుకున్నాము. కాబట్టి, కార్మికుల హక్కులు, లౌకికవాదం, సమాఖ్య స్ఫూర్తిని రక్షించడంలో సిపిఎం స్వరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మళ్లీ వినబడుతుంది.

తమిళనాడు

తమిళనాడులో, సిపిఎం నాయకత్వంలోని వామపక్షాల సమయానుకూల జోక్యం ద్వారా… ప్రజల తీర్పును తారుమారు చేయాలనే బిజెపి ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమికి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరించడం మనం చూశాం. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బిజెపి తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ఎఐఎడిఎంకె నాయకత్వంలో ఇతర చిన్నా చితకా పార్టీలతో ఒక అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసి, ఆర్ఎస్ఎస్‌కు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరిగాయి. అతి పెద్ద పార్టీ నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పలుమార్లు కలిసినప్పటికీ, అతనితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ వెనుకాడటం వంటి పరిణామాల వెలుగులోనే చూడవలసి ఉంటుంది. అందువల్ల, తమిళనాడులో బిజెపి ఉన్న ఏ కూటమి కూడా అధికారంలోకి రాకుండా చూడటం, రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లకుండా నిరోధించడం అత్యవసరంగా సిపిఎం భావించింది. ఎందుకంటే రాష్ట్రపతి పాలన అంటే బిజెపి ప్రత్యక్ష పాలనే.

పొదుపు చర్యలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధానమంత్రి పొదుపు చర్యలను ప్రకటించడం, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, సురక్షితంగా ఉందంటూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేపదే చేస్తున్న వాదనల లోగుట్టును బట్టబయలు చేస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలు తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారి తీసే పరిస్థితి నెలకొని ఉన్నది. వినియోగాన్ని తగ్గించుకోవాలని, పొదుపును పాటించాలని సాధారణ ప్రజల పై భారం వేసే బదులు, అమెరికా తన సైనిక దురాక్రమణను నిలిపివేయాలని, హర్మూజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా రవాణా సాగేలా చూడాలని డిమాండ్ చేయడంలో మోడీ ప్రభుత్వం దక్షిణార్థ దేశాల సరసన నిలబడాలి. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక దూరదృష్టితో వ్యవహరించి, భారతదేశ చమురు దిగుమతుల వనరులను వైవిధ్యభరితంగా మార్చుకుని ఉంటే, దేశం ఈరోజు ఇంతటి దుర్బల స్థితిలోకి నెట్టబడేది కాదు.

వచ్చే నెలలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటం అత్యవసర జాతీయ ప్రాధాన్యతగా మారాలి. ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా అది ఆహార ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయుల జీవనోపాధి, దేశ ఆర్థిక వ్యవస్థ రెండూ తీవ్ర సంక్షోభంలో మునిగిపోతాయి. ఎరువుల సరఫరాను సుగమం చేయడానికి, ఆలస్యం చేయకుండా వాటిని పంపిణీ చేయడానికి మోడీ ప్రభుత్వం తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. కానీ మోడీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో షరీకవడం ద్వారా దేశ ఆర్థిక ప్రయోజనాలను రక్షించడంలో విఫలమైంది. ఇరాన్‌పై ఆ రెండు దేశాల దురాక్రమణ ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ప్రత్యక్ష కారణమైంది. ఎన్నికల్లో మోసపూరితమైన తప్పుడు ప్రచారం ద్వారా ఓట్లు సాధించే ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్థిక లోటుపాట్లను ఎన్నికలకు ముందు ప్రజల నుండి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు.

లేబర్ కోడ్‌లు

ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కేవలం నాలుగు రోజులకే సెంట్రల్ రూల్స్ నోటిఫికేషన్ ద్వారా లేబర్ కోడ్‌లను అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం తన మోసపూరితమైన వైఖరిని బయట పెట్టుకుంది. ఈ లేబర్ కోడ్‌లను 2026 ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు నోటిఫికేషన్‌ను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసింది. తద్వారా, న్యాయమైన కనీస వేతనాలు, మానవీయ పని వేళలు, గౌరవప్రదమైన జీవన పరిస్థితులను డిమాండ్ చేస్తూ కార్మికులు చేసిన విస్తృత పోరాటాలను, ప్రదర్శనలను అది నిర్లక్ష్యం చేసింది. ఇది బిజెపి కార్మికవర్గ వ్యతిరేక ధోరణికి ప్రబల నిదర్శనం. ఈ నేపథ్యంలో, కొత్తగా కేంద్రం నోటిఫై చేసిన నిబంధనలను ప్రస్తుత రూపంలో అమలు చేయడానికి బదులుగా, భారత రాజ్యాంగం తమకు కల్పించిన శాసన అధికారాలను ఉపయోగించి లేబర్ కోడ్‌లకు తగిన సవరణలను తీసుకురావాలని, కార్మికుల హక్కులను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పార్టీ పిలుపునిచ్చింది.

గత రెండు నెలలుగా, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌.సి.ఆర్‌) అనూహ్యమైన, ఆకస్మిక కార్మిక వర్గ పోరాటాల ఉధృతిని ఎదుర్కొంది. ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, వలస కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసేవారు ఈ నిరసనలకు నాయకత్వం వహించారు. వీరిలో చాలామంది ఇటీవల పనిలో చేరిన యువ కార్మికులు. దాదాపు అన్ని సందర్భాల్లోనూ, ఈ పోరాటాలు ప్రధాన కార్మిక సంఘాల నాయకత్వం లేకుండానే సహజసిద్ధంగా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం అణచివేతకు పాల్పడింది. ఫలితంగా వందలాది మంది కార్మికులను అరెస్టు చేశారు. వారిలో పలువురు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. అయినప్పటికీ, ఈ నిరసనల స్థాయి, ఉద్యమ పట్టుదల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల పెంపును ప్రకటించేలా చేశాయి. ఆ పెంపు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ. ప్రజల జీవితాలు, జీవనోపాధి ప్రతికూలంగా ప్రభావితమవుతున్న ఈ అల్లకల్లోల సమయాల్లో, ఎర్రజెండా మాత్రమే ప్రజలకు నిజమైన ఊరటనిస్తుందని మరోసారి రుజువైంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ప్రజలు ఇచ్చే సూచనలు, సలహాల ఆధారంగా రాబోయే కాలంలో ప్రజలను వేధిస్తున్న సమస్యలను పార్టీ మరింత ఉధృతంగా చేపడుతుంది. అన్ని సవాళ్ల మధ్య పార్టీ మరింత ఎదిగేందుకు తగిన దిద్దుబాటు చర్యలను కూడా తీసుకుంటాము.

ma baby

వ్యాసకర్త – సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం. ఎ. బేబీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్